అద్దమా! ఓ అద్దమా!
అద్దమా! అందాన్ని చూసుకోమంటావా!
అందులోని లోపాలను సరిదిద్దుకోమంటావా!
బయటి రూపాన్ని చూపిస్తావా!
అంతరంగాన్ని బేరీజు వేయమంటావా!
అలంకరణ చేసుకోమంటావా!
అందచందాలను ఆస్వాదించమంటావా!
అంతరంగాన్ని ఆవిష్కరించుకోమంటావా!
ఆత్మవిమర్శతో ఆలోచించుకోమంటావా!
అద్దమా! రూపాన్ని గమనించమంటావా!
ముఖంలోని భావాల్ని గ్రహించమంటావా!
నవ్వుల వెనుక దాగిన బాధలను గుర్తించమంటావా!
నటనల మాటున నలిగిన నిజాలను తెలుసుకోమంటావా!
అద్దమా! మేము నీలో చూడవలసినవేమిటి —
ముఖంలోని ముడతలా, మనసులోని మకిలా!
కనులలోని కాంతులా, హృదయంలోని క్రాంతులా!
వేషంలోని వైభవమా, వ్యక్తిత్వంలోని ఔన్నత్యమా!
అద్దమా! మాకు నీవు చూపవలసినవేమిటి?
అందమైన ఆలోచనలా, ఆనందాల అనుభూతులా!
మంచితనపు మానవత్వమా, మనసులోని మార్దవమా!
ప్రేమాభిమానాల పరిమళమా, సేవాభావపు సౌశీల్యమా!
అద్దమా! అబద్ధం చెప్పవు — అందాన్ని అతిశయించవు!
అందవికారాలను దాచవు — వాస్తవాన్ని వక్రీకరించవు!
ఎదుట నిలిచిన రూపాన్నే చూపిస్తావు —
ఎదలోని గుణగణాలను మాత్రం చూపించలేవు!
అద్దమా! నీ ముందు నిలబడితే సరిపోదు కదా —
అంతరంగాన్ని ఆవిష్కరించుకోవాలి కదా!
అందంగా కనిపిస్తే మాత్రమే చాలదు కదా —
ఆదర్శంగా జీవించడం అలవర్చుకోవాలి కదా!
అద్దమా! అద్దమా! ఓ అద్దమా!
అందాలనే కాదు, ఆత్మగుణాలనూ చూపమ్మా!
రూపురేఖలనే కాదు, మనుషులలోని మంచినీ చూపమ్మా!
మనిషి మనిషిగా మారే మార్గాన్ని చూపమ్మా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment