బాటలు పట్టాలని (గజల్)


హృదయం చెబుతుంది మంచిబాట పట్టాలని,

పాదాలు సూచిస్తున్నాయి పూలబాట పట్టాలని॥


కన్నులు వెదుకుతున్నాయి వెలుగుబాట కోసమని,

కిరణాలు ఆదేశిస్తున్నాయి జ్ఞానబాట పట్టాలని॥


చేతులు రెండు ముందుకు వస్తున్నాయి సేవచేయమని,

చిరునవ్వులు ఆహ్వానిస్తున్నాయి స్నేహబాట పట్టాలని॥


పెదవులు ప్రేరేపిస్తున్నాయి సత్యాన్నే పలకాలని,

పలుకులు ప్రబోధిస్తున్నాయి నీతిబాట పట్టాలని॥


తల్లిదండ్రులు బోధిస్తున్నారు సూటిబాట వదలవద్దని,

అనుభవాలు నేర్పిస్తున్నాయి ధర్మబాట పట్టాలని॥


గురువులు నిర్దేశిస్తున్నారు సన్మార్గంలో నడవాలని,

గ్రంథాలు చెబుతున్నాయి విజ్ఞానబాట పట్టాలని॥


బంధాలు కలుపుతున్నాయి మనుషులను దగ్గరగా,

మమతలు మొండికేస్తున్నాయి ఆత్మీయబాట పట్టాలని॥


ప్రకృతి పలుకుతోంది పచ్చదనము పెంచమని,

చెట్లు కోరుతున్నాయి పర్యావరణబాట పట్టాలని॥


అక్షరాలు అడుగుతున్నాయి ఆలోచనలు పంచమని,

భావాలు బ్రతిమాలుతున్నాయి కవితబాట పట్టాలని॥


తెలుగుతల్లి పిలుస్తుంది తియ్యగా మాట్లాడమని,

తెలుగు గుండె పురికొల్పుతోంది తెలుగుబాట పట్టాలని॥


రాజు కలం కురిపిస్తుంది నవరసాల జల్లులు,

సాహితీలోకం అభ్యర్థిస్తుంది అక్షరబాట పట్టాలని॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog