ఎంచుకో? (గజల్)
అయ్యిందా అరుణోదయం వెలుగులబాట ఎంచుకో
అయ్యిందా చంద్రోదయం వెన్నెలబాట ఎంచుకో॥
కళ్లు తెరచి చూడు నడుస్తున్న ఆధునిక ప్రపంచాన్ని
అయ్యిందా నేత్రోదయం చక్కనిబాట ఎంచుకో॥
గురువులచెంత సరియైన విద్యాబుద్ధులు నేర్చుకో
అయ్యిందా ఙ్ఞానోదయం మేలైనబాట ఎంచుకో॥
కలలొచ్చి కవ్వించి కుతూహలపరచి మురిపించితే
అయ్యిందా నిద్రోదయం వికసితబాట ఎంచుకో॥
పొద్దుపొద్దునే చెట్లు చిగురించి మొగ్గలు తొడిగితే
అయ్యిందా పుష్పోదయం పరిమళబాట ఎంచుకో॥
మధుమాసం ఏతెంచగా మనసులు పొంగిపొర్లితే
అయ్యిందా వసంతోదయం మల్లెబాట ఎంచుకో॥
సాహితీసేద్యంలో సాగుచేస్తు సతమవుతుంటే
అయ్యిందా అక్షరోదయం సాహిత్యబాట ఎంచుకో॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment