రంగుల హరివిల్లు!


పూలరంగులు ప్రకృతి అందాలకు ఆలవాలం —

పరిమళాలు మనసులకు పంచుతాయి ఆనందం!

గులాబీ వర్ణం ప్రేమకు చక్కని ప్రతిబింబం  —

మల్లెల తెల్లదనం స్వచ్ఛతకు నిలువెత్తు రూపం!


ఆకాశ నీలిమ అనంతానికి సంకేతం —

ఉదయారుణిమ కొత్త ఆశలకు ఆహ్వానం!

సంధ్యారాగం సూర్యాస్తమయానికి సోయగం —

వెన్నెల జాబిలి రేయికి వెండివెలుగు తోరణం!


హరివిల్లు ఏడురంగుల అద్భుత సమ్మేళనం —

వాన వెలిసిన వేళ ప్రకృతి సంతకం!

వర్ణాల కలయిక కనులకు విందుభోజనం  —

విశ్వసృష్టి వైభవానికి నిలువెత్తు సాక్ష్యం!


గోడల రంగులు గృహానికి కొత్త సోయగం —

ముంగిట ముగ్గులు మన సంస్కృతికి నిదర్శనం!

ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలి కళానైపుణ్యం —

కుటుంబాన్ని కలిపి ఉంచే అనురాగం జీవన సౌభాగ్యం!


బొమ్మల రంగులు బాల్యానికి మధుర జ్ఞాపకం —

బాలల ఊహాలోకానికి అందమైన మార్గం!

కుంచె కదలికల్లో ప్రతిఫలించే కళాకారుని నైపుణ్యం —

చిత్రాల రూపంలో భావాలకు సజీవ ప్రతిబింబం!


పట్టు వస్త్రాల వర్ణాలు పండుగలకు ప్రత్యేక ఆకర్షణం —

చేనేత చీరల అందం మన సంప్రదాయానికి ప్రతిరూపం!

వస్త్రధారణలో అభిరుచి వ్యక్తిత్వానికి ప్రతిబింబం —

నూలుపోగుల్లో నైపుణ్యం నేతన్నల జీవన వైభవం!


హోళీ రంగులు స్నేహబంధాలకు తార్కాణం —

విభేదాలను మరిపించే వేడుకకు ప్రతిరూపం!

వర్ణాల జల్లుల్లో వెల్లివిరిసే సోదరభావం —

మనుషుల మధ్య ప్రేమను పెంచడమే పండుగ పరమార్థం!


రంగులెన్నో ఈ జగాన — ఒక్కొక్క రంగానిదొక అందం!

మనుషులెందరో ఈ లోకాన — ఒక్కొక్క మనసుదొక గొప్పదనం!

బాహ్య రంగులు కనులకు క్షణికానందం!

మానవత్వపు రంగులు జీవితానికి నిజమైన సార్థకత్వం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog