అక్షరాల శిల్పి

ఊహలలో ఊగుతూ ఉంటాడు —
ఉన్నత లోకాలు చూస్తూ ఉంటాడు,
కలల రెక్కలపై విహరిస్తాడు —
కొత్త ప్రపంచాలు సృష్టిస్తాడు!

మాటల్లో మాధుర్యం పంచుతాడు —
మమతల జల్లులు కురిపిస్తాడు,
అక్షరాల్లో అమృతం అందిస్తాడు —
అలసిన మనసులకు ఆహ్లాదమిస్తాడు!

పదాల్లో పరవశం నింపుతాడు —
భావాల పరిమళం వెదజల్లుతాడు,
చరణాల్లో చైతన్యం నింపుతాడు —
చదివే హృదయాలను కదిలిస్తాడు!

గొంతెత్తి గంధర్వగానం చేస్తాడు —
గుండెల్లో గానామృతం నింపుతాడు,
రాగాల రెక్కలపై భావాలను మోస్తాడు —
రసికుల మనసులను రంజింపజేస్తాడు!

కన్నీటికి కవిత్వమై నిలుస్తాడు —
కష్టాలకు ఓదార్పుగా మారుతాడు,
నవ్వులకు నవరసమై తోడుంటాడు —
నవజీవనానికి నాంది పలుకుతాడు!

కాలం కదిలినా — కవిత కదలదు,
కవి వెళ్లినా — కవిత్వం వెళ్లదు;
గుండెలను కరిగించిన ఆ భావం —
తరతరాలకు తరగని జ్ఞాపకమవుతుంది!

అక్షరాలతో లోకాన్ని గెలుస్తాడు —
అనురాగాలతో హృదయాలు నింపుతాడు,
గుండెల్లో గుర్తుండిపోయే కవిగా —
మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు!

కవే అక్షరాల శిల్పి —
కవిత్వమే అతని ఊపిరి;
అతని భాషే భావం —
అతని చిరునామా — హృదయం!

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog