నెచ్చెలితో సరసాలు
తొందరగా చెంతకు రమ్మని పిలవనా నెచ్చెలిని
సరససల్లాపాలాడి నవ్వించనా నెచ్చెలిని
కబుర్లలో దించి కవ్వించి కుతూహలపరచనా
తేనెపలుకులు చిందుతూ అలరించనా నెచ్చెలిని
అందాలు చూపించి ఆనందాలు అందించనా
కమ్మనైన మాటలతో ఊరించనా నెచ్చెలిని
బాధలను మరిపించనా కోపాన్ని తగ్గించనా
ఓదార్చి ఒప్పించనా లాలించనా నెచ్చెలిని
ఆకాశానికెత్తి తారకల మధ్యన తిప్పించి
అలకపానుపును దింపి బుజ్జగించనా నెచ్చెలిని
చేతులను పట్టుకొని వెన్నెలలో విహరింపజేసి
మల్లెల మత్తులో దింపి మురిపించనా నెచ్చెలిని
ఆటలు ఆడించి నెమలిలాగా నాట్యమాడించి
రసరాగాలతో రంజింపజేయనా నెచ్చెలిని
మనసును దోచుకొని మమతా మోహాలు పంచినందుకు
ప్రేమదేవతలాగ ఆరాధించనా నెచ్చెలిని
కళ్లను కట్టిపడవేసి కోర్కెలు రేకెత్తించే
అపురూప అందాన్ని అభినందించనా నెచ్చెలిని”
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment