అక్షర సంకేతాలు!


చూపులు ఎన్నో భావాలకు సంకేతాలు —

చెప్పలేని మనసులోని మాటలకు ప్రతిరూపాలు!

ముఖకవళికలు అంతరంగపు సంకేతాలు —

మనిషి మనస్తత్వాన్ని తెలిపే ఛాయాచిత్రాలు!


చేతులు చేసే సైగలు సంకేతాలు —

చెప్పకుండానే చేరవేసే సందేశాలు!

కనులు పలికించే భాషకు అర్థాలెన్నో —

కనిపించని అనుబంధాలకు అవే వారధులు!


చిరునవ్వు సంతోషానికి సంకేతమైతే —

కన్నీటిచుక్క గుండెలోని గాయానికి సంకేతమే!

చెమటచుక్కలు శ్రమకు సంకేతాలు —

కష్టించే మనిషి విజయానికి తొలిమెట్లు!


ప్రకృతి అందించే సంకేతాలు ఎన్నెన్నో —

ప్రతి మార్పులో దాగివుంటాయి సూచనలు!

మేఘాల కదలికలు వానకు సంకేతాలు —

పక్షుల కిలకిలలు ప్రకృతి మేల్కొలుపులు!


పాఠకుల స్పందనలు కవులకు సంకేతాలు —

కవితా సృజనకు ప్రోత్సాహపు సందేశాలు!

చదివినవారి ప్రశంసలు పెంచే ఉత్సాహం —

మరిన్ని రచనలకు కలిగించే ప్రేరణం!


మౌనం కూడా ఒక్కోసారి సంకేతమే —

మాటలకందని భావాలకు అదొక భాషే!

కరచాలనం స్నేహానికి సంకేతమైతే —

ఆలింగనం ఆత్మీయతకు ప్రతిరూపమే!


కవితలు కవుల ప్రతిభకు సంకేతాలు —

కవి హృదయాంతరంగ భావాల అక్షరరూపాలు!

కలం నుంచి జాలువారే ప్రతి అక్షరం —

కవుల ఆలోచనలకు సజీవ సంతకాలు!


సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి —

సందర్భానుసారంగా స్పందించడం నేర్చుకోవాలి!

సూక్ష్మంగా గమనించే చూపుండాలి —

సూచనల వెనుక సత్యాన్ని గ్రహించాలి!


గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog