చూస్తున్నా...


మోముల్లో నవ్వులు చూస్తున్నా,

నవ్వుల్లో వెలుగులు చూస్తున్నా,

వెలుగుల్లో రంగులు చూస్తున్నా,

రంగుల్లో హరివిల్లు చూస్తున్నా॥


పలుకుల్లో ప్రేమను చూస్తున్నా,

ప్రేమల్లో అందాలు చూస్తున్నా,

అందాల్లో ఆనందం చూస్తున్నా,

ఆనందాల్లో లోకం చూస్తున్నా॥


లోకంలో మనుషులను చూస్తున్నా,

మనుషుల్లో జీవితాలు చూస్తున్నా,

జీవితాల్లో ఆశలు చూస్తున్నా,

ఆశల్లో భవితను చూస్తున్నా॥


కన్నుల్లో కలలు చూస్తున్నా,

కలల్లో కొత్త మార్గాలు చూస్తున్నా,

మార్గాల్లో గమ్యాలు చూస్తున్నా,

గమ్యాల్లో విజయాలు చూస్తున్నా॥


చేతుల్లో చెలిమిని చూస్తున్నా,

చెలిమిలో మమతలు చూస్తున్నా,

మమతల్లో కరుణను చూస్తున్నా,

కరుణలో దైవాన్ని చూస్తున్నా॥


ప్రకృతిలో పరిమళం చూస్తున్నా,

పరిమళంలో ప్రశాంతి చూస్తున్నా,

ప్రశాంతిలో పరమసుఖం చూస్తున్నా,

సుఖాల్లో జీవనార్థం చూస్తున్నా॥


అక్షరాల్లో అమృతం చూస్తున్నా,

కవిత్వంలో అనుభూతి చూస్తున్నా,

భావాల్లో మాధుర్యం చూస్తున్నా,

మాధుర్యంలో మానవత్వం చూస్తున్నా॥


సృష్టిలో సౌందర్యం చూస్తున్నా,

సౌందర్యంలో సత్యం చూస్తున్నా,

సత్యంలో శివాన్ని చూస్తున్నా,

శివంలో సుందర జగాన్ని చూస్తున్నా॥


ప్రతి రూపంలో ఒక భావాన్ని చూస్తున్నా,

ప్రతి భావంలో ఒక జీవాన్ని చూస్తున్నా,

ప్రతి జీవంలో దైవాన్ని చూస్తున్నా,

ప్రతి దైవంలో ప్రేమతత్వం చూస్తున్నా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog