జీవిత పరిణామాలు 


జీవితాలు పుట్టుకొస్తుంటాయి —

జీవన ఆశలు చిగురిస్తుంటాయి!

చిట్టి పాదాలు అడుగులు వేస్తుంటే —

చిరునవ్వుల పువ్వులు విరబూస్తుంటాయి!


జీవితాలు పెరుగుతుంటాయి —

ఎన్నెన్నో కలలు విరుస్తుంటాయి!

చదువుల బాటలో సాగుతుంటే —

చైతన్య దీపాలు వెలుగుతుంటాయి!


జీవితాలు మారుతుంటాయి —

కాలంతో పాటు కదులుతుంటాయి!

కలిమిలేములు ఎదురవుతుంటే —

కష్టాలు సుఖాలు కలుగుతుంటాయి!


జీవితాలు కలుస్తుంటాయి —

అనుబంధ బంధాలు అల్లుకుంటుంటాయి!

మనసులు మమతలు పంచుకుంటుంటే —

మమతల సంబంధాలు పెనవేసుకుంటుంటాయి!


జీవితాలు గడిచిపోతుంటాయి —

జ్ఞాపకాల జడులు మిగులుతుంటాయి!

నిన్నటి ముచ్చట్లు నెమరువేస్తుంటే —

నేటి క్షణాలు కరిగిపోతుంటాయి!


జీవితాలు ఆనందిస్తుంటాయి —

ఆశల హరివిల్లులు విరుస్తుంటాయి!

ఆప్తుల పలుకులు ఆలంబన కాగా —

ఆనంద తరంగాలు ఎగసిపడుతుంటాయి!


జీవితాలు విడిపోతుంటాయి —

విధి మలుపుల్లో దూరమవుతుంటాయి!

కలిసిన దారులు వేరవుతుంటే —

కన్నీటి జల్లులు కురుస్తుంటాయి!


జీవితాలు పండుతుంటాయి —

అనుభవ సారాలు అందిస్తుంటాయి!

తలపండిన పెద్దల మాటలలో —

తరతరాల జ్ఞానాలు తొణికిసలాడుతుంటాయి!


జీవితాలు ముగిసిపోతుంటాయి —

కాలగర్భంలో కలిసిపోతుంటాయి!

విరిసిన పూలు వాడిపోయినా —

వెదజల్లిన సౌరభాలు నిలిచిపోతుంటాయి!


పుట్టుక మొదలై మరణంతో ముగిసే —

ప్రయాణమే కాదు ఈ జీవన గమనం!

పదిమందికి ప్రేమను పంచుతూ సాగితే —

పరిమళిస్తుంది మన జీవిత సౌరభం!


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog