గజల్ సౌందర్యం
తెలుగు గజల్ సౌందర్యం పాఠకులకు అందిస్తా
గొప్ప గజల్ మాధుర్యం సువ్రతులకు అందిస్తా
పారసీ నుంచి మనకొచ్చిన గానయోగ్య ద్విపదల
తెనుగు గజల్ విశిష్టతలను ఎల్లరకు అందిస్తా
ప్రారంభంలోనే మనసుల తట్టే పంక్తులుగా
మత్లాలను మొదట గజల్ ప్రేమికులకు అందిస్తా
చెవులు విప్పి అతి శ్రద్ధగా ఆలకించే వారికి
మక్తాలను చివర గజల్ ప్రేరకులకు అందిస్తా
ముచ్చటైన మాటలను లయాత్మకంగా అమర్చుతూ
షేర్ల ద్విపాద నడకలను ఆంధ్రులకు అందిస్తా
మంచి పదాలను మరలమరల వినాలనే వారికి
రదీఫులను రమ్యంగా రసజ్ఞులకు అందిస్తా
మాత్రలు సరిగకుదిరేలా అంశానికి అనువుగా
కాఫియాల ఏరి పొదిగి గాయకులకు అందిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment