Posts

Showing posts from January, 2023
Image
ఆశలజోరు ఆశలు కలుగుతున్నాయి చూచింది విన్నది చదివింది తెలిసింది మనసు కావాలంటుంది ఆశలు పెరుగుతున్నాయి అనుభవించాలని ఆనందించాలని మనసు ఆరాటపడుతుంది ఆశలు రెచ్చకొడుతున్నాయి సాధించితీరాలని సమయంతీసుకోవద్దని మనసును ఉద్రేకపరుస్తున్నాయి ఆశలు వెంటబడుతున్నాయి ఆలశ్యం చేయ్యవద్దంటున్నాయి వెనక్కు తగ్గవద్దంటున్నాయి మనసును తొందరపెడుతున్నాయి ఆశలు వీడటంలేదు ఆలోచనలను రేపుతున్నాయి అంతర్ముఖుడిని చేస్తున్నాయి మనసును వేధిస్తున్నాయి ఆశలు గుర్రాలవుతున్నాయి ఆగకుండా పరుగెత్తుతున్నాయి అదిరించినా బెదరకున్నాయి మనసును మోచికొనిపోతున్నాయి ఆశలు అంతంకాకున్నాయి అన్యాయాలకు దిగమంటున్నాయి అక్రమాలకు పాల్పడమంటున్నాయి మనసును వ్యధపెడుతున్నాయి ఆశలు ఆకాశాన్నితాకుతున్నాయి అంబుధి అగాధాలనుచేరుతున్నాయి అన్నీ కావలసిందేనంటున్నాయి అంతరంగంపై అధికారంచలాయిస్తున్నాయి ఆశలు అల్లుకుంటున్నాయి పైపైకి ప్రాకుతున్నాయి డొంకంతా వ్యాపిస్తున్నాయి పుడమిని ముట్టేస్తున్నాయి ఆశలు ప్రలోభపెడుతున్నాయి వలలు విసురుతున్నాయి పల్లకిని ఎక్కిస్తున్నాయి మనసును వశపరచుకుంటున్నాయి  అత్యాశలకుపోకురా మానవుదా అగసాట్లు పడొద్దురా అనర్ధాలు తెచ్చుకోవద్దురా అన్యధా భావించొద్దురా గ...
Image
 గులాబీలు గులాబీలు ముచ్చటగున్నాయి గుండెలో గుబులుపుట్టిస్తున్నాయి మణీచకాలు మురిపిస్తున్నాయి ముగ్ధముచ్చట్లు చెబుతున్నాయి గులాబీలు గుబాళిసున్నాయి గుండెను మీటుతున్నాయి వికసిస్తామంటున్నాయి వేచియుండమంటున్నాయి చెంతకు చేరమంటున్నాయి చేతిలోకి తీసుకోమంటున్నాయి స్పృశించమంటున్నాయి సుఖపెట్టమంటున్నాయి సుందరంగాయున్నాయి సుకుమారంగాయున్నాయి ఆలోచనలు ఆగటంలేదు ఆవేశమూ తగ్గటంలేదు కళ్ళు మూతపడటంలేదు కాళ్ళు కదలటములేదు సొగసులు కట్టేస్తున్నాయి మనసును పట్టేస్తున్నాయి కుసుమాలు కవ్విస్తున్నాయి కవితను కూర్చమంటున్నాయి కవనకష్టము ఫలించింది కవితయొకటి సమకూరింది పదాలను ప్రయోగించా భావాలను బహిరంగపరచా మెదడులను మెట్టాలని చూచా మనసులను ముట్టాలని చూచా చూచి సంబరపడండి చదివి సంతసించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం మణీచకాలు= పూలు మెట్టు= ప్రవేశించు, చొచ్చు
Image
 
Image
 సూరీడు అతడు ప్రతిరోజూ ప్రొద్దునవచ్చే ప్రభాకరుడు అతడు తూర్పున తప్పకనిత్యముదయించే తపసుడు అతడు అరుణకిరణాలతో అడరే అర్కుడు అతడు జనులను జాగృతంచేసే జగత్సాక్షుడు అతడు ప్రపంచానికే ప్రత్యక్షదేవుడు పూషుడు అతడు లోకానికే లాతనిచ్చే లోకబాంధవుడు అతడు నీటి నావిరిచేసే  నమతుడు అతడు మేఘాలకు మూలమైన మార్తాండుడు అతడు ఆరుఋతువులను అందగించే అంబరీషుడు అతడు పన్నెండురాశులలో పయనించే పాంథుడు అతడు సప్తాశ్వరరధమునెక్కి సంచరించే సవితృడు అతడు ఉత్తరదిశకురథసప్తమినాడు ఉపక్రమించే ఉద్భటుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ప్రభాకరుడు= వెలుగును తయారుచేసేవాడు తపసుడు= ఎండ లేక ఉష్ణమునకు కారకుడు అర్కుడు= అర్చింపబడేవాడు, పూజింపబడేవాడు జగత్సాక్షి: ప్రపంచంలో జరిగేవాటన్నిటిని చూచేవాడు/తెలిసినవాడు పూషుడు= ద్వాదశాదిత్యులలో ఒకడు, ఆదిత్యుడు లాత= వికాసం/వెలుగు నమతుడు= నమస్కరింపబడువాడు మార్తాండుడు= అంధకారమువలన నిద్రబోయిన బ్రహ్మాండాన్ని చైతైన్యవంతము చేయువాడు అంబరీషుడు= పగటిపూట వెలుగునిచ్చేవాడు పాంధుడు= పథకుదు, తెరువరి, బాటసారి సవితృడు= లోకాదులను పుట్టించేవాడు, పరమాత్మ, సూర్యుడు ఉద్భటుడు= అధికుడు, సూర్యుడు లోకబాంధవుడు= లోకానికి...
Image
 ఊరకుండేదిలేదు ఒట్టిగా! ఏదైనా! ఏమైనా! ఊరకుండేదిలేదు ఒట్టిగా! కనిపించనీ! కనిపించకపోనీ! ప్రకృతి అందచందాలు వికసించిన విరులు అంబుధినందు అలలు  మింటిలో మేఘాలు నర్తించే నెమలులు  పచ్చని చిలుకలు ప్రవహించే నదులు  కాకులుదూరని కారడవులు గలగలసాగే సెలయేర్లు ప్రసరించనీ! ప్రసరించకపోనీ! కమలాప్తునినుండి కిరణాలు వెన్నెలరాయుని వన్నెచిన్నెలు తారకలువెదజల్లు తళతళలు మెరుపులయొక్క మెరుపులు మోములందు చిరునగవులు వినిపించనీ! వినిపించకపోనీ! తియ్యని తెలుగుపలుకులు పసందుకొలిపే పద్యాలు పరవశపరచే పాటలు పసిపాపల ముద్దుమాటలు కోకిలమ్మల కుహూకుహులు రానీ! రాకపోనీ! పేరుప్రఖ్యాతులు భుజంపై శాలువాలు మెడకు పూలదండలు చేతికి పుష్పగుచ్ఛాలు  సన్మాన సత్కారాలు పత్రికలలో వార్తలు  టీవీలలో వీడియోలు పోనీ! పోతేపోనీ! సతియు హితులు తల్లియు తండ్రియు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనుమళ్ళు మనుమరాళ్ళు చదవనీ! చదవకపోనీ! కష్టపడివ్రాసిన కవితలు అందంగా అల్లిన అక్షరాలు పారించిన పదములు ప్రయోగించిన ప్రాసలు వాడిన ఉపమానాలు రూపకాలు ఏదైనా! ఏమైనా! విడిచేదిలేదు కలమును మూసేదిలేదు గళమును ఆపేదిలేదు ఆలోచనలను దాచేదిలేదు భావాలను ఊరకుండేదిల...
Image
 లంకెలు (కవితానందం) మొక్కలకు పువ్వులు పూచినట్లు మదిలో తలపులు పొడుచుకొచ్చాయి తోటలో సీతాకోకచిలుకలు ఎగిరినట్లు తలచుట్టూ అక్షరాలు ముసురుకున్నాయి తీగలాగితే డొంక కదలినట్లు పదంచిక్కగా కవిత కదంత్రొక్కింది జాడతెలియగా చిక్కుముడి వీడినట్లు భావంబయటపడగా కైత కళ్ళముందుకొచ్చింది విషయంతోచగా కవిత్వం దొర్లినట్లు కలంచిక్కగా కైత ఒలికింది చెట్టుకదలగా గాలి వీచినట్లు కవనంసాగగా సౌరభం వెదజల్లింది తేనెచిందితే తీపి చవిచూపినట్లు నోరుతెరవగా తెలుగుతేనె దప్పికతీర్చింది లంకెపడితే జత కుదిరినట్లు ప్రాసలమరగా పాట పుట్టింది ఉదయమవగానే వెలుగు వచ్చినట్లు కవితోదయంకాగానే కాంతులు వెలువడ్డాయి కన్నుతెరచిచూడ అందం అగుపించినట్లు కయితచదవినంత ఆనందం ఆవరించింది పట్టుకొనిలాగి సహాయకుడుపైకి ప్రాకించినట్లు ప్రక్కనుండి సాహితి సుకవితనువ్రాయించింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏమిటిది సమాజమా! నవ్వే నాతిని నమ్మకూడదా! ఎప్పుడూ మగువను ఏడుస్తుండమంటావా! ఏడ్చే మగవాడిని విశ్వసించకూడదా! ఎప్పుడూ పురుషుడుమాత్రమే నవ్వుతుండాలా! ఆడది తిరిగితే చెడుతుందా! ఆడవాళ్ళను ఇల్లు విడవద్దంటావా! మగవారు తిరగకపోతే చేడతారా! మీసాలున్నవాళ్ళే బయటకెళ్ళి సంపాదించాలా! అత్తలేని కోడలు ఉత్తమురాలా! అమ్మలులేని అబ్బాయిలకే అమ్మాయిలనివ్వాలా! కోడలులేని అత్త గుణవంతురాలా! కొడుకులనే కనవద్దంటావా! కన్నా కుమారులకు పెళ్ళిచెయ్యొద్దంటావా! ఎంత అన్యాయంగా చెబుతున్నావు సమాజమా! ఎంతమూఢంగా మాట్లాడుతున్నావు సమాజమా! కాలంతో మనమూమారదాం లింగవివక్షను వదిలేద్దాం అత్తాకోడళ్ళను కలిపేసేద్దాం సమాజాన్ని సంస్కరించేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ మంచి దేవుడా! అడగకుండానే అవనికి పంపించావు అమ్మానాన్నలనిచ్చావు ఆరోగ్యభాగ్యాలిచ్చావు ఆకలి తీర్చటానికి అమ్మకు పాలివ్వమన్నావు అయ్యకు పైకంబునిచ్చావు ఆహారపానీయాలందించావు శ్రమించమని చేతులిచ్చావు కదలటానికి కాళ్ళనిచ్చావు కాంచటానికి కళ్ళనిచ్చావు మనసులకు మేధస్సునిచ్చావు ఆడుకోటానికి ఆటలనిచ్చావు అక్కాచెల్లెలునిచ్చావు అన్నాదమ్ములనిచ్చావు నమలటానికి నోరునిచ్చావు తినటానికి తిండినిచ్చావు పలకాబలపమిచ్చావు పాఠశాలకుపంపించావు పంతులగార్లనిచ్చావు పాఠాలు నేర్పించావు ఆ ఆ లను దిద్దించావు అమ్మ ఆవుల పలికించావు పచ్చని చెట్లనిచ్చావు రంగుల పూలనిచ్చావు నల్లని జుట్టునిచ్చావు తెల్లని పల్లునిచ్చావు నెత్తికి జుట్టునిచ్చావు చేతికి మేజోడులిచ్చావు తలకు టోపీలనిచ్చావు కాళ్ళకు చెప్పులిచ్చావు వంటికి బట్టలిచ్చావు కళ్ళకు చూపులిచ్చావు చెవులకు వినికిడిచ్చావు తనువుకు స్పర్శనిచ్చావు అన్నపూర్ణతో అన్నమునిప్పించావు లక్ష్మిదేవితో డబ్బులనిప్పించావు వాణీదేవితో విద్యనిప్పించావు శాంతిసుఖాలు సకలముచేర్చావు పరమాత్మునికి ప్రణామాలు దేవడేవునికి ధన్యవాదాలు పరంధామునికి పాదపూజలు స్వామివారికి సాష్టాంగనమస్కారాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగ...
Image
 రవి-కవి రవికానని చోటును కవివర్యుడు కాంచును  రవియంటే కాంతి కవియంటే భ్రాంతి రవియంటే అహస్సుకధిపతి కవియంటే అక్షరాలకూర్పరి రవియంటే పద్మాలహితవరి కవియంటే పదాలప్రయోగి రవియంటే కిరణాలు కవియంటే కవనాలు రవియంటే ప్రకాశము కవియంటే పరవశము రవి ఒకదగ్గరినక్షత్రము కవి ఒకవిఙ్ఞానస్థావరము రవియంటే జగన్నాధునిరథము కవియంటే సాహిత్యచైతన్యము రవియంటే మేలుకొలుపు కవియంటే హృదితలపు రవియంటే హరివిల్లు కవియంటే అక్షరజల్లు రవియంటే తెల్లవారివెలుగు కవియంటే తేటతెలుగుజిలుగు రవియంటే విశ్వభ్రమణము కవియంటే కల్పనాచాతుర్యము రవియంటే రథస్వారి కవియంటే మార్గదర్శి రవియంటే వేడి కవియంటే వాడి రవి రగులుతు వినువీధినవిహరిస్తాడు  కవి కనిపించక విడమరచివినిపిస్తాడు రవి రకరకాలరంగుల విసురుతాడు కవి కలముపట్టి విషయాలువివరిస్తాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం నన్నడిగిన ప్రశ్న: ఎవరివో? నీవెవరివో? రవివో? కవివో? జ్వాలను రగిలిస్తావా! మనసులు కదిలిస్తావా!! నెనిచ్చిన జవాబు: ఎను యొకకవిని అక్షరాలను వెలిగించుతా పదాలను ప్రకాశింపజేస్తా మదులను మెరిపింపజేస్తా
Image
 తెలుగుతేజస్సు తెలుగుతల్లి తేజరిల్లుతుంది తేనెనుచిందుతుంది  తల్లిభాష తరించుతుంది తన్మయత్వపరుస్తుంది అక్షరాలు అలుముకుంటున్నాయి ఆకట్టుకుంటున్నాయి మాటలు ముసురుకుంటున్నాయి ముగ్ధుడినిచేస్తున్నాయి పదాలు పరుచుకుంటున్నాయి పరవశపరుస్తున్నాయి అర్ధాలు అమరుతున్నాయి ఆకళింపుజేస్తున్నాయి ఆలోచనలు ఆవహిస్తున్నాయి అభినయిస్తున్నాయి భావనలు  బయటకొస్తున్నాయి భ్రమలోపడవేస్తున్నాయి పలుకులు పెదవులుదాటుతున్నాయి పులకరిస్తున్నాయి నాలుకలు తీపినిచిందుతున్నాయి తృప్తిపరుస్తున్నాయి కులుకులు మోముపైకూర్చుంటున్నాయి మయిమరిపిస్తున్నాయి వెలుగులు వెంటబడుతున్నాయి వేడుకచేస్తున్నాయి కలములు  కదులుతున్నాయి కాగితాలునిండుతున్నాయి కవితలు కళ్ళముందుకొస్తున్నాయి కమ్మదనాలుపంచుతున్నాయి ఉదయం ఊహలిస్తుంది ఉత్సాహపరుస్తుంది సాయము సహకరిస్తుంది సందడిచేస్తుంది రాత్రి రవళిస్తుంది రమ్యంగారాయిస్తుంది వేకువ విషయాలుతడుతున్నాయి విశదీకరించమంటున్నాయి కవనక్రియలు కొనసాగుతున్నాయి కమ్మదనాలనిస్తున్నాయి సాహిత్యప్రక్రియలు సాగుతున్నాయి సంతసపరుస్తున్నాయి పలుకులమ్మ పదనిసలువ్రాయిస్తుంది పసందుగాపాడిస్తుంది     వీణానాదము వినిపిస్తుంది ...
Image
 ఆ వ్యక్తి ఆ వ్యక్తి చిక్కితే చీల్చిముక్కలుచేస్తా దొరికితే దహనంపాల్జేస్తా బోనులోపడితే బంధించేస్తా ఆ వ్యక్తి వెంటబడుతున్నాడు వద్దనివారించినా వినకున్నాడు ఆ వ్యక్తి వంటిలోదూరాడు వెళ్ళమని అదిరించినా విడవకున్నాడు ఆ వ్యక్తి అంతరంగాన్ని ఆక్రమించాడు అదిరించినా ఆస్థానాన్ని అంటిపెట్టుకున్నాడు ఆ వ్యక్తి అందాలను చూడాలంటున్నాడు కళ్ళను కప్పేసినా కమ్మదనాలు కావాలంటున్నాడు ఆ వ్యక్తి ఆనందాలను ఆశిస్తున్నాడు ఆమడదూరం తరమాలన్నా అడుగుకూడా జరగకున్నాడు ఆ వ్యక్తి అందలం యెక్కించమంటున్నాడు అణగదొక్కి అదుపుచేసినా అల్లరిజేసి అవస్థలుపెడుతున్నాడు ఆ వ్యక్తి పట్టుకుందామంటే ప్రశ్నిసున్నాడు పెత్తనంచలాయిస్తున్నాడు ఆ వ్యక్తి మట్టిలో కలపాలంటే మొండికేస్తున్నాడు మేనునువదలకున్నాడు ఆవ్యక్తి అగ్గిలో బుగ్గిచేద్దామంటే అందకున్నాడు అరుస్తున్నాడు ఆ వ్యక్తి గాలిలో కలుపుదామంటే గుండెలో దూరుతున్నాడు గాయలపాలు చేస్తున్నాడు ఆ వ్యక్తి పట్టుకొని పంజరంలో పెట్టాలంటే పెడబొబ్బలు పెడుతున్నాడు ఆ వ్యక్తి చేతికి చిక్కకున్నాడు మనసుకు దొరకకున్నాదు శిక్షను స్వీకరించకున్నాడు ఆ వ్యక్తి అంతరాత్మ నిప్పు దహించలేదట నీరు తడపలేదట గాలి శోషీంచలేదట గుండ్లపల్లి ...
Image
 ఓ వెర్రి రంగా! (గంగ రంగ ప్రేమాయణం) ఓరి రంగా వెర్రి రంగా! పల్లె రంగా పూల రంగా!! గాజులు గలగల మ్రోగుతుంటే గంగ పిలుస్తుందని తెలుసుకోరా వెర్రివాడా! గజ్జెలు ఘల్లుఘల్లుమంటుంటే గంగ రమ్మంటుందని తెలుసుకోరా పిచ్చివాడా! మల్లెలు ఘుమఘుమలాడుతుంటే గంగ తయారయియున్నదని తెలుసుకోరా మొరటోడా! కూనిరాగాలు వినబడుతుంటే గంగ ఉషారుగాయున్నదని తెలుసుకోరా అమాయకుడా! నవ్వులు పకపకావినిపిస్తుంటే గంగ కవ్విస్తున్నదని తెలుసుకోరా అవివేకుడా! గది కళకళవెలుగుతుంటే గంగ కాచుకొనియున్నదని తెలుసుకోరా తిక్కలోడా! ఇల్లు శుభ్రంగాయున్నదంటే గంగ వేచియున్నదని తెలుసుకోరా దద్దమ్మా! అలిగి మూతిబిగిస్తే గంగ బెట్టుచేస్తుందని తెలుసుకోరా వెర్రివెంగళప్పా! రంగా గప్ చుప్ గా వెళ్ళు గంగను నీదానను చేసుకోరా పిచ్చిపుల్లయ్యా! అర్ధమైతే బాగుపడతావురా లేకుంటే తూరుపుతిరిగరా దండంపెట్టుకోరా రంగా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితా స్పందనలు (కవితాస్వాదనము) ఒకపడతి యందించె నాకొకపువ్వు  ఒకటే రేపించె నాలోనాలోచనలు  కరమున పట్టించె కలముకాగితము  కమ్మగవ్రాయించె కోరీకొసరీ కవనము  ఒకవిమర్శకుడిచ్చె పలుసలహాలు వద్దనివారించె వచననిర్మాణాలు  పారించమనె ప్రాసలతో పదములు పండించమనె పసందుగ కవితలు ఒకరిచ్చె నద్భుతమైనట్టి యొకమెప్పు ఉదయాన్నె త్రాగించే వేడివేడికాఫీకప్పు అనిపించెకనిపించె నన్నిటానతనికి నేర్పు బయటకువెల్లడించకుండె యొక్కటైనా తప్పు ఒకరుకొట్టే నొకటేచప్పట్లు చెప్పమనికోరే చాలాముచ్చట్లు చేతికందించే తియ్యతియ్యనిబొబ్బట్లు వేసివడ్డించె మూడుముక్కలపెసరట్లు వ్రాసితి విరులకవితలు  అంకితమిచ్చితి యోషితకు పొందితి పెక్కుపొగడ్తలు  మురిసిపోయితి మదినందు స్పందించె స్నేహితులు  పలుకరించె పరిచయస్తులు  కవితనాస్వాదించె కొత్తవారు  సంతసించె సాహిత్యలోకంబు  పాడించితి ప్రబోధగీతాలు పారించితి ప్రణయకవితలు  పేర్చితి పువ్వులపాటలు  కూర్చితి ప్రకృతికైతలు  కూకూయనిపించితి కోకిలలా   నాట్యమాడించితి నెమలిలా  వెన్నెలకురిపించితి జాబిలిలా  తెలుగునుచిందించితి తేనెలా  పొంగ...
Image
 బంధాలు అనుబంధాలు  బంధాలు అనుబంధాలు కావాలా! బాంధవ్యాలు ప్రతిబంధాలు కావాలా! ఆస్తుల పంపకంలో అన్నాదమ్ములు  సహకరించుకోవాలా! శత్రుత్వం పెంచుకోవాలా! కుటుంబం నడపడంలో తోడుకోడళ్ళు విభేదించాలా! వేరేకాపురాలు పెట్టాలా! పండంటికాపురాల్లో అత్తాకోడళ్ళు పాముముంగిసల్లాగా కలహించుకోవాలా! పాలుపంచదారలాగా కలసిపోవాలా! నిత్యజీవితంలో నిజమైన స్నేహితులు సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలా! సర్దిచెప్పక తమాషా చూస్తుండాలా! కోరిజతగట్టిన భార్యాభర్తలు తాంబూలంలా పండాలా! నిప్పులా  మండాలా! ఇద్దరి వ్యవహారాల్లో మూడోవ్యక్తి పిల్లులమధ్య కోతిలాగా జోక్యంచేసుకోవాలా! విద్యార్థులమధ్య గురువులాగా వ్యవహరించాలా! ప్రణయంలోపడ్డ ప్రేమికులు పరస్పరం అర్ధంచేసుకొని ప్రవర్తించాలా! ప్రపంచాన్నే మరచిపోవాలా ప్రాణాలివ్వటానికి సిద్ధపడాలా! జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలను పెంచాలి ప్రేమను పంచాలి దైవసమానులైన అమ్మానాన్నలను బిడ్డలు గౌరవించాలి బాంధవ్యాలను నిలుపుకోవాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం బంధం = సంయోగ విశేషం అనుబంధం= దగ్గరితనం, చుట్టరికం బాంధవ్యం= నెయ్యం. వియ్యం, సంబంధం ప్రతిబంధం= ఆటంకం, అంతరాయం
Image
 లేత గులాబిపువ్వులు లేతలేత గులాబీలు లే లెమ్మంటున్నాయి రా రమ్మంటున్నాయి రెపరెపలాడుతున్నాయి ముద్దుముద్దు గులాబీలు ముట్టుకోమంటున్నాయి మత్తును చల్లుతున్నాయి మయిని మరిపిస్తున్నాయి ఎరుపు గులాబీలు ఏమరుస్తున్నాయి ఎదను తడుతున్నాయి సొదలు చెప్పమంటున్నాయి గులాబీ పువ్వులు గుబాళిస్తున్నాయి గుబులు పుట్టిస్తున్నాయి గుండెను మీటుతున్నాయి తాజా రోజాలు తళతళలాడుతున్నాయి తలపులులేపుతున్నాయి తరుణితలలో తురుమమంటున్నాయి చక్కని గులాబీలు దండను అల్లమంటున్నాయి తెలుగుతల్లిమెడలో వెయ్యమంటున్నాయి తెలుగువెలుగులను చిమ్మమంటున్నాయి గులాబీ మొగ్గలు గుసగుసలాడుతున్నాయి ముద్దులు కురిపిస్తున్నాయి మాటల్లో ముంచేస్తున్నాయి విచ్చుకున్న గులాబీలు వినోదపరుస్తున్నాయి ముళ్ళను గుచ్చుతున్నాయి కళ్ళను కట్టిపడేస్తున్నాయి గులాబీల మరవను గులాబీల వదలను గులాబీల గురుతులను గుండెలో పదిలపరచుకుంటాను గులాబీలు అందించిన గుట్టుగా ప్రేమనుతెలిపిన గుండెలో గుబులుపుట్టించిన  గుమ్మకు కృతఙ్ఞతలు అభివందనలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏటి పని యిది సమాజమా! ఆడామగా అంతరాలను చూపి అతివలను అణుచుట న్యాయమా! ఏమి పని ఇది సమాజమా! తక్కువకులమంటూ తోటివారిని తూలనాడుట భావ్యమా! ఏమి పని ఇది సమాజమా! అన్యమతస్థులంటు అవతలవారిని అక్షేపించుట సహేతుకమా! ఏమి పని ఇది సమాజమా! బీదవారి లేమిని సాకుగావాడి బానిసలుగా వాడుట తగునా! ఏమి పని ఇది సమాజమా! బలహీనులను అదిరించి  బెదిరించి లొంగతీసుకొనుట ధర్మమా! ఏమి పని ఇది సమాజమా! అభివృద్ధిపథంలో నడిచేవారిని అడ్డగించుట సమంజసమా! ఏమి పని ఇది సమాజమా! పచ్చని కుటుంబాలను చూచి పరవశించక అసూయచెందుట సమర్ధనీయమా! ఏమి పని ఇది సమాజమా! పరిగెత్తుకొంటూ పోయేవారిని పడగొట్టటం సరియా! ఏమి పని ఇది సమాజమా! ప్రశ్నలు వేచేవారిని  పట్టుకొని గొంతులునొక్కుట సక్రమమా! ఏమి పని ఇది సమాజమా! వ్యతిరేకించేవారిని వెంటాడి వేధించుట తగునా! ఏమి పని ఇది సమాజమా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎందుకో?  కోయిల ఎందుకు తెరుచు నోరు నెమలి ఎందుకు పురిని విప్పు గానము ఎందుకు కొందరికి నచ్చు నాట్యము ఎందుకు మరికొందరు మెచ్చు జాబిలి ఎందుకు వెన్నెల కురియు తారలు ఎందుకు తళతళ మెరియు చల్లదనానికి హృదయమేల మురియు చక్కదనానికి మదులేల పొంగిపోవు పక్షులు ఏల గాలిలోన ఎగురు మబ్బులు ఏల నింగిలోన తిరుగు ముచ్చట ఏల చూపరులకు కలుగు మనసులు ఏల ఆనందంలో మునుగు ఉరుములు ఏల గర్జనలు చేయు మెరుపులు ఏల వెలుగులు చిమ్ము చినుకులు ఏల చిటపటమను వాగులు ఏల గలగలాపారు పూవులు ఏల పరిమళాలు విసురు పిల్లలు ఏల ప్రేమాభిమానాలు చాటు ప్రకృతి ఏల మనసులను తట్టు కవులు ఏల కవితలను కూర్చు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 
Image
 జీవితపాఠాలు నేర్చుకో! ఎండైనా చలైనా ఎదుర్కో కష్టమైనా సుఖమైనా కాచుకో ఓటమైనా గెలుపైనా ఓర్చుకో పగలయినా రేయయినా పనులుచేసుకో నిజమైనా నిష్టూరమయినా న్యాయంవైపేనిలుచో పచ్చయినా పండయినా పొట్టనింపుకో సరికొత్తయినా పాతయినా సర్దుకుపో ఉన్నా లేకపోయినా ఉసూరుపడకు అందినా అందకపోయినా ఆశయంవైపే అడుగులేయ్యి తిన్నా తినకపోయినా తృప్తిపడు వాన్నొచ్చినా వరదొచ్చినా వదలక ఈదటంనేర్చుకో మిత్రుడైనా శత్రువైనా మేలుచెయ్యి పశువైనా పక్షయినా ప్రేమించు బరువైనా తేలికయినా బతుకుబండిని లాగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత్వం నదిలా సాగాలోయ్ కవిత్వం నోర్లలో నానాలోయ్ కవనం గాలిలా వీచాలోయ్ కవిత్వం గంధం పంచాలోయ్ కవనం రవిలా వెలిగిపోవాలోయ్ కవిత్వం తామరలా వికసించాలోయ్ కవనం ఊటలా ఊరాలోయ్ కవిత్వం ఊహలు పుట్టించాలోయ్ కవనం మనసుల తట్టాలోయ్ కవిత్వం మేనును మురిపించాలోయ్ కవనం నవరసాల నందించాలోయ్ కవిత్వం నవ్యతను చాటాలోయ్ కవనం పువ్వులు పూయించాలోయ్ కవిత్వం పొంకాలు పరికింపజేయాలోయ్ కవనం అక్షరాలు పదాలు కావోయ్ కవిత్వం అర్ధాలు భావాలు కలగలుపెనోయ్ కవనం వాక్యాలు పాదాలు కాదోయ్ కవిత్వం లయలు పోలికలు మేళవింపోయ్ కవనం అందాలను చూపాలోయ్ కవిత్వం ఆనందాల నివ్వాలోయ్ కవనం ఆలోచనలను లేపేదోయ్ కవిత్వం అంతరంగాలలో నిలిచేదోయ్ కవనం కాలక్షేపమనుకోకోయ్ కవిగారికవిత్వం కవిగారిసృజనాత్మకతేనోయ్ కవనం కవిరాతలు చదవవోయ్ విషయమేనోయ్ కవిత్వం కవిమనసులో దూరవోయ్ కూర్చటమేనోయ్ కవనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా పువ్వు - నా ప్రియురాలు పూలమొక్కను తెచ్చాను పెరటినందు నాటాను నీళ్ళను పోశాను ఎరువును చల్లాను ప్రతిదినం శ్రద్ధతీసుకున్నాను చెట్టును ఏపుగాపెంచాను ఆ చెట్టు మొదటిమొగ్గను తొడిగినపుడు నేను సంతసించాను ఆ మొగ్గ పువ్వుగా మారినపుడు నేను మురిసిపోయాను ఆపువ్వు వికసించినపుడు నేను ఆనందపడ్డాను ఆ విరి అలరించింది నా మదిని మైమరపించింది ఆ అందం అద్భుతం ఆ ఆనందం వర్ణనాతీతం అపుడు ఆ పుష్పమును నేను తుంచలేదు ఆ సుమం సుగంధం చల్లినపుడు నేను మురిసిపోయాను ఆ పరిమళము పులకరించింది హృదయమును ఆ సుగంధము రేపింది నాలో కాంక్షను ఆ కుసుమమునకు అంతిమఘడియలు ఆసన్నమయ్యాయని అర్ధమైంది తక్షణము పువ్వునుతెంచాను ప్రేయసికొప్పులోతురిమాను పరవశించిపోయాను ఆ పువ్వు వన్నెను నాప్రియురాలికి ఇచ్చింది ఆ పువ్వు పరిమళాన్ని నా సఖి వంటికంటించింది ఆ పువ్వు ప్రకాశాన్ని నాచెలికి ధారాదత్తంచేసింది ఆపువ్వు  అందాన్ని నాప్రేయసికి అంకితమిచ్చింది అదిమొదలు ప్రియురాలు చేరుతుందిచెంతకు ప్రతిరోజు చూపుతుంది వన్నెలుచిన్నెలు ఆ పువ్వుకు ధన్యవాదాలు ఆ పడుచుకు అభివందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
ఏగేదెట్లాగా! ఏగేదెట్లాగా! దీంతో ఏగేదెట్లాగా! బిక్కమొహమేస్తుంది బుంగమూతిపెడుతుంది చీటికిమాటికి అలుగుతుంది చిట్లించి అలకపానుపునెక్కుతుంది గట్టిగా ఏడుస్తుంది గడగడా వణుకుతుంది దిక్కూ లేదంటది దిగులు పడుతుంటది వంటచెయ్యనంటది వాలుకురానంటది పటపటా పల్లుకొరుకుతుంది బొటబొటా కన్నీరుకారుస్తుంది పసిడిగాజులు కావాలంటది పట్టుచీరెలు తేవాలంటది సినిమకు వెళ్దామంటది షికార్లు చేద్దామంటది బంగారం కొనమంటది సింగారం చేసుకుంటానంటది చిటపటలాడుతుంది చిందులుత్రొక్కుతుంది మిఠాయీలు తెమ్మంటది నీచును కావాలంటది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనకార్యం అక్షరాలను ఆడిస్తా పదాలను పారిస్తా పలుకులమ్మని ప్రార్ధిస్తా కవనాన్ని కొనసాగిస్తా గాలికి గంధమిస్తా నలుదిశలా వ్యాపిస్తా పలుకులకు తేనెపూస్తా తియ్యదనాలు చిందిస్తా వెలుగుకు తెలుగునిస్తా పరిసరాలను ప్రకాశింపజేస్తా కళ్ళకు కమ్మదనాలనిస్తా కుతూహలం కలిగిస్తా అధరాలకు అమృతమిస్తా ఆనందంలో తేల్చేస్తా పాటకు ప్రాణమిస్తా వీనులకు విందునిస్తా ఆలోచనలు పారిస్తా మదులను మురిపిస్తా భావాలు బయటపెడతా భావకవితలతో భ్రమింపజేస్తా కలమును కరానపడతా కాగితాలపైకైతలు కూర్చోపెడతా ప్రాసలు పేరుస్తా కవితలు కూరుస్తా కనిపించకుండా వినిపిస్తా షడ్రుచులను అందిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మామా! చందమామా! చందమామ వచ్చాడు చక్కలిగింత పెట్టాడు చల్లనిగాలిని వీచాడు చక్కదనమును చూపాడు వెన్నెలజల్లు కురిపించాడు వెండిమబ్బుల్లో తిరిగాడు వినోదమెంతో యిచ్చాడు విహరించమని చెప్పాడు తారలమధ్య తిరిగాడు తనువుల పులకరించాడు తన్మయత్వపరిచాడు తళుకుబెళుకులు చూపాడు ఆటలాడమన్నాడు పాటలుపాడమన్నాడు ముచ్చట్లుచెప్పుకోమన్నాడు మురిసిపొమ్మనిచెప్పాడు గోరుముద్దలు తినమన్నాడు కడుపు నింపుకోమన్నాడు కమ్మగ నిదురపొమ్మన్నాడు కలలెన్నో కనమన్నాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జాగ్రత్తో జాగ్రత్త! మారుస్తా నిన్ను మంచివాడిగామారుస్తా! విన్నావా సంతసించి ఉరకుంటా! వినలేదా తన్ని తగలేస్తా! తిడతా నోటికొచ్చినట్టు తిడతా! కొడతా బర్రెనుకొట్టినట్టు కొడతా! పెడతా వంటికి వాతలుపెడతా! మూపిస్తా మూతిని మూపిస్తా! కట్టేస్తా రెండుచేతులు కట్టేస్తా! తంతా రెండుకాళ్ళతో తంతా! వ్రాస్తా మనసుకుతట్టినట్లు వ్రాస్తా! తెస్తా నిన్ను దారికితెస్తా! మానిపిస్తా దురాలోచనలను మానిపిస్తా! నడుచుకో బుద్ధిగా నడుచుకో! బాగుచెయ్యి సంఘాన్ని బాగుచెయ్యు తెచ్చుకో పేరుప్రఖ్యాతులు తెచ్చుకో! మసలుకో మంచిగా మసలుకో! తెలుసుకో నేనెవరో తెలుసుకో! జాగ్రత్త నేరాలుచేశావో జాగ్రత్త! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు చూడ చక్కగున్నరు సంచి తీసుకున్నరు చకచకా బడికివెళ్తున్నరు ఆడుకునే బాలలు అందముగానున్నరు బంతులు విసురుతున్నరు బ్యాటుతో కొడుతున్నరు పంతుళ్ళదగ్గర చిన్నారులు పాఠాలు నేర్చుకుంటున్నరు పట్టుబట్టి చదువుతున్నరు పుస్తకాలలో వ్రాస్తున్నరు పరీక్షలకు విద్యార్ధులు పరిశ్రమిస్తున్నరు ప్రధమశ్రేణి కోరుతున్నరు పతకాలు గెలవాలంటున్నరు మాటలాడు బిడ్డలు మాధుర్యాలు చిందుతున్నరు ముద్దులొలుకుతున్నరు ముచ్చటపరుస్తున్నరు విఙ్ఞాలు తొలగించమంటు విఘ్నేశ్వరుని వేడుకుంటున్నరు బాగా చదువులనివ్వమంటు భారతీదేవిని పూజిస్తున్నరు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ ప్రియా! లే లెమ్మంటూ నన్ను లేపావే మదిని తట్టావే మనసు దోచావే  రా రమ్మంటూ నను పిలిచావే కనుసైగ చేశావే కదిలించి పోయావే పో పొమ్మంటూ చేయిచూపావే వెక్కిరించావే ఆటపట్టించావే తే తెమ్మంటూ తహతహలాడావే తొందరచేశావే తత్తరపెట్టావే కూ కూయంటూ కంఠము నిప్పావే కోకిలను తలపించావే కమ్మగా పాడావే సై సైయంటూ సవాలువిసిరావే పోటీకొచ్చావే కవ్వించావే బై బైయంటూ టాటాచెప్పావే ఉడికించావే ఏడిపించావే చెంతకురా చెలీ! చెలిమి చేసుకుందాం చెట్టాపట్టాలేసుకుందాం చక్కగా ఒకటవుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కనుక్కో? ఏ పుట్టలో ఏ పామున్నదో? ఏ మట్టిలో ఏ మాణిక్యమున్నదో? ఏ మనసులో ఏ రహస్యమున్నదో? ఏ గుప్పెట్లో ఏ దాపరికమున్నదో? ఏ రాశివారికి ఏ ఫలంలభిస్తుందో? ఏ సంవత్సరం ఏ జాతకుడికిలాభమో? ఏ కష్టానికి ఏ ప్రాప్తమో? ఏ దరువుకు ఏ చిందువేస్తారో? ఏ నోటినుండి ఏ రత్నంరాలుతుందో? ఏ పెదవినుండి ఏ పలుకులువస్తాయో? ఏ అక్షరంలో ఏ తీపియుందో? ఏ మాటకు ఏ అర్ధముందో? ఏ కవితలో ఏ భావముందో? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 విద్యావిలువలు బాలల్లారా చదవండి విద్యాబుద్ధులు నేర్వండి సంప్రదాయాలు ఎరగండి దేశపువిలువలు కాపాడండి చదువుయిచ్చును ఙ్ఞానము ఙ్ఞానమిచ్చును ఉద్యోగము ఉద్యోగమిచ్చును నెలజీతము జీతముగడుపును కుటుంబము విద్యయిచ్చును వినయము వినయమిచ్చును సంస్కారము సంస్కారమిచ్చును గౌరవము గౌరవమిచ్చును గొప్పదనము సుగుణాలివ్వని చదువు విద్యార్ధులకు అనవసరము క్రమశిక్షణ నేర్పని చదువు బాలలకు అనర్ధకము శీలమునేర్పని విద్యలు రుచీపచీలేని కూరలు ఆచరణసాధ్యంకాని విద్యలు అభ్యసించటం నిష్ప్రయోజనము బడికిరోజు వెళ్ళుము పట్టుదలతో చదువుము పాఠములను నేర్వుము మంచివారిగా మెలుగుము అమ్మానాన్నలు చెప్పినట్లు నడువుము గురుదేవుల బోధనలను పాటించుము విద్యలేనివాడు వింతపశువురా చదివిబాగుపడనివాడు సచ్చుదద్దమ్మరా భావీభారత పౌరుల్లారా భవిష్యత్తు మీదిరా బ్రతుకులు మీవిరా భారతదేశము మీదిరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ సుందరీ! రమ్మనిపిలిస్తే రాత్రయినా పరుగెత్తుకుంటూరానా! సైగచేస్తే స్పందించనా చెంతకుచేరనా! కవ్విస్తే కరిగిపోనా కోరికతెలపనా! కలలోకొస్తే కబుర్లుచెప్పనా కాలక్షేపంచెయ్యనా! మత్తెక్కిస్తే మైమరచిపోనా ముద్దులవర్షంకురిపించనా! క్రేగంట చూస్తే కనిపెట్టనా బదులివ్వనా! చిరునవ్వులు చిందిస్తే చూడనా ప్రతిస్పందించనా! తోడురమ్మంటే తక్షణం పక్కకుచేరనా! సరసాలాడితే సంతసించనా చెంతకుచేరనా! గుసగుసలాడదామంటే గులాబీతోటలోనికి తీసుకెళ్ళనా! మసకచీకట్లో రమ్మంటే మల్లెపందిరిక్రిందకు ముందేచేరనా! అమృతం అందిస్తానంటే అందుకోనా ఆస్వాదించనా! వలపువల విసిరితే చిక్కనాదొరకనా విలవిలలాడనా! వెన్నెలలో విహరిద్దామంటే రెక్కలుకట్టుకొని వాలనా! మనుమాడదామంటే ముహుర్తంపెట్టించనా మెడలోతాళికట్టనా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగు వెలుగులు చూడుచూడు తెల్లవారింది వెలుగొచ్చింది తెలుగోదయమయ్యింది చూడుచూడు అరుణ కిరణాలొచ్చాయి అందరిని తట్టిలేపాయి ఆంధ్రావనిని మెరిపిస్తున్నాయి చూడుచూడు తెలుగుతల్లి మురిసిపోతుంది తనయల లాలిస్తుంది తనయుల పోషిస్తుంది చూడుచూడు మన తెలుగుమాత మదులను తట్టుతుంది మేనులను ముట్టుతుంది చూడుచూడు తెలంగాణాంధ్ర తెలుగు మాగాణి తెలుగు టికానా చూడుచూడు కోస్తాంధ్ర కర్షకులకు కాసులపంట చూడుచూడు రాయలాంధ్ర రత్నాలపుట్టిల్లు రాయలేలినప్రాంతము ఓరి తెలుగోడా! తెలుగును సుధలోముంచరా అమరంచెయ్యరా ఓరి తెలుగోడా తెలుగుకు పరిమళాలద్దరా సువాసనలు వెదజల్లరా ఓరి తెలుగోడా తెలుగుకు తేనెను తగిలించరా తియ్యదనాలతో తనివితీర్చరా ఓరి తెలుగోడా తెలుగుకు సొబగులనద్దరా చక్కనిభాషని చాటరా ఓరి తెలుగోడా తెలుగుభాషకు పట్టంకట్టరా తెలుగుతల్లికి జైకొట్టరా తెలుగుకీర్తిని వ్యాపించరా ఓరి తెలుగోడా ఆంధ్రాకు అండగానిలవరా తెలుగును తలకెత్తుకోరా దేశవిదేశాలలో దెదీప్యమానంగావెలిగించరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం