వంకర విన్యాసాలు (వంకరటింకరలు)
వంకర బుద్ధులు పెరుగుతున్నాయి,
విలువల వేర్లు తెగిపోతున్నాయి,
వివేక దీప్తులు మసకబారుతున్నాయి,
వంచన మేఘాలు కమ్ముతున్నాయి॥
వంకర నడతలు నడుస్తున్నాయి,
నీతిని నెట్టివేస్తున్నాయి,
నిజం నడిచే బాటను వదలి
నీచ మార్గాలు వెదుకుతున్నాయి॥
వంకర మాటలు వినబడుతున్నాయి,
విషపు జల్లులు కురిపిస్తున్నాయి,
తేనె పూసిన పెదవుల వెనుక
తీరని తుఫాన్లు దాచుతున్నాయి॥
వంకర మార్గాలు విస్తరిస్తున్నాయి,
మనసుల దిక్కులు మార్చుతున్నాయి,
అడ్డదారుల ఆకర్షణతో
ఆత్మగౌరవం అమ్ముతున్నాయి॥
వంకర చూపులు చూస్తున్నాయి,
లోపాలనే లెక్కిస్తున్నాయి,
పర్వతమంత మంచితనాన్ని వదిలి
పొరపాటునే పెద్దదిగా చేస్తున్నాయి॥
వంకర చేష్టలు సాగుతున్నాయి,
వింత నాటకాలు ఆడుతున్నాయి,
ఒకటి చెప్పి మరొకటి చేసి
ఊసరవెల్లులై తిరుగుతున్నాయి॥
వంకర రాబడులు వస్తున్నాయి,
వంచన గూడులు కడుతున్నాయి,
చెమట చుక్కల విలువను మరిచి
చీకటి దారులు ఎంచుకుంటున్నాయి॥
వంకర రాతలు రాస్తున్నాయి,
వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి,
అక్షరాలకు అలంకారాలు అద్ది
అసత్యాలకు అభిషేకం చేస్తున్నాయి॥
వంకర మనుషులు పెరుగుతున్నారు,
మమతల మూలాలు నరికేస్తున్నారు,
మనిషిలోని మానవత్వాన్ని
మాయల సంతలో వేలం వేస్తున్నారు॥
వంకర బతుకులు బ్రతుకుతున్నాయి,
బంధాలను దూరం చేస్తున్నాయి,
ధనం గుట్టలు పేరుకున్నా
ధర్మాన్ని మాత్రం కోల్పోతున్నాయి॥
అయినా... సూటి బుద్ధులు నిలవాలి,
సత్య నడతలు సాగాలి,
మధుర మాటలు పలకాలి,
మంచి మార్గాలు వెలగాలి॥
నిర్మల చూపులు వికసించాలి,
నిస్వార్థ చేష్టలు పెరగాలి,
న్యాయ రాబడులు రావాలి,
నిజమైన రాతలు నిలవాలి॥
మంచి మనుషులు మిగలాలి,
మానవత పరిమళించాలి,
అందమైన బతుకులు విరియాలి,
ఆనంద దీపాలు వెలగాలి॥
అప్పుడు ఈ భువి నందనవనమై,
ఆనందగీతం ఆలపిస్తుంది,
మనిషి మనిషిని ప్రేమించే
మానవ యుగం ఆవిష్కృతమవుతుంది॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment