బుద్ధి నుంచి శుద్ధి దాకా వృద్ధి
బుద్ధి ఉంటే — కష్టాల సాగరాన్ని దాటవచ్చు సులభంగా!
బుద్ధి ఉంటే — సమస్యల చిక్కుముడులు విప్పవచ్చు చాకచక్యంగా!
వివేకవంతమైన ఆలోచన నడిపించును సన్మార్గమున,
సద్బుద్ధియే తెచ్చిపెట్టును గౌరవాన్ని జగతియందున!
నిధి ఉన్నంత మాత్రాన నిండునా హృదయంలో సుఖము?
ధనము పెరిగినంత మాత్రాన తీరునా మనిషి దుఃఖము?
దానధర్మములు చేసినప్పుడే కదా ధనమునకు సార్థకత!
పరోపకారమే కాదా పరమనిధి — పరమార్థమేకదా సుఖము!
విధి వ్రాతలంటూ వగచక — వివేకముతో సాగు,
కష్టనష్టాలు ఎదురైనా కర్తవ్యమును వీడకు,
పట్టుదలతో ప్రయత్నించి పతనమునుండి లేచి నిలువు,
కర్మబలమే తోడుగా చేసుకొని విధి భారాన్ని దాటు!
వ్యాధి వచ్చెనని వగచి కుంగుట తగునా మనిషికి?
వైద్యసహాయం పొందకుంటే ముప్పు కాదా ప్రాణానికి?
ధైర్యము, చికిత్స తోడైతే దారులు దొరకవా స్వస్థతకి?
ఆరోగ్యమే మహాభాగ్యము — విలువ తెలుసుకో జీవితానికి!
తిథి మంచిదైనంత మాత్రాన తీరునా ఆశయం?
మంచి తలపులు, మంచి పనులే మంగళానికి సోపానం!
శుభసంకల్పం, శ్రమ కలిసిన శుభఫలితమే సార్థకం!
మంచి మనసుతో చేసే కార్యమే మంగళకారకం!
రంధి రగడలు రేపి రగిలించుట న్యాయమా?
చిన్న విషయమున చిచ్చుపెట్టి చెడగొట్టుట ధర్మమా?
కలహములవల్ల ఫలితము — కన్నీళ్లే మిగులునా?
కలసిమెలసి జీవిస్తే బాంధవ్యాలు నిలువవా?
సంధి కుదుర్చుట సముచితమే — సమసిపోతే విరోధము!
సర్దుబాటుతో సాగినప్పుడే సులభమగును జీవనపథము!
పంతమువీడి ప్రేమ పంచితే పెంపొందును సౌభ్రాతృత్వం!
శాంతిమార్గమే శ్రేయోదాయకం — సఖ్యతయే సౌభాగ్యము!
క్రోధాగ్ని రగిలితే దూరమౌదా శాంతి?
ఆవేశమనే అలలు పొంగితే ఆగిపోదా ప్రగతి?
క్షమాగుణమే కవచమైతే కలుగదా మనశ్శాంతి?
క్రోధావేశాలను కట్టడిచేస్తే దక్కదా విజయకీర్తి?
శుద్ధి ఉంటే — మనసు శోభించి శోభిల్లును జీవితం!
శుద్ధి ఉంటే — మాటల మాధుర్యంతో పెరుగును గౌరవం!
శుద్ధి ఉంటే — కర్మల ద్వారా సమాజానికి సౌఖ్యం!
శుద్ధిగల మనసు, వాక్కు, కర్మలు మానవతకు సౌరభం!
వృద్ధి సాధించుటయే మానవ జీవిత ముఖ్య గమ్యము!
జ్ఞానము పెరిగినప్పుడే లభించును సార్థకత్వము!
స్వయంకృషితో సాగితే విలసిల్లును భవిష్యత్తు!
సర్వతోముఖాభివృద్ధియే సమాజానికి పరమ ప్రాప్తము!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment