కవితానుభూతులు


కవిత్వాన్ని తినాలా...?

తీయని పండువలె ఆస్వాదించాలా,

మనసుకు మధురానుభూతి నింపే

మకరందఫలమై మురిపించాలా॥


కవిత్వాన్ని త్రాగాలా...?

గంగాజలమై గుండెలో పారే

భావసుధగా గ్రోలుతూ 

బ్రతుకును బలంగా మలచాలా॥


కవిత్వాన్ని చవిచూడాలా...?

తేనెలో ముంచిన తియ్యని పలుకులా,

భావాల మకరందం నాలుకపై చిందించగా,

ప్రతి అక్షరాన్ని అమృతమయం చేయాలా॥


కవిత్వాన్ని ఆఘ్రాణించాలా...?

విచ్చుకున్న పూల పరిమళంలా,

వాక్యాల సౌరభాలను పీలుస్తూ,

వెలుగుల వైపు నడిపించాలా॥


కవిత్వాన్ని పూయించాలా...?

మొగ్గలో దాగిన మాధుర్యంలా,

మనసులోని భావాలను వికసింపజేస్తూ,

అక్షరకుసుమాలతో జగతిని అలంకరించాలా॥


కవిత్వాన్ని శోధించాలా...?

సాగరగర్భంలోని ముత్యంలా,

భావలోకపు లోతులను అన్వేషిస్తూ,

సత్యసౌందర్యాలను వెలికితీయాలా॥


కవిత్వాన్ని అనుభవించాలా...?

కన్నీటిలోని కరుణగా,

నవ్వులోని నవరసంగా,

ప్రతి స్పందనలో ప్రతిధ్వనింపజేయాలా॥


కవిత్వాన్ని అనుసరించాలా...?

సత్యానికి సారథిగా,

మానవతకు మార్గదర్శిగా,

మంచితనానికి మకుటమై వెలగాలా॥


కవిత్వాన్ని ప్రోత్సహించాలా...?

కొత్త కలాలకు రెక్కలిచ్చి,

నూతన స్వరాలకు వేదికగా నిలిచి,

అక్షరాలకు అభయమివ్వాలా॥


కవిత్వాన్ని గుండెలో దాచుకోవాలా...?

అమ్మ జోలపాటలా,

గురువు బోధలా,

జీవితాంతం జ్ఞాపకంగా నిలుపుకోవాలా॥


కవిత్వాన్ని రమ్యంగా తీర్చిదిద్దాలా...?

చంద్రికను పదాల్లో దించి,

ఇంద్రధనుస్సును పంక్తుల్లో పేర్చి,

హృదయాలను హత్తుకునేలా॥


కవిత్వాన్ని మధురంగా పాడాలా...?

కోకిల గానంలా వినిపిస్తూ,

వీణానాదంలా మురిపిస్తూ,

విశ్వమంతా పరవశింపజేయాలా॥


కవిత్వాన్ని ఏమి చేయాలా...?

తినాలి... త్రాగాలి... రుచిచూడాలి...

వాసనచూడాలి... అనుభవించాలి...

అనుసరించాలి... ఆరాధించాలి...॥


కవిత్వం అక్షరాల సమూహం కాదు,

అది హృదయం ఆలపించే మౌనసంగీతం;

కవిత్వం కాగితంపై పంక్తులు కాదు,

అది జీవితాన్ని పరిమళింపజేసే ప్రాణసౌరభం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog