రెండో ఇన్నింగ్స్!


వయసు పెరిగి వృద్ధుడనయ్యా,

లోకదృష్టిలో నిష్ప్రయోజకుడనయ్యా!

ఉద్యోగం నుండి విశ్రాంతి పొందా,

గృహానికే పరిమితమయ్యా!


పదవిని విడిచా, సూటును విడిచా,

బూటును విడిచా, కోటును విడిచా,

అధికారాన్ని విడిచా, అహంకారాన్ని విడిచా,

ఉరుకెత్తటం విడిచా, పరుగెత్తటం విడిచా!


వారసులను చేరా, డబ్బును పంచా,

ఆస్తులను పంచా, తీరికను సొంతం చేసుకున్నా,

రవిని చూచా, కిరణాలను వీక్షించా,

చంద్రుడిని చూచా, వెన్నెలను అనుభవించా!


పువ్వులను చూచా, పరిమళాలు పీల్చా,

నవ్వులను చూచా, నగుమోములు వీక్షించా,

ప్రకృతిని చూచా, పులకరించి పోయా,

అందాలు చూచా, ఆనందాలు పొందా!


పుటలను తిప్పా, పుస్తకాలు పఠించా,

కవులను చూచా, కవితలను ఆస్వాదించా,

ఊహలను ఊరించా, భావాలను పొంగించా,

అక్షరాలను అల్లుతున్నా, పదాలను పేర్చుతున్నా!


కలాన్ని చకచకా కదిలిస్తున్నా,

కాగితాల్ని బరబరా నింపుతున్నా,

సాహితీ సేద్యం కొనసాగిస్తున్నా,

కవితా పంటల్ని పండిస్తున్నా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog