పొంగుల పరవళ్లు!
పొయ్యిమీద పాలు పొంగితే శుభసూచకం —
పల్లెల్లో పండుగలకు, గృహప్రవేశాలకు ఆరంభం!
ప్రాయం పొంగితే మనసులో పరవశం —
పడుచు హృదయాల్లో ప్రేమానురాగాల చిగురింత!
నదులు పొంగితే పొలాలకు జలకళ —
నవజీవన సిరులు చిందే పుడమితల్లి మురిపెం!
వాగులు పొంగితే వనాలకు వన్నెలు —
వసుధపై విరిసిపడతాయి పచ్చని సొగసులు!
హృదులు పొంగితే అనురాగాల వెల్లువ —
అనుబంధాల మధ్య ఆత్మీయతల కలయిక!
ఆనందం పొంగితే పెదవులపై చిరునవ్వు —
ఆప్యాయతలు పంచితే అంతులేని మధురానుభూతి!
ఊహలు పొంగితే అద్భుతాల ఆవిష్కరణ —
ఆలోచనలు సాగిస్తాయి సృజనాత్మక ప్రయాణం!
కరుణ పొంగితే మానవత్వానికి ఆధారం —
క్షమ పొంగితే శాంతికి సరికొత్త సౌధం!
కవితలు పొంగితే అక్షరాలకు అభిషేకం —
కవితా హృదయంలో భావాల మధురసంగమం!
కలం నుంచి జాలువారే కమ్మని కావ్యాలు —
పాఠకుల హృదయాలలో నిలిచే చిరస్మరణీయాలు!
పొంగడంలోనూ ఉంది ఒక పరమార్థం —
పొంగేది మంచికైతే జీవితమే సార్థకం!
హద్దులు దాటిన పొంగులు తెచ్చు ప్రమాదం —
మితిమీరని పొంగులే మనిషికి సౌభాగ్యం!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment