బాగున్నది (గజల్)


సద్గురువులు బోధించే ఉపదేశం బాగున్నది,

మంచిదారి చూపించే సందేశం బాగున్నది॥


అవకాశం విస్తరించ కలల జగము విరియంగా,

రెక్కలిప్పి ఎగిరించే ఆకాశం బాగున్నది॥


వాసంతం రాగానే పరిమళాలు పొంగంగా,

పూనవ్వులు పంచే ఈ మధుమాసం బాగున్నది॥


ఆ ప్రాంతం ప్రశాంతమై సిరిసంపద నింపంగా,

మానవతను చాటుతున్న ఆ దేశం బాగున్నది॥


ఆ రూపం సాత్వికమై సౌమ్యతలను చాటంగా,

చూపరులను ఆకట్టుకునే ఆ వేషం బాగున్నది॥


జ్ఞానదివ్వె వెలగంగా చీకటులను తరమంగా,

బాటలన్ని వెలిగించే ప్రకాశం బాగున్నది॥


మనసు మనసు కలిసేలా అనురాగం పెరగంగా,

బంధములను నిలబెట్టే విశ్వాసం బాగున్నది॥


సత్యబోధ సారమంత హృదయముల నిండంగా,

జీవితములు వెలిగించే సందేశం బాగున్నది॥


రాజేంద్రుని భావాలలో రాగవాన కురియంగా,

కవన విరులు పూయించే ఉద్దేశం బాగున్నది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog