కాసిని... కావ్య సౌరభాలు!
కాసిని తేనీరు త్రాగి —
తనువుకు సేదనిస్తా,
కాసిని మాటలు విని —
మనసుకు హాయినిస్తా!
కాసిని కబుర్లు చెప్పి —
కలతలను మరిపిస్తా,
కాసిని నిమిషాలు గడిపి —
నవ్వుల పూలు పూయిస్తా!
కాసిని ఆలోచనలు రేపి —
ఊహలకు రెక్కలు తొడుగుతా,
కాసిని అందాలు చూసి —
ఆనందాల హరివిల్లు విరియిస్తా!
కాసిని చినుకులు చిందితే —
చిగురాశలను చిగురింపజేస్తా,
కాసిని చిరుగాలులు వీస్తే —
చింతల మేఘాలను చెదరగొడతా!
కాసిని వెన్నెల కురిస్తే —
ఊహలను హృదిలో ఊరేగిస్తా,
కాసిని మధురిమలు నిండితే —
మదిలో మల్లెలు పూయిస్తా!
కాసిని అక్షరాలు అల్లి —
అందమైన హారాలు కడతా,
కాసిని పదాలు కూర్చి —
భావాల మాలికలు పేర్చుతా!
కాసిని కవితలు రాసి —
కలాలకు రెక్కలు తొడుగుతా,
కాసిని గేయాలు పాడి —
గుండెల్లో గానాలు మోగిస్తా!
కాసిని కావ్యాలు వెలువరించి —
కవితా సౌరభాలు వెదజల్లుతా,
కాసిని కాలాన్ని ఆస్వాదించి —
కమ్మని జ్ఞాపకాలు మూటగట్టుకుంటా!
కాసిని... కాసిని... అంటూ
జీవనయానం సాగిస్తా,
చిన్న చిన్న సరదాలతో
సంతోషాల సుమాలు పూయిస్తా!
అక్షరాక్షరాన అమృతం చిలికే
అపురూప కవితా సృజనతో —
మానవ జీవితాలనే కావ్యాలుగా మలిచి,
ప్రతి క్షణాన సాహితీ సౌరభాలు వెదజల్లుతా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment