చెంతకురా (గజల్)
ఎర్రచీర ఎంచుకున్న ఎగ్గులాడి చెంతకురా,
తెల్లచీర తెచ్చుకున్న మాయలాడి చెంతకురా॥
మందహాస మల్లెలల్లే మురిపాల చిన్నదానా,
బులుగుచీర పట్టుకొనీ వగలాడి చెంతకురా॥
కాటుకంటి చూపులతో కవ్వించే కలువబాలా,
నల్లచీర కట్టుకొనీ నగులాడి చెంతకురా॥
చిన్ననడక చిందులతో చిలిపిగా నడిచే దానా,
కొత్తచీర చుట్టుకొనీ కులుకులాడి చెంతకురా॥
చందమామ వెన్నెలంత చల్లనైన చెలియవై,
పట్టుచీర పైటేసుకొనీ సోకులాడి చెంతకురా॥
పచ్చని పైరులాంటి పరువాల పడుచుదానా,
పచ్చచీర ధరియించీ మిటుకులాడి చెంతకురా॥
పసిమి బంగారు వన్నెలల్లే కాంతులు చల్లేదానా,
పసుపుచీర ముసుగేసీ టెక్కులాడి చెంతకురా॥
ఇంద్రధనుస్సు రంగులన్ని ఒలికించే అందగత్తె,
రంగులచీర వేసుకొనీ వన్నెలాడి చెంతకురా॥
ఊరునిండా ఒయ్యారాలు ఊపిరిగా నింపేదానా,
నేతచీర కప్పుకొనీ ఎమ్మేలాడి చెంతకురా॥
మల్లెపూల పరిమళాలు మనసునంత నింపుటకై,
మెల్లమెల్ల అడుగులేస్తూ బొంకులాడి చెంతకురా॥
రాజు గుండె రాగమంతా నీకోసమే పలుకుతుంటే,
ముద్దూముచ్చట తీర్చుటకై మాటలాడి చెంతకురా॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment