వాన


ప్రేమగా పిలుస్తుంది — 

బయటకు రమ్మంటుంది!

చిరుజల్లుల చిలిపి పలుకులతో — 

చెంతకు చేరమంటుంది!


చినుకుల ముత్యాలు రాలుస్తూ — 

చిందులు వేయమంటుంది!

చల్లని గాలులు వీస్తూ  — 

ఆటకు ఆహ్వానిస్తుంది!


ముంగిట ముత్యాలు పరుస్తుంది — 

మురిపాలు కురిపిస్తుంది!

మట్టి పరిమళాల మాధుర్యంతో — 

మదిని మైమరపిస్తుంది!


చెట్ల కొమ్మలతో చెలిమి చేస్తూ — 

చిందులేయిస్తుంది!

పూలరేకులపై పాదమోపి — 

పరవశింపజేస్తుంది!


కిటికీ తలుపులు తడుతుంది — 

కవితను రాయమంటుంది!

మనసులోని మధుర భావాలను — 

అక్షరాలుగా మార్చమంటుంది!


చినుకుల చప్పుడును లయగా మార్చి — 

చరణాలను కూర్చమంటుంది!

ప్రకృతి అందాలను కావ్యమల్లె — 

కాగితంపై విరబూయించమంటుంది!


వాన.. ఓ మధుర రాగం — 

మనసు పలికించే సంగీతం!

వాన.. ఓ ప్రేమ సందేశం — 

ప్రకృతి అందించే అనుభవం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog