వానమ్మా రావమ్మా!
వానమ్మా రావమ్మా — వయ్యారంగా రావమ్మా!
చినుకుల ముత్యాల హారాలు చల్లమ్మా!
చిటపట చినుకులతో చిందులు తొక్కమ్మా,
చిరునవ్వుల పూలతో పుడమినంతా నింపమ్మా!
మబ్బుల మేళాలు మోగించుకుంటూ రావమ్మా,
మెరుపుల మురిపాలు విసురుకుంటూ రావమ్మా!
ఉరుముల నాదాలతో గళమెత్తి పాడమ్మా,
ఉల్లాస నృత్యాలతో ఊర్లన్నీ ఆడించమ్మా!
గలగలా సెలయేళ్ల గానాలు వినిపించమ్మా,
పరవళ్లు తొక్కే వాగులకు జీవకళ జోడించమ్మా!
చెరువుల గుండెల్లో జలకళను నింపమ్మా,
చెరగని జీవధారగా జనజీవనం నిలపమ్మా!
మోడైన చెట్లకు మళ్లీ ప్రాణముపోసి,
మోడువారిన బతుకులకు మోదాలు పంచి,
చిగురుల సింగారంతో చెట్లను మురిపించి,
చిలకల కోలాహలంతో చెలిమిని పెంచమ్మా!
రైతన్న కలలన్నీ పంటలుగా పండించమ్మా,
రైతమ్మ కళ్లల్లో ఆనందాలు చిందించమ్మా!
నాగలి కదలికలో కొత్త ఆశలు రేపి,
నవధాన్య లక్ష్మితో లోగిళ్లు నింపమ్మా!
గొంతుల దాహాన్ని గుక్కెడు నీటితో తీర్చి,
గుండెల్లో ఆశలను గంగలా పొంగించి,
కరువనే కాటకాన్ని కడతేర్చి తరిమేసి,
కలకాలం క్షేమాన్ని కానుకగా ఇవ్వమ్మా!
అతివాన వద్దమ్మా — అనర్థాలు తేవద్దమ్మా!
అనువైన జల్లులతో అమృతధార కురిపించమ్మా!
వెలవెలబోయిన వసుధకు వైభవం తెచ్చి,
వెలుగుల వసంతాన్ని విరివిగా పంచమ్మా!
నిత్యకళ్యాణాల సందడిని తెచ్చి,
పచ్చని తోరణాల పండుగలను పంచి,
మంగళ వాయిద్యాల మధురిమలు మోగించి,
మానవతా మందిరంలో మల్లెలు పూయించమ్మా!
వానమ్మా రావమ్మా — వరదాయినివై రావమ్మా!
వసుధకు సిరిసంపదల వజ్రాభరణమవమ్మా!
చినుకమ్మా కురవమ్మా — చిగురాశలు పండించమ్మా!
ఎల్ నినోను తరిమేసి — ఏలనోవులు తీర్చమ్మా!
వానమ్మా! నీకు మనసుంటే
జగమంతా శోభింపజేయమ్మా!
వానమ్మా! నీకు కరుణుంటే
జీవరాశులన్నిటినీ కాపాడమ్మా!
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment