ఓ అపరూప సుందరీ!
నీ దేహమంతా అందముంది —
దివినుంచి దిగివచ్చిన చందముంది!
నీ మాటలనిండా తీపియుంది —
మకరందం చిందే మాధుర్యముంది!
నీ మోమునిండా నవ్వున్నది —
మల్లెలు విరిసిన వెలుగున్నది!
నీ కళ్లనిండా కాంతులున్నవి —
కలువలలోని కళలున్నవి!
నీ పెదవులనిండా అమృతమున్నది —
పలుకులలోన పరవశమున్నది!
నీ జడనిండా పూలున్నవి —
జాజుల జాబిలి సొగసులున్నవి!
నీవు పెట్టుకున్నపూలలో పరిమళమున్నది —
పూలవనమంత పులకరింతలున్నవి!
నీ నడకనిండా నాట్యమున్నది —
నెమలిని తలపించే నాజూకు హొయలున్నది!
నీ చూపులనిండా చిలిపితనమున్నది —
చూపరులను కట్టిపడేసే చాతుర్యమున్నది!
నీ మనసునిండా మమతలున్నవి —
మమకారాలు పంచే మంచితనమున్నది!
నీవు అందమంతా ఆరబోసిన ప్రకృతి శిల్పానివి!
నీవు అనురాగాల అమృతం పంచే ఆకృతివి!
నీవు అక్షరాలకందని అపురూప సౌందర్యానివి!
నీవు అనుభూతులకే అందని అద్భుత కావ్యానివి!
నీవు అందానికి అందానివి — ఆనందాల హరివిల్లువి!
నీవు అనురాగాల మందారానివి — ఆత్మీయతల మకరందానివి!
నీ సొగసుల సోయగాలకు సాటిలేదు సుందరీ —
నీ నవ్వుల నందనవనమే నయనాలకు పండుగ సుమీ!
నిన్ను మరువలేకున్నాను నీలవేణీ!
కనులు మూయలేకున్నాను కమలాక్షీ!
కోరికల మంటలను ఆర్పలేకున్నాను కోమలాంగీ!
ప్రేమభావాలను దాచలేకున్నాను ప్రణయరాగిణీ!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment