అనునిత్యం కలం కదలాల్సిందే!
ఏదో ఒకటి చేయాలి — ఏదో ఒకటి రాయాలి!
ఏదో ఒకటి పంపాలి — ఏదో ఒకటి ప్రచురించాలి!
ఏదో ఒకటి చదివించాలి — అక్షరాలతో జీవించాలి!
ఏదో ఒకటి పాడాలి — ఏదో ఒకటి వినిపించాలి!
ఉదయాన్నే లేవగానే ఊహలకు పదును పెట్టాలి —
ఉత్సాహంగా కొత్త భావాలకు ఊపిరి పోయాలి!
కలం పట్టి కాగితంపై కవితను కురిపించాలి —
కమ్మని కవితా కుసుమాలను లోకానికి పంచాలి!
పత్రికల పుటలను పసండైనకవితలతో నింపాలి —
పాఠకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించాలి!
సభలలో కవితలను సగర్వంగా వినిపించాలి —
సహృదయుల చప్పట్లతో సంతోషాన్ని పొందాలి!
నిన్నటి కవితకు నేడు కొత్త మెరుగులు దిద్దాలి —
నేటి కవిత రేపటికి కొత్తదనం సంతరించుకోవాలి!
రాయని భావాలు ఎన్నో రమ్మని పిలవాలి —
రాసిన అక్షరాలు మరిన్ని రాయమని వెంటాడాలి!
లేకపోతే పాఠకులు ఊరుకోరు — పలకరింపులు ఆగవు!
పత్రికల ఫోన్లు మోగుతూనే ఉంటాయి — పిలుపులు తగ్గవు!
అక్షరాలు వెంటబడతాయి — ఆలోచనలు నిదురపోవు!
కవితలు రాయకుంటే మనసు కుదుటపడదు — కలం విశ్రమించదు!
పాటలు పాడాలి — పరవశించి వినిపించాలి!
పదిమందితో చదివించాలి — పాఠకులను ఆకట్టుకోవాలి!
రచనలు పంపాలి — రసజ్ఞుల మన్ననలు పొందాలి!
సృజనకు సరికొత్త సొబగులద్దాలి — సాహిత్యాన్ని పండించాలి!
బతికినంత కాలం భావాలను పలికించాలి —
బాధలలోనూ అక్షరాలనే బాసటగా చేసుకోవాలి!
కాలం గడిచినా కలం కదులుతూనే ఉండాలి —
కడశ్వాస వరకు కవితా సేద్యం సాగుతూనే ఉండాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment