నిత్యపోరాటాలు!
చీకటిపై వెలుగు సాగించే సమరం —
చెడుపై మంచి చేసే ధర్మయుద్ధం!
అన్యాయంపై న్యాయం ఎగరేసే బావుటా —
అధర్మంపై ధర్మం చేసే తిరుగుబాటు!
ధనిక బీదల మధ్య అంతరాల అగాధం —
పేదరికం పెంచే అసమానతల విషాదం!
కూడు గుడ్డ నీడ కోసం బడుగుల ఆరాటం —
కనీస హక్కుల సాధనకు ప్రజా ఉద్యమం!
ఆడా మగా మధ్య ఆధిపత్య వైరం —
అహంకారాల మధ్య అంతులేని ఘర్షణం!
అధికార ప్రతిపక్షాల రాజకీయ చదరంగం —
పదవుల వ్యూహాలతో సాగే రణరంగం!
దేవతల రాక్షసుల మధ్య భీకర సంగ్రామం —
సత్యాసత్యాల నడుమ ధర్మాధర్మ ఘర్షణం!
అమృతం కోసం సాగిన సాగర మథనం —
దైవాసురుల గాథలో దాగిన తాత్త్విక సందేశం!
దేశాల మధ్య సరిహద్దుల వివాదం —
జాతుల మధ్య ఆధిపత్యపు ఆరాటం!
కులమతాల పేరుతో కలహాల కల్లోలం —
మానవ సంబంధాల్లో మమతల అంతర్ధానం!
మనిషిలో ఆశ నిరాశల అంతర్మథనం —
మనసులో ఆలోచనల నిరంతర ఘర్షణం!
గెలుపోటముల మధ్య జీవిత పయనం —
సంకల్ప బలమే విజయానికి సోపానం!
సవాళ్లను ఎదుర్కొంటేనే ప్రగతి —
అనుభవాల సానతోనే పరిణతి!
ప్రతిఘటన విధ్వంసానికి దారికాకూడదు —
విజయగర్వం మానవత్వాన్ని మింగకూడదు!
చీకటి తెరలను వెలుగులు చీల్చాలి —
చెడును తరిమేయాలి మంచితనపు కిరణాలు తరిమేయాలి!
అసమానతల స్థానంలో సమభావం వెల్లివిరియాలి —
అన్యాయపు సంకెళ్లు తెగి న్యాయం పరిఢవిల్లాలి!
ద్వేషాగ్నులు చల్లారి ప్రేమామృతం పొంగాలి —
విశ్వమంతా శాంతి సౌభాగ్యాలతో నిండాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment