అక్షరాల అర్పణ 


ఏరి కోరి పేర్చి కూర్చి అందిస్తా అక్షరాలు

వెతికి వేటాడి బాగా అమరిస్తా అక్షరాలు 


గుండ్రని ముత్యాల్లా ఖరీదైన నవరత్నాల్లా

ఒకదానికి మరొకటి చేర్చి అతికిస్తా అక్షరాలు 


మెత్తగ పిండిచేసి మట్టిముద్దల్లా కలగలిపి

పేజీలపై పూసి రాసి అలికిస్తా అక్షరాలు 


అర్థవంతమైన మాటలను చక్కగా ఎన్నుకొని

పదాలలో పంక్తుల్లో అంటిస్తా అక్షరాలు


పరిమళాలు వెదజల్లి మత్తులో ముంచి తూగించి

అందాలను చిందేలా  ఆడిస్తా అక్షరాలు


ముచ్చటైన విషయాలను ముందుంచవలెనని తలచి

చదువరులకు వినయంగా అర్పిస్తా అక్షరాలు


భావాలు కురిపిస్తూ కవనగంగను పారిస్తూ

సాహితీప్రియులకు అంకితమిస్తా అక్షరాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog