ఇంకేమి చేయాలో చెప్పవా!


రాగాలు తీయనా — రాగమాలికలు పాడనా!

గంధం పూయనా — గుబాళింపులు నింపనా!

పువ్వులు విసరనా — పూలబాటలు వేయనా!

నవ్వులు చిందనా — నవరసాలు పండించనా!


అత్తరు చల్లనా — అందాలను చూపించనా!

ముత్యాల హారాలు తేనా — ముచ్చటగా అలంకరించనా!

మోములు వెలిగించనా — మురిపాలు పలికించనా!

ఆనందాలు పంచనా — ఆత్మీయతను పెంచనా!


వెన్నెలను దించనా — వన్నెల విందు చేయనా!

విరజాజులు కోసుకురానా — విరుల జడలో తురుమనా!

తేనెలను కురిపించనా — తీయని ఊసులు పలుకనా!

చందమామను పిలవనా — చల్లని కబురులు చెప్పనా!


మల్లెలను కోయనా — మాలలుగా అల్లనా!

మధురిమలు నింపనా — మనసులను గెలుచుకోనా!

సిరిమువ్వలు మోగించనా — సింగారాలు చేయనా!

సిరులన్నీ కురిపించనా — చిరునవ్వులు పూయించనా!


హృదయాన్ని తెరవనా — ఎదలోని ప్రేమను చాటనా!

మనసున మనసును కలిపి — మమతల దీపాలు వెలిగించనా!

మధురమైన ఈ అనుబంధానికి — మంగళహారతి పట్టనా!

ఇంకేమి చేయాలో చెప్పవా — ఇంతకన్నా ఏం కావాలో చెప్పవా!


గుండ్లపల్లి  రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog