కవిత్వంతో...
కొండలకు బాటలేసి అలవోకగా ఎక్కుతా —
కనిపించని శిఖరాలను సునాయాసంగా చేరుతా!
ఆకాశపు అంచులను ఆనందంగా తాకుతా —
అంతరిక్షపు అందాలను ఆశ్చర్యంగా చూస్తా!
గాలిలో విహరిస్తూ గగనాన్ని చుట్టేస్తా —
మేఘాల ముంగిట ముచ్చట్లు సాగిస్తా!
జాబిలమ్మ ఒడిలో జాజిపూలు జల్లుతా —
వెన్నెల విందుల్లో వేడుకగా గడుపుతా!
తారకల తళుకుల్లో తేలుతూ ఆడుతా —
చుక్కలతో చెలిమిచేసి చిందులు వేస్తా!
ధ్రువతార చెంతన దర్జాగా నిలుస్తా—
సప్తర్షుల సన్నిధిలో సంభాషణలు సాగిస్తా!
ఇంద్రలోక వీధుల్లో ఇష్టంగా తిరుగుతా —
అప్సరసల నాట్యానికి ఆనందంగా మురుస్తా!
నందనవనంలో నవరంగ పూలు కోస్తా —
కల్పవృక్షం నీడలో కలల పంటను పండిస్తా!
కైలాస పర్వతాన్ని కళ్లారా దర్శిస్తా —
పరమశివుని సన్నిధిలో పరవశించి నిలుస్తా!
గంగమ్మ జటాజూటంనుంచి జాలువారేజలాన్ని చూస్తా—
నంది నాదాల మధ్య నాదబ్రహ్మను వింటా!
వైకుంఠ వాకిళ్లను వినయంగా చేరుతా —
శ్రీహరి పాదపద్మాల చెంత శిరసు వంచుతా!
ఆదిశేషుని పాన్పుపై అనంతుని దర్శిస్తా —
లక్ష్మీదేవి కరుణామృతం మనసారా గ్రోలుతా!
కాలాన్ని వెనక్కి నడిపించి గతాన్ని చూస్తా —
రేపటి తరాల భవితను ముందుగానే చదువుతా!
సప్తసముద్రాలను సిరాతోనే దాటుతా —
సృష్టికి అందని అద్భుత లోకాలను సృజిస్తా!
కవిత్వమే నా రెక్కలు — ఊహలే నా గుర్రాలు!
అక్షరాలే నా ఆయుధాలు — భావాలే నా బలాలు!
కలం పట్టి కదిలిస్తే కదలని లోకమేదీ?
కవిత్వంతో విహరిస్తే అందని గగనమేదీ?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment