మిత్రులను కలుసుకుంటున్నా...
మిత్రులను కలుసుకుంటున్నా,
మురిపాల ముచ్చట్లు చెబుతున్నా,
మనసుకు మనసును కలుపుకుంటూ
మమతల వంతెన వేస్తున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
కష్టాలను మరచిపోతున్నా,
కన్నీటి జాడలు చెరిపేస్తున్నా,
స్నేహపు చల్లని నీడలో కూర్చొని సేదతీరిపోతున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
కుషీ చేసుకుంటున్నా... కేరింతలు కొడుతున్నా,
చిరునవ్వుల పూలు పూయిస్తున్నా,
చిన్ననాటి జ్ఞాపకాల వీధుల్లో చిలిపిగా తిరుగుతున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
కాలక్షేపం చేస్తున్నా...
కబుర్లను చేబతున్నా, కాలానికి రంగులు అద్దుతున్నా,
క్షణాలను ముత్యాలుగా మార్చుకొని గుండెలో దాచుకుంటున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
కోతలు కోస్తున్నా...
చమత్కారాలు విసురుతున్నా, సరదాల వర్షం కురిపిస్తున్నా,
నవ్వుల నావలో ప్రయాణిస్తూ నింగిని తాకుతున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
ఆస్వాదిస్తున్నా...
కమ్మదనాలు ఆస్వాదిస్తున్నా, కాఫీ కప్పుల కబుర్లలో,
టీ తాగిన తీపికన్నా స్నేహమే తియ్యనిదంటున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
చదువుతున్నా...
కవితలను చదువుతున్నా, భావాల లోకంలో విహరిస్తున్నా,
అక్షరాల పరిమళాలను పీలుస్తూ ఆనందసాగరంలో తేలుతున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
సాగిస్తున్నా... స్నేహయాత్ర సాగిస్తున్నా,
సంతోషాలను పంచుతున్నా,
మిత్రులతో గడిపిన ప్రతి క్షణాన్ని మధురగీతంగా మలుచుకుంటున్నా॥
మిత్రులను కలుసుకుంటున్నా...
పాడుతున్నా...
జీవితగానం పాడుతున్నా, జ్ఞాపకాల హారతి ఇస్తున్నా,
మిత్రుల ప్రేమతో నిండిన బతుకును మధురంగా ఆస్వాదిస్తున్నా॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment