పూలు పూయిస్తా


ప్రేమలో దించేందుకై మల్లెపూలు పూయిస్తా

మత్తులో ముంచేందుకై మొగిలిపూలు పూయిస్తా


ప్రకృతి అందాలు పలువురికి పంచుటకు తిరుగుతూ

పథమంతా చూపుటకు గులాబిపూలు పూయిస్తా


అంతరంగాలను తాకే అనురాగం నింపుతూ

మోముల నవ్వులకై చామంతిపూలు పూయిస్తా


తీయతీయని అనుభూతుల తేనియలను పంచుతూ

మకరందమును గ్రోల మందారపూలు పూయిస్తా


పల్లె పడతుల మనసు పరవశింపజేస్తూ

రంగులను వెదజల్లే బంతిపూలు పూయిస్తా


రమణీమణుల మస్తకాలు రంజింపజేయాలని

జడలో తురుముటకు కనకాంబరపూలు పూయిస్తా


మురికివాడల నివాసుల మనసులు మురిపించుటకై 

సౌరభాలు వీచే సంపంగిపూలు పూయిస్తా


ఇంటి దొడ్లలో నాటించి పందిరులను కట్టించి

మాలలు అల్లుటకు సన్నజాజిపూలు పూయిస్తా


దేవాలయాలు దర్శించి దైవాన్ని కొలిచేందుకు

చిదాత్మ పూజకై పారిజాతపూలు పూయిస్తా


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog