అల్లుతా అక్షరాలు (గజల్) 


ఆలోచనలు అందించగ అల్లుతా అక్షరాలు

భావాలు బయటపెట్టంగ బరుకుతా అక్షరాలు


పూలతోటన చక్కని పదపుష్పాలు పూయించగ 

కలముచేబట్టి కమ్మగా కార్చుతా అక్షరాలు


వాక్కులరాణి భారతిదేవి కటాక్షము పొందంగ 

కాగితాలపై చక్కగా పేర్చుతా అక్షరాలు


పాఠకుల మనసులను దోచుకొని పరవశపరచంగ 

హృదులను హత్తుకొనేలా కూర్చుతా అక్షరాలు


సమావేశాల్లో గళమెత్తి గేయాలు పాడంగ 

సాహిత్యాన నిలిచేలా చెక్కుతా అక్షరాలు


కర్షకునిలా కష్టపడి సేద్యమును కొనసాగించ

కవితాసిరులు పండేలా చల్లుతా అక్షరాలు


కొమ్మలో కొమ్మనై పువ్వులో పువ్వునై చుట్టూ

సౌరభాలను వీచేలా చిమ్ముతా అక్షరాలు


రవికాంచని తావులకు చేరి వీక్షించి వర్ణించ

వెలుగులను వెదజల్లేలా విసురుతా అక్షరాలు 


భారతీయ భాషలందు బంగారు ఆభరణంలా

తెలుగుతల్లి మురిసేలా అమర్చుతా అక్షరాలు 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog