మనుషుల తీరుతెన్నులు!
ఎదుటివారి మనసులను
నొప్పించి తిట్టేవాళ్ళని దూరం పెట్టాలి —
ఎన్నో ఆశలతో
ఈ లోకంలో పుట్టేవాళ్ళని ఆహ్వానించాలి!
అధికార మదంతో
అమాయకులను కొట్టేవాళ్ళని బహిష్కరించాలి —
అవకాశం చూసుకొని
అందినకాడికి దోచుకునేవాళ్ళని దారికి తేవాలి!
కన్నవారి కోసం
కడుపు కట్టుకొని పెట్టేవాళ్ళని గౌరవించాలి —
కష్టాల కడలిలో
కన్నీటిని తుడిచేవాళ్ళని గుర్తుంచుకోవాలి!
పక్కవారి ప్రగతిని చూసి
అసూయతో గిట్టేవాళ్ళకు దూరంగా ఉండాలి —
పరోపకార బుద్ధితో
పదిమందికి తోడయ్యేవాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించాలి!
పగలతో పగబట్టి
పంతాలు పట్టేవాళ్ళని మార్చాలి —
ప్రేమతో పరుల హృదయాలలో
మమతలు చాటేవాళ్ళని మెచ్చాలి!
ఎవరు పుట్టినా
ఒకనాడు గిట్టేవాళ్ళని తెలుసుకోవాలి —
తప్పులు చేసేవాళ్ళని
తప్పు తెలుసుకునేలా మార్చాలి!
తిట్టేవారిని కాదు,
తలచుకునేలా బతికేవారిని తలకెత్తుకోవాలి —
కొట్టేవారిని కాదు,
కౌగిలించుకునే మనసున్నవారిని గుండెల్లో నిలుపుకోవాలి!
పుట్టుకతో
ఎవరూ గొప్పవారు కాలేరని గ్రహించాలి —
ప్రవర్తనతోనే
మనుషులు మహనీయులవుతారని చాటిచెప్పాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment