వాక్కుల విన్యాసాలు
కలం ఒకటి చెంతకు వచ్చింది —
కమ్మని కవితను కానుకగా ఇచ్చింది!
అక్షరాల అందాలను అద్దంలో చూపింది —
ఆలోచనల మకరందం మనసుకు పంచింది!
గళం ఒకటి గానమై పలికింది —
గుండెలోని భావాలను పాటగా వినిపించింది!
మధురమైన రాగంతో మైమరపించింది —
మదిలో ఆనంద వీచికలను ప్రసరించింది!
పత్రిక ఒకటి పొద్దున్నే ఇంటికొచ్చింది —
పలుకరించి కవితతో పరవశింపజేసింది!
పదాల పొందికను పరిచయం చేసింది —
పఠనానందపు మధురిమను చేకూర్చింది!
పుస్తకం ఒకటి ముందుకు వచ్చింది —
పదిలమైన భావాల సంపదను అందించింది!
అద్భుతమైన కవితల అమృతం చిలికించింది —
అంతరంగంలో అనుభూతుల దీపం వెలిగించింది!
కవి ఒకరు చెంతకు వచ్చారు —
కవితా మాధుర్యాన్ని ఆస్వాదింపజేశారు!
చక్కని భావాలతో అలరించారు —
చిరస్మరణీయమైన అనుభూతులను మిగిలించారు!
కలం కవితకు ప్రాణం పోస్తుంది —
గళం గీతమై గుండెల్లో నిలుస్తుంది!
పత్రిక సాహిత్యాన్ని పదిమందికి చేరుస్తుంది —
పుస్తకం తరతరాలకు జ్ఞానాన్ని పంచుతుంది!
కవి సృజనకు అక్షరమే ఆలంబనం —
కవితా పఠనానికి భావమే ప్రాణధనం!
కవిత వినడం ఒక మధురానుభవం —
కవిత్వం ఆస్వాదించడం ఓ అపూర్వానందం!
వాణీదేవి కవులను కరుణిస్తుంది —
వీణానాదాలతో వీనుల విందు చేస్తుంది!
వాక్కులకు రసభావాలను అద్దుతుంది —
వినేవారి హృదయాల్లో ఆనందం నింపుతుంది!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment