పువ్వుల తోటకు పిలువు —

పరవశింపజేసి పులకరించు!

పసిడి పూలను అందించు —

ప్రేమభావాలను ప్రకటించు!


పువ్వుల పరిమళం వెదజల్లు —

మధురానుభూతులను పంచు!

పూల సోయగాలను చూపించు —

మురిపాల ముత్యాలను చిందించు!


పువ్వులు కోసి కొప్పులో తురుము —

కొంటె అందాలను సొంతం చేయు!

పువ్వుల మాలలను అల్లు —

ప్రియుల మెడలో అలంకరించు!


పువ్వులు చల్లి స్వాగతించు —

పాఠకుల మనసులను గెలువు!

పూలబాటలో నడిపించు —

ప్రేమానందాల హరివిల్లు చూపించు!


పూలరేకుపై మంచుబిందువులా —

స్వచ్ఛమైన ప్రేమను పంచు!

పువ్వులాంటి చిరునవ్వులతో —

చుట్టూ సంతోషాలను నింపు!


పూల సుగంధంలా మంచితనాన్ని —

పదిమందికీ పంచిపెట్టు!

పువ్వులా వికసిస్తూ —

ప్రేమమకరందాన్ని అందరికీ పంచు!


పువ్వుల అందాలను పొగుడు —

పద్యాల మాలలను అల్లు!

పూల సొగసులను వర్ణిస్తూ —

చక్కని కవితలను సృజించు!


పూలలోని రంగులే —

జీవితానికి కొత్త వెలుగులు!

పూలలోని పరిమళాలే —

అనురాగానికి మధుర గీతాలు!


ప్రేమపుష్పాలు పూయించు — 

అనుబంధాల వనాన్ని నవ్వించు!

అనురాగాల జల్లులు కురిపించు — 

ఆత్మీయతల మల్లెలు విరియించు!


పూలతోటే స్వర్గమగనీ —

ప్రతి గుండె ప్రేమాలయమగనీ!

ప్రేమపుష్పం పరిమళించనీ —

ప్రపంచమంతా పూలవనమవ్వనీ!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog