అక్షరాల అనుభూతులు
శిఖరాల అగ్రాలు ఎక్కుతా —
విజయ జెండా ఎగరేస్తా!
పాతాళంలో పడ్డా పైకి వస్తా —
పట్టుదలతో విధిరాతనే తిరగరాస్తా!
కడలి అలలపై తేలుతా —
కలల నావలో విహరిస్తా!
నీలి గగనాలపై ఎగురుతా —
నక్షత్రాలతో చెలిమి చేస్తా!
ఊహల లోకానికి తీసుకెళ్తా —
ఉల్లాసాల ఊయలలో ఊపుతా!
మనసుల తలుపులను తడతా —
మమతల మకరందం పంచుతా!
చైతన్య దీపాలను వెలిగిస్తా —
చీకటి తెరలను చీల్చుతా!
కలతల గుండెలకు కొండంత అండనిస్తా —
కన్నీటి చుక్కలను తుడుస్తా!
మోడుబారిన మనసుల్లో —
మొలకెత్తే ఆశలను నాటుతా!
ఎండమావుల దారుల్లో —
ఎదురయ్యే ఎడారిని నందనవనం చేస్తా!
కాలగమనాన్ని ఆపలేకున్నా —
కావ్యగమనంతో కాలాన్నే దాటుతా!
మరణం దేహాన్ని మట్టిలో కలిపినా —
మధురాక్షరాలతో మరపురాని జ్ఞాపకమవుతా!
కలం కదిలిస్తా — కావ్యాలు సృష్టిస్తా,
కల్పనలు రగిలిస్తా — కొత్త లోకాలు వెలిగిస్తా!
భావాలు పలికిస్తా — భువనాన్ని పులకిస్తా,
కవితలు విరబూయిస్తా — హృదయాలను పరవశపరుస్తా!
ఊహలకు రెక్కలిస్తా — ఉవ్వెత్తున ఎగరేస్తా!
అక్షరాలకు అంతమెందుకు — అనంతాన్ని ఆవిష్కరిస్తా!
అక్షరాలే నా అస్త్రాలు — అనుభూతులే నా శస్త్రాలు!
భావాలే నా భువనాలు — భాషా వైభవాలే నా విజయతోరణాలు!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment