అక్షర విన్యాసాలు


అక్షరజల్లులు కురిపిస్తా,

ఆనందధారలు పారిస్తా,

అక్షరగంగను ప్రవహింపజేస్తా,

అమృతస్నానం చేయిస్తా॥


అక్షరవిత్తనాలు నాటుతా,

ఆలోచనలమొక్కలు మొలిపిస్తా,

అక్షరతోటను పెంచుతా,

అందాలలోకము చూపిస్తా॥


అక్షరపువ్వులు పూయిస్తా,

అనురాగపరిమళాలు చల్లిస్తా,

అక్షరమకరందం పంచుతా,

అంతరంగాలను అలరిస్తా॥


అక్షరదీపాలు వెలిగిస్తా,

అజ్ఞానచీకట్లు తొలగిస్తా,

అక్షరజ్యోతులు ప్రసరింపజేస్తా,

అభ్యుదయమార్గం కనబరుస్తా॥


అక్షరామృతము త్రాగిస్తా,

ఆనందసాగరంలో ముంచేస్తా,

అక్షరరాగాలు ఆలపిస్తా,

అలసిన మనసులు మురిపిస్తా॥


అక్షరకిరణాలు విరజిమ్ముతా,

ఆశల రెక్కలు తొడిగిస్తా,

అక్షరాకాశంలోకి తీసుకెళ్తా,

అనంతవిశ్వాలు వీక్షింపజేస్తా॥


అక్షరమే నా ఆభరణం,

అక్షరమే నా అభ్యుదయం,

అక్షరమే నా ఆరాధనం,

అక్షరసౌరభమే నా జీవనం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog