సమాజమే ఒక దేవాలయం!


సమాజమే ఒక దేవాలయం — సమష్టి జీవన సౌధం!

సమాజ హితమే పరమావధి — సత్కార్యాలే సాధనం!

సమాజ అభివృద్ధే కీలకం — సమైక్యతే ఆలంబనం!

సమాజ సేవే అభిలషణీయం — మానవత్వమే ఆభరణం!


మనుషులంతా ఒక్కటైతే — మహిలోనే స్వర్గసీమ!

మనసులన్నీ కలిసికట్టుగా సాగితే — మమతలే చిరునామా!

కులమతాల గోడలన్నీ కూలిపోవాలి — కలసిమెలసి సాగాలి!

కలతలన్నీ తొలగిపోవాలి — కరుణామృతం కురవాలి!


పేదల కన్నీరు తుడవాలి — వారి పెదవులపై నవ్వులు పూయించాలి!

బడుగు బలహీనులను చేరదీయాలి — అండగా నిలవాలి!

ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి!

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాలి!


విద్యావెలుగులు పంచాలి — విజ్ఞాన దీపాలు వెలిగించాలి!

వైద్యసేవలు అందించాలి — వేదనలను దూరం చేయాలి!

పర్యావరణాన్ని కాపాడాలి — పచ్చదనాన్ని పెంచాలి!

ప్రకృతి సంపదను పదిలపరచాలి — భావితరాలకు అందించాలి!


స్వార్థచింతన వీడాలి — సమష్టి తత్వం అలవడాలి!

అధికార దర్పం తగ్గాలి — అహంకారమంతా తొలగాలి!

అవినీతి అక్రమాలు అంతమవ్వాలి — న్యాయధర్మాలు నిలవాలి!

అనురాగ ఆత్మీయతలు వెల్లివిరియాలి — ఆదర్శ సమాజం ఆవిష్కృతం కావాలి!


సేవలోనే సంతృప్తి చూడాలి — త్యాగంలోనే ఆనందం పొందాలి!

తోటివారి ఉన్నతికి తోడ్పడాలి — తోడబుట్టినవారిలా మెలగాలి!

మనకోసం మనం జీవించడం కాదు — పదిమందికి ఉపయోగపడాలి!

మానవ జన్మకు సార్థకత చేకూర్చి — మానవత్వానికి మకుటం పెట్టాలి!


గుడి గోపురాలు కట్టడమే కాదు — గుండెల్లో గుళ్లను నిర్మించాలి!

దైవానికి పూజలు చేయడమే కాదు — దీనులకు సేవలు చేయాలి!

సమాజమే మన కుటుంబం — సమష్టి శ్రేయస్సే మన ధ్యేయం!

సమాజ సేవే మన సౌభాగ్యం — సమసమాజ స్థాపనే మన సంకల్పం కావాలి!


సమాజం బాగుంటేనే — మన బతుకులు బాగుంటాయి!

సమాజం ఎదిగితేనే — మన ఎదుగుదల సాగుతుంది!

స్వార్థాన్ని వీడి సమష్టి కోసం — ప్రతి మనిషి జీవించాలి!

సమాజ శ్రేయస్సు కోసమే — జీవితాన్ని అంకితం చేయాలి!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog