కారు మబ్బులు
కారు మబ్బులు కమ్ముతుంటే,
కడలి గర్భం నుంచి కదిలివస్తుంటే,
నింగి నిండా నీలి చీరలు కప్పుకొని
నవ్వుల జల్లులు జారవిడుస్తుంటే॥
కారు మబ్బులు కురుస్తుంటే,
కాసుల వానలా కురిపిస్తుంటే,
ఎండిన నేల ఎదురు చూసిన దాహానికి
అమృతధారలు అందిస్తుంటే॥
కారు మబ్బులు కదులుతుంటే,
కొండలపై నుంచి పరుగెడుతుంటే,
గాలికి చేయిచ్చి గంతులేస్తూ
గగనవీధుల్లో విహరిస్తుంటే॥
కారు మబ్బులు కాలువలను పారిస్తుంటే,
కారు మబ్బులు కాలువలు పారేలా చేస్తుంటే,
కుంటలు చెరువులు నింపేస్తుంటే,
గలగలలాడే జలరాగాలతో
పల్లెలతో పచ్చని పాట పాడిస్తుంటే॥
కారు మబ్బులు కలవరపరుస్తుంటే,
మెరుపు తీగలు మిలమిలలాడిస్తుంటే,
ఉరుముల డప్పులు మోగిస్తూ
ఉలిక్కిపడే వేళలు తెస్తుంటే॥
కారు మబ్బులు కర్షకులను ఆకట్టుకుంటుంటే,
కనుల నిండా ఆశలు నాటుతుంటే,
నాగలి చాళ్లలో నవజీవనాన్ని
నవ్వుతూ చిగురింపజేస్తుంటే॥
కారు మబ్బులు కరువును పారదోలుతుంటే,
కన్నీటి గాథలు తుడిచేస్తుంటే,
బీడువారిన భూమి ఒడిలో
బంగారు పంటలు పండిస్తుంటే॥
కారు మబ్బులు కడలిని కవ్విస్తుంటే,
కెరటాల నృత్యాలు చేయిస్తుంటే,
అలల హారతులతో ఆకాశానికి
ఆనంద సందేశం పంపిస్తుంటే॥
కారు మబ్బులు కరుణగా మారితే,
కలలన్నీ నిజమై నిలుస్తాయి,
ప్రకృతి తల్లి ప్రేమకు ప్రతిరూపమై
ప్రాణికోటికి ప్రాణధారలవుతాయి॥
కారుమబ్బులను స్వాగతిద్దాం,
కాలువలు పారనిద్దాం,
కరువుకాటకాలు పారద్రోలుదాం,
కాసుల వర్షం కురిపించుదాం॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment