విందులు 


ఎదురుచూస్తున్న నేత్రాలకు కనులవిందు ఇవ్వనా 

వెతుకుతున్న శ్రవణాలకు వీనులవిందు ఇవ్వనా 


నిత్యం చెమటచుక్కలు కార్చే శ్రామిక జీవుల

వేసారిన హృదయాలకు మనోవిందు ఇవ్వనా


పగటికలలు కంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్న 

రసికుల రంజింపజేయుటకు రసవిందు ఇవ్వనా 


స్వాతిచిప్పల్లా చినుకులకై కాచుకొనిచూస్తున్న

పాఠకుల మురిపించుటకు కవితావిందు ఇవ్వనా 


తెలుగుభాషా తియ్యందనాలకు తడుముకుంటున్న 

సాహితీ అభిమానులకు అక్షరవిందు ఇవ్వనా  


కబుర్లకోసమని కలవరపడుతున్న చిన్ననాటి

మిత్రుల ముచ్చటపరచుటకు స్నేహవిందు ఇవ్వనా 


అందాల దృశ్యాలుచూసి ఆనందం కోరేటి

ప్రకృతి ప్రియుల ప్రీతికి భావాలవిందు ఇవ్వనా 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog