జగజ్యోతులు!
సూర్యుని కిరణాలు సృష్టికి వెలుగులు —
చీకట్లను తరిమే దివ్య తేజాలు!
చంద్రుని వెన్నెల మనసుకు హాయులు —
మదులను మురిపించే మధుర భావాలు!
దీపాల కాంతులు ఇంటికి శోభలు —
జీవిత బాటలో ఆశల దీపాలు!
తారల తళుకులు నింగికి అందాలు —
కన్నుల విందుచేసే వజ్రాల మెరుపులు!
మెరుపుల విద్యుల్లతలు మబ్బుల మాయలు —
క్షణకాలంలో విరిసే కాంతి జ్వాలలు!
మోముల నవ్వులు మనసుల మమతలు —
మానవ జీవితాన వెలిగే వెన్నెలలు!
ఉదయపు అరుణిమ ఉత్సాహ కిరణం —
సంధ్యారాగం ప్రకృతి సౌందర్య గానం!
పున్నమి జాబిలి ప్రేమకు ప్రతిరూపం —
పసిపాప నవ్వు ఆనందానికి రూపం పరమానంద స్వరూపం!
సూర్యకాంతిలో శక్తిని చూద్దాం —
చంద్రవెన్నెలలో ప్రశాంతిని పొందుదాం!
దీపపు వెలుగులో జ్ఞానాన్ని పెంచుకుందాం —
చిరునవ్వుల వెలుగుతో ప్రేమను పంచుదాం!
కాంతులెన్నున్నా కన్నులకు విందులే —
కరుణ నిండిన హృదయాలు నిజమైన వెలుగులే!
బాహ్య కాంతులన్నీ తాత్కాలికం ——
అంతరంగ జ్యోతి అజరామరం!
ప్రకృతిలోని కాంతులు
ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తే,
మనిషిలోని ప్రేమ, కరుణ, చిరునవ్వులు
జీవితాలను వెలిగిస్తాయి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment