నా అక్షరవాసం


ఎంత ఎత్తుకు ఎగిరినా చివరకు —

అక్షరాల మీదనే వాలుతా,

ఎన్ని ఆకాశపు అందాలు చూసినా —

అక్షరాల వెలుగులనే వెతుకుతా!


ఎన్ని లోకాలు వీక్షించినా —

అక్షరాల అద్దంలో చూస్తా,

ఎన్ని ఆనందాలు పొందినా —

అక్షరాల అమృతం ఆస్వాదిస్తా!


ఎన్ని ఆలోచనలు తట్టినా —

అక్షరాల రూపం ఇస్తా,

ఎన్ని భావాలు పుట్టినా —

అక్షరాల ఒడిలో పెడతా!


ఎన్ని కలలు కంటినా —

కలానికి ఊపిరి పోస్తా,

ఎన్ని అనుభూతులు పొంగినా —

పదాల పూలను పూయిస్తా!


ఎంతమంది స్నేహితులున్నా —

అక్షరాలతోనే ముచ్చటిస్తా,

మౌనంలో కూడా నాతో ఉండే —

అక్షర బంధాన్ని ప్రేమిస్తా!


కాలం మారినా, లోకం మారినా —

అక్షరాల తోడు వీడను,

చివరి శ్వాస వరకు కూడా —

అక్షర దీపం ఆరనివ్వను!


అక్షరాలే నా ఆలోచనామృతం,

అక్షరాలే నా ఆనందసాగరం;

అక్షరాలే నా అలరులవనం,

అక్షరాలే నా సాహిత్యసౌరభం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog