కవన విజయం
కవనం ఒక కల కాదు,
కాలంతో చేసే సంభాషణం,
భావాలకు రూపమిచ్చే
భారతీదేవి ప్రసాదం॥
మనసులో మెరిసిన మెరుపును
మాటలలో బంధించడమే,
అంతరంగంలో పొంగిన అలలను
అక్షరాలుగా మలచడమే॥
కవనమంటే కేవలం పదాలు కాదు,
కన్నీటి చుక్కల కథలు,
నవ్వుల వెన్నెల జల్లులు,
జీవిత గమనపు గీతలు॥
కవనమంటే సత్యాన్వేషణ,
సమాజానికి స్ఫూర్తిదానం,
చీకట్లలో దీపమై వెలిగి
చైతన్యానికి మార్గదర్శనం॥
పూల సుగంధం గాలిలో విరియగా,
కవితా పరిమళం మనసుల్లో విరియాలి,
నదులు సాగరాన్ని చేరినట్లు
కవనం జనమనసులను చేరాలి॥
కవన విజయం అంటే
పురస్కారాల పర్వం కాదు,
పాఠకుని పెదవిపై చిరునవ్వు,
స్పందనలను రేకెత్తించడమే॥
ఒక మంచి కవిత పుడితే
వెయ్యి మనసులు పులకరిస్తాయి,
ఒక మంచి భావం పలికితే
లక్షల మనసులు మేల్కొంటాయి॥
అక్షరమే ఆయుధమై,
భావమే బలమై,
మానవతే లక్ష్యమై
కవనం ముందుకు సాగాలి॥
అప్పుడు ప్రతి కవి కల సాకారమై,
ప్రతి కవితా మణిహారమై,
ప్రతి పాఠకుడు పులకించగా,
సాధించినదే నిజమైన కవన విజయం॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment