అందాలు (గజల్)


మదిలోన ఆలోచనలు పారితే అందం 

పేజీలపై భావాలు కూరితే అందం 


కర్షకులు వర్షాలకై ఎదురుచూస్తుంటే 

నింగిలో నీలిమబ్బులు కమ్మితే అందం


కొమ్మలు తొడిగి పైకెదిగి ఆకులు చిగురించి 

తోటలో మొక్కలు పూలుపూచితే అందం 


కన్న కలలు ఫలించి ఆశలు నెరవేరితే 

మోములపై చిరునవ్వులు ముసిరితే అందం 


కప్పలు అరుస్తుంటే చినుకులు పడుతుంటే 

ఏటిలోన నీటి జాలు సాగితే అందం 


చల్లని గాలి వీచి సంబరపరుస్తుంటే  

కడలిలో కెరటాలు ఎగిసిపడితే అందం 


ప్రకృతి పులకించి పరవశపరుస్తుంటే 

భువిలోన పచ్చచెట్లు మొలిచితే అందం 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog