Posts

Showing posts from February, 2026
Image
 జీవితంలో.... నీకొక నెలవుండిన, మనసు గుండెల్లో వెండి వెలుగును జల్లుతూ నిశ్శబ్ద సహచరుడై నిలుస్తుంది. నీకొక తెరవుండిన, ఆశల గాలిని ఊపిరిగా నింపేలా విశాలమైన ఆకాశాన్ని చూపిస్తుంది. నీకొక తోడుండిన, మాటలకన్నా ముందే మనసు మాటను అర్థం చేసుకుని భారాన్ని భయంగా కాదు — ధైర్యంగా మలచేస్తుంది. నీకొక నీడుండిన, ఎండల మధ్య కూడా నీ అడుగులకు చల్లదనం పంచి  నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదని గుర్తు చేస్తుంది. నీకొక గురువుండిన, తప్పులనే పాఠాలుగా మలచి పతనాలకూ అర్థం చెప్పి జీవిత పయనానికి నమ్మకమైన దిక్సూచి అవుతుంది. నీకొక గమ్యముండిన, అలసిన అడుగులకూ అర్థం దొరుకుతుంది, ప్రతి రేపూ ఒక నూతన ఉదయంగా నిన్ను పలకరిస్తుంది. ఇవన్నీ నీకుంటే— జీవితం భారం కాదు, భరోసా అవుతుంది… పోరాటం కాదు — పండుగ అవుతుంది. — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 ఓ సాహితీ సామ్రాజ్ఞి! కళ్ళముందుకు వస్తావు, చూపులు పట్టేస్తావు, దృశ్యాన్ని చూపుతావు, అందాల బొమ్మను చేయిస్తావు. తలలోకి దూరతావు, ఆలోచనలు పారిస్తావు, భావాన్ని పుట్టిస్తావు, చక్కని రూపాన్ని ఇప్పిస్తావు. తెల్ల కాగితాన్ని ఇస్తావు, కలాన్ని చేత పట్టిస్తావు, నల్లని అక్షరాల్ని గీయిస్తావు, కమ్మని కవితను కూర్పిస్తావు. మట్టి ప్రమిదను అందిస్తావు, నూనెను నిండుగా నింపిస్తావు, చిరు దివ్వెను వెలిగిస్తావు, కాంతి కిరణాల్ని వెదజల్లిస్తావు. అంధకారమై ఆవరిస్తావు, జాబిలిని పొడిపిస్తావు, వెన్నెలను కురిపిస్తావు, మదులను మురిపింపజేస్తావు. అసంపూర్ణ వాక్యనివై వస్తావు, ప్రాసలు చేర్చమంటావు, అలంకారాలు వాడమంటావు, అద్భుత కవనాన్ని అల్లిస్తావు. తేనెచుక్కలు చల్లుతావు, పెదాలను తెరిపిస్తావు, స్వరాలను పలికిస్తావు, మోహన రాగాలు పాడిస్తావు. హరివిల్లును పొడిపిస్తావు, ఏడు రంగులను చూపిస్తావు, కుంచెను చేతబట్టమంటావు, విచిత్ర చిత్రాన్ని తయారుచేయిస్తావు. నల్లరాయిని విసురుతావు, ఉలిని పట్టుకోమంటావు, బండను చెక్కమంటావు, సుందర శిల్పాన్ని చేయిస్తావు. సముద్రానివై వస్తావు, నదిలా పారమంటావు, జీవిత పయనం సాగించమంటావు, నీలో చివరకు కలుపుకుంటావు. న...
Image
 మంచిమాటలు మంచిపనులు చెయ్యి — చిన్నదైనా ఆనందంగా ఆచరించు, చీకటిని తిట్టక, వెలుగును ఆహ్వానించు. మంచిమాటలు చెప్పు — ముళ్ల మధ్య పూసే పువ్వుల్లా, గాయపడిన మనసులపై మృదువైన మలయమారుతమవు. మంచితనము నేర్పు — పాఠాలుగా కాదు, నీ నడకలో, నీ చూపులో నిశ్శబ్దంగా జాలువారేలా నిలువు. మంచిదారిన నడువు — వంచనల వాగుల్లో తేలక, సత్యపు ఒడ్డును పట్టుకుని సరళతనే దిక్సూచిగా చేసుకొమ్ము. మంచిబ్రతుకును గడుపు — సంపాదనకన్నా సంతృప్తిని, అధికారంకన్నా ఆదరణను ఎంచుకున్న జీవితం కోరు. మంచిమిత్రులను సంపాదించు — నీ నవ్వును పంచుకునేవారిని, నీ కన్నీటిని మోసేవారిని మనసు వంతెనలపై కలిపివేయి. మంచిమనసును చాటు — అహంకారపు ముసుగుల వెనక కాదు, అభిమానపు వెలుతురులో అందరికీ కనిపించేలా మెలగు. మంచివాళ్ళను ప్రోత్సహించు — వారి విజయానికి నీ చేతుల్ని, వారి పతనానికి నీ భుజాల్ని ఆశ్రయంగా అందించు. మంచివాతావరణము కలిపించు — నీవున్న చోటే వసంతం పూయించు, నీ ఉనికే ఒక ఉదాహరణగా మంచితనం మహోత్సవమనిపించు. మంచిచెడ్డలు ఆలోచించి మంచిపోకడలు సాగించు, మంచిసమాజమును ఆశించి మంచికొరకు పాటుపడు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 🌼 మల్లెల ముచ్చట్లు 🌼 మల్లెమాలను అల్లవోయ్, మన తెలుగుతల్లి మెడలో వెయ్యవోయ్. మల్లెదండను గుచ్చవోయ్, మనసిచ్చిన చెలి కొప్పులో తురుమవోయ్. మల్లెపూలను అర్పించవోయ్, మహనీయులకు నీరాజనాలు అర్పించవోయ్. మల్లెవాసనను ఆఘ్రానించవోయ్, మహదానందపు తీరాలు అందుకోవోయ్. మల్లెచెట్లను పెంచవోయ్, మధుమాసంలో పూయించవోయ్. మల్లెగుచ్ఛమును చేతికివ్వవోయ్, మెచ్చిన చెలికి ప్రేమను చెప్పవోయ్. మల్లెతోటకు వెళ్లవోయ్, ముచ్చటగా కాలాన్ని గడపవోయ్. మల్లెకన్నియలతో మాట్లాడవోయ్, మంచిగ మనసుల్ని మురిపించవోయ్. మల్లెజాతిని పొగడవోయ్, స్వచ్ఛతకు చిరునామా అని చాటవోయ్. మల్లెమనసుల్ని ఎరగవోయ్, మత్తైన సౌరభంలో తూలవోయ్. ✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 భార్యాభర్తల బంధాలబలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి — మాటకంటే ముందు మనసు పలికేలా, చూపుకంటే ముందు స్పర్శ తాకేలా, నిశ్శబ్దమే సంభాషణ అయ్యేలా ఉండాలి. అపురూపంగా ఉండాలి — అలవాట్ల మధ్య ఆశ్చర్యం చల్లుకుంటూ, పాత ప్రేమకు నూతన రంగులు అద్దుకుంటూ, రోజూ ఒకరికొకరు కొత్తగా కనిపించేలా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి — చూసేవాళ్ల కళ్లలో ఆశ నాటేలా, విన్నవాళ్ల మాటల్లో ఉదాహరణగా, బంధం అంటే బలమని చాటేలా ఉండాలి. ఇరువురు ఒకటై ఉండాలి — రెండు శ్వాసలు ఒకే తాళంలో నడిచేలా, రెండు హృదయాలు ఒక లయలో స్పందించేలా, నేను కాదు — మనం అన్న భావం నిండేలా ఉండాలి. ఒకరికి ఒకరై ఉండాలి — కష్టంలో కవచమై నిలబడుతూ, సంతోషంలో పంచుకునే చిరునవ్వై, అవసరమైతే నీడలా మారేలా ఉండాలి. సీతారాములులా ఉండాలి — త్యాగానికి అర్థం చెప్పిన ప్రేమగా, నమ్మకానికి నిదర్శనమైన బంధంగా, కాలాన్ని జయించిన కథలా ఉండాలి. నీరుపాలులా కలిసి ఉండాలి — వేరు చేయలేని సహజ సౌహార్ద్యంతో, ఒకటి లేక ఒకటి అర్థం కాని విధంగా, జీవితమే మధురమయ్యేలా ఉండాలి. ఒకే మాటపై ఉండాలి — సందేహాల్ని తలుపు దాటి పంపిస్తూ, నిజాయితీని లోపల దీపంలా వెలిగిస్తూ, విశ్వాసమే పునాది అయ్యేలా ఉండాలి. ఒకే లక్ష్యంతో ఉండాలి ...
Image
చిరుభావాల చిరుచిట్టా చిరునవ్వులు చిందుతా —  మనసుల ముంగిట పూలవుతా, మాటలకన్నా ముందే హృదయాలను చేరుతా. చిరువెన్నెల చల్లుతా — నిశ్శబ్దానికి వెలుగవుతా, చీకటి కళ్లకు కలల దీపమవుతా. చిరుగాలులు వీస్తా — అలసిన ఊపిరికి ఊరటనిస్తా, భారం మోసే హృదయానికి సేద తీర్చుతా. చిరుదివ్వెలు వెలిగిస్తా — ఆశల అంచుల్ని తాకుతా, చిన్న వెలుగే పెద్ద దారిని చూపుతుందని చెబుతా. చిరుజల్లులు చల్లుతా — ఎండిన కలల్ని తడుపుతా, చిన్నచిన్న బిందువులే సముద్రమవుతాయని గుర్తుచేస్తా. చిరుగజ్జెలు కట్టుకుంటా — కాలంతో తాళం వేస్తా, నడకలోనే లయను నింపి నాట్యం చేస్తా. చిరుపూజలు చేస్తా — మనసే గర్భగుడిగా చేసుకొని, నిజాయితీనే నైవేద్యముగా అర్పించుకుంటా. చిరుకోరికెలు కోరుతా — అతి ఆశలు లేకుండా, సంతృప్తే సర్వస్వమని తెలుపుతా. చిరుకోపాలు చూపుతా — ప్రేమకు సరిహద్దులు గీస్తా, మౌనమే బోధకుడవుతుందని నేర్పుతా. చిరుచివాట్లు పెడతా — నోరును మూయిస్తా, కాళ్లబేరానికి తెచ్చుకుంటా, చెప్పినట్లు చేయించుకుంటా. చిరుతగవులకు దిగుతా — అలకపానుపు ఎక్కుతా, బెదిరించి లొంగదీసుకుంటా, చెప్పుచేతల్లో పెట్టుకుంటా. చిరుకవితలు అల్లుతా — ఈ చిన్నచిన్న క్షణాలతోనే, జీవితం అనే మహాకావ్య...
 జీవితం బంగారం ఇల్లే బంగారం — అమ్మ మమకారపు ముద్దుల గూడు నాన్న నడకల నిశ్శబ్ద నిబంధన గోడలమధ్య కాదు హృదయాలమధ్య నిలిచిన సంపద. వళ్ళే బంగారం — శ్రమ చిందిన చెమట చుక్కల్లో కాలానికి ఎదురుగా నిలిచిన కాళ్లలో వయసు ముద్రలు వేసినా విలువ తగ్గని జీవనరత్నం. చూపులే బంగారం — మాటలకన్నా ముందే పలికే భావాలు నిశ్శబ్దంలోనూ అర్థం చెప్పే కళ్ల భాష ఒక్క చూపుతోనే వెయ్యి వాక్యాలు వెలిగించే వెలుగు. పలుకులే బంగారం — పలకరింపులో పరిమళం ఆశీర్వాదంలో అమృతం గాయాన్ని మాన్పే మాట గుండెల్ని ముట్టే గంధం. దొరికిన బంగారం — అనుకోని వేళ అందిన స్నేహం అవసరంలో దొరికిన ఆపన్నహస్తం అదృష్టమని పిలిచినా దైవం పంపిన వరం. దొంగ బంగారం — మెరిసి మోసం చేసే ముఖాలు బయట బంగారం… లోపల బూడిద కనుల్ని మభ్యపెట్టినా మనసును కాల్చే నకిలీ కాంతి. మనసే బంగారం — క్షమించే గుణం ఉన్నప్పుడు పంచే ప్రేమ పొంగినప్పుడు కలుషం తాకని హృదయం కాలానికీ తరిగని ఖజానా. అక్షరాలే బంగారం — అనుభవం అరిగించిన అక్షరాలు ఆలోచనకు ఆకారం ఇచ్చిన పదాలు కవితగా కరిగిన భావం తరతరాలకు మిగిలే ధనం. బంగారం తూకంతో కాదు — బంధంతో కొలవాలి మెరుపుతో కాదు — మనసు వెలుగుతో తేల్చాలి ఎందుకంటే… మనిషే బంగారం మనసు...
 రుచులు కావాలి… రుచులు కావాలి… నాలుకకు రుచికావాలి — తీపి, కారం, చేదు, పులుపుల మధ్య జీవితాన్ని రుచిచూసే ధైర్యం కావాలి. పంటికి రుచికావాలి — కాలాన్ని కొరికినమిలే శక్తి కావాలి, కష్టాన్ని చూర్ణంచేసి అనుభవంగా మింగే సహనం కావాలి. పెదవికి రుచి కావాలి — నవ్వుల్లో తేనె చిందించాలి, మౌనాల్లోనూ మాటల పరిమళం వెదజల్లాలి. నోటికి రుచి కావాలి — అబద్ధాల చేదు వదిలేసి సత్యాల తీపే పలకాలి, విషపు మాటలకు తాళంవేసి  అమృత వాక్యాలే విడదీయాలి. గొంతుకు రుచి కావాలి — అణచివేతను తట్టుకునే గరళం కావాలి, న్యాయానికి నినదించే నవ కాంతి స్వరం కావాలి. కడుపుకు రుచి కావాలి — అన్నంతో పాటు ఆత్మసంతృప్తి కావాలి, అతి వినియోగం కాదు అపూర్ణతకు విరామం కావాలి. మనసుకు రుచి కావాలి — ప్రేమ తీపి కావాలి, విరహపు చేదు తెలిసినా కరుణ పులుపే మిగలాలి. అన్నానికి రుచి కావాలి — చెమట చుక్కల ఉప్పు కలిసిన శ్రమ పరిమళం కావాలి, పంచుకునే చేతుల్లోనే ఆహారం పండాలి. నీటికి రుచికావాలి — దాహాన్ని తీర్చడమే కాదు, జీవాన్ని నిలిపే జలజీవన  తత్వం కావాలి. అక్షరాలకు రుచికావాలి — శబ్దాల అలంకారం కాదు, భావాల గాఢత కావాలి, మౌనాన్నీ పలికించే  లోతైన సారం కావాలి. ...
Image
ఆసక్తికరంగా సాగిన వీక్షణం 162వ అంతర్జాల సమావేశం నేడు ఉదయం 162వ కాలిఫోర్నీయా వీక్షణం గవాక్షం అంతర్జాల సాహితీ సమావేశం మరియు కవిసమ్మేళనం అత్యంత ఆసక్తికరంగా సాగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి నేటి ప్రధాన వక్త ప్రముఖ కవి సాహితీవేత్త మరియు అధ్యక్షుడు డాక్టర్ వి.డి.రాజగోపాల్ గారిని సభకు పరిచయంచేసి 'నేటి కవిత్వం  - సామాజీ స్పృహ ' అనే అంశంపై ప్రసంగించవలసినదిగా ఆహ్వానించారు. డాక్టర్ రాజగోపాల్ గారు షుమారు 40 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, దాశరధి క్రిష్ణమాచార్య మొదలగు కవుల గురించి విపులంగా తెలియపరచి వారు తెలుగు భాషకు చేసిన సేవలు గురించి తెలియజేశారు. వారి ప్రసంగం కవులను ఆకట్టుకుంది. రాజగోపాల్ గారి ప్రసంగం చక్కగా సాగిందని గీతా మాధవి గారు, కవులు కొత్తూర్ వెంకట్, చీదెళ్ళ సీతాలక్ష్మి, అయ్యల సోమయాజుల ప్రసాద్, లలితా చండి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. పిమ్మట అమెరికా యువకవి ఇంగువ శశి గారు వ్రాసిన ' లవ్ , దేశం, జిందగి ' అనే పేరుతో త్రిభాష  కవితల సంపుటిని గీతా మాధవి గారు ఆవిష్కరించారు. కంప్యూటర్ ఉద్యోగ...
Image
 వసంత మాసం వస్తుంది వసంత మాసం వస్తుంది విరహాల ముసుగులు తొలగిస్తుంది, చెమ్మ చేక్కిన నేలపై పచ్చని చిరునవ్వులు చిందిస్తుంది. మామిడి పూతలు, పిండెలు, ఫలాలు ఆశలులేపి నోరూరిస్తాయి, కోయిల కూయలు మనసుల తాళాలు తట్టుతుంది. మల్లె పూల పరిమళం మౌనంగా మాటలాడుతుంది, సాయంత్రపు గాలిలో మనసులను మత్తెక్కిస్తుంది. ఎండలు పెరిగి నవ్వుతాయి, చల్లని గాలి పారిపోతుంది,  ఎండిపోయిన ఆశల కొమ్మలపై కొత్త పూతలు మొలిపిస్తుంది.  పూల తోటల పల్లవాలు రంగుల కలల్ని నింపుతాయి, మనసు నిండా ఉల్లాసాన్ని వసంతం వర్షంలా కురిపిస్తుంది. జీవితానికే పునర్జన్మనిచ్చేలా, వసంత మాసం వస్తుంది, హృదయాల అంచుల్లో ఆనంద దీపాలు వెలిగిస్తుంది.  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 కవితా ప్రయాణం కవిత మదిలో మెరిసింది — నిశ్శబ్దపు హృదయంలో ఆలోచనల అలలా వచ్చి భావాల్ని మేల్కొలిపింది. కవిత కాగితపు ఒడిలోచేరింది — సిరాతో స్నేహం చేసి అక్షరాల అడుగుల్లో అర్థాలకు ఊపిరి పోసింది. కవిత నదిలా పారింది — మనసు నిండా ప్రవహించి పదాల పల్లకీలో పుటలపై పరుగులేసింది. కవిత కమ్మగా కుదిరింది — అక్షరాల అల్లికలో లయకు లయ కలిపి స్వరాల్ని సర్దుకుంది. కవిత పత్రికల్లో ప్రచురితమయ్యింది — ప్రపంచపు వెలుతురులో తన రూపాన్ని చూపిస్తూ కవిత్వమని చాటింది. కవిత పాఠకులను పిలిచింది — హృదయాల తలుపులు తట్టి “నన్ను ఆస్వాదించు” అంటూ మనసులను పలకరించింది. కవిత మన్ననలు పొందింది — ప్రశంసల పరిమళంలో చప్పట్ల మోగుల్లో ఆనందంగా తేలిపోయింది. కవిత కంచికి వెళ్ళింది — కాలపు మడిలో ఒదిగి సంతృప్తి నిద్రలో శాంతిగా విశ్రాంతి తీసుకుంది. కవితలను చదవండి — కవులను ప్రోత్సహించండి, పలుకులమ్మను తలచి ప్రసాదంగా స్వీకరించండి. కవితల్లో మునగండి — కవితామృతమును త్రాగండి, కవితావిందును ఆరగించి కవితామర్మము తెలుసుకోండి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నయానా? భయానా? (సామదానభేదదండోపాయాలు) అతిప్రేమను ఒలకబోసి అంతరంగాలను అదుపులోకి తీసుకొని ఆటలాడించటం -  మంచిమాటల మల్లెలు చల్లి మనసులు గెలిచి  సొంత పనులు చక్కబెట్టుకోవటం — సామోపాయం. బహుమతులు పంచిపెట్టి ప్రలోభాలకు గురిచేసి బుద్ధిని బంధించి తనదారికి తిప్పుకోవటం — ధనాన్ని ఇచ్చి కోరికలను నెరవేర్చి తలలను వంచేలా చేసి ఆశయాలు సాధించటం - దానోపాయం. సన్నిహితుల మధ్య అపార్ధాలు కలిగించి అనుకున్న కార్యాలు సాధించటం – బుద్ధిబలం ఉపయోగించి అంతఃకలహాలు రగిలించి విధిలేని పరిస్థితులు సృష్టించి వశంచేసుకోవటం - భేదోపాయం. అన్యగతిలేని సందర్భాలు  కల్పించి బలప్రయోగమైనా  చేసి తలచినది నెరవేర్చుకోవటం - హెచ్చరికలతో హింసతో హృదయాలను గడ్డకట్టించి  కత్తులు చూపి బెదిరించైనా కాళ్లదగ్గరకు తెచ్చుకోవటం - దండోపాయం. సామమా, దానమా, భేదమా, దండమా — ఏ దారిలో నడిచినా సాధించేది గమ్యమా? మనిషిని మానవత్వాన్ని కోల్పోవడమా? అడ్డదారులు తొక్కి అందుకునేది విజయమా? — నయానో… భయానో…?  చరిత్ర చివర అడుగుతుంది — నీ అభిష్టం నెరవేరిందా? నీ జీవితం నెగ్గిందా? నీ సామ్రాజ్యం నిలిచిందా? — నయంతోనైనా… భయంతోనైనా…? గుండ్లపల్లి రాజేంద్...
Image
 అట్టమీది ఆలేఖ్యము (పుస్తక ముఖచిత్రం)  అట్టమీది బొమ్మ అందంగా ఉండాలి— చూపు తగిలిన క్షణాన కళ్లలో చిరునవ్వు పూసేలా, మౌనమే మాటలై మనసును పలకరించాలి. అట్టమీది బొమ్మ ఆకట్టుకొనేలా ఉండాలి— చూపును ఆపేసే వెలుగై, చేతిని ముందుకు నడిపించే అదృశ్య ఆహ్వానమై అట్టవద్దే ఆపనివ్వకుండాలి. అట్టమీది బొమ్మ కవి ఉద్దేశ్యం చాటేలా ఉండాలి— రంగుల మడతల్లో భావాల దారి చూపుతూ, గ్రంథ హృదయాన్ని ఒక చూపులోనే తెలియజేయాలి. అట్టమీది బొమ్మ వెలుగుతున్నట్లు ఉండాలి— దీపంలా కాదు, అక్షరాల శ్వాసలా; చదివించాలనే తపన కలిగించలి. అట్టమీది బొమ్మ కొనిపించేలా ఉండాలి— చేతిలోకి తీసుకునేలోపు మనసులో చోటు చేసుకుని, “ఇది నాదే” అన్న భావం నాటాలి. అట్టమీది బొమ్మ చదివించేలా ఉండాలి— ముందుమాటకు ముందే ఆసక్తిని అల్లుకుని, పుటలు తిప్పాలనే ఉత్సుకతను పెంచాలి. అట్టమీది బొమ్మ మదుల్లో నిలిచేలా ఉండాలి— చూసిన తరువాత కాదు, మరిచే ప్రయత్నంలోనూ గుర్తొచ్చేంతగా స్మృతుల్లో మోగించాలి. అట్టమీది బొమ్మ అలంకారం — కవితకు ముఖం, గ్రంథానికి హృదయం, పాఠకుడికి గాలం. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నిన్న – నేడు – రేపు (భూత – వర్తమాన – భవిష్యత్తు కాలాలు) నిన్న…ఆశల పరిమళమై పూతగా పుట్టాను,  కలల తాకిడితో పిందెనయ్యాను,  కాలం ఒడిలో కాయగా ఎదిగాను —  అందాలరూపమై ఆనందాలతావునై వెలిగిపోయాను. నేడు… అనుభవాల మాధుర్యంతో పండిపోయాను, ఆశల అధికభారంతో పుచ్చిపోయాను, కోరికల తీరకపోవటంతో దిగులుపడ్డాను. కాలం అద్దంలో నా రూపం చూసి కుమిలిపోయాను. రేపు… జ్ఞాపకాల దొంతరలై రాలిపోతాను, గర్వాల పొరల్ని విడిచి కుళ్లిపోతాను, దేహాన్ని చాలించి మట్టిలో కలుస్తాను, మరొక పూతకు మూలమైపోతాను. నేను రాలిన చోటు శూన్యం కాదు — అక్కడే ఒక విత్తనం ఊపిరి పీల్చుకుంటుంది, నేను కరిగిన మట్టిలో చీకటి ఉండదు — రేపటి వెలుగు మూలాలు వేసుకుంటుంది. నేను లేనిక్షణమే ప్రకృతి ప్రతిచర్య తీసుకుంటుంది  — రాతలు కూర్చి, చరిత్రపుటలకు ఎక్కిస్తుంది. కాలం నన్ను తుడిచినా, అక్షరాలు నన్ను నిలుపుతాయి — నాశనమైనా నన్ను చిరకాలం కొనసాగిస్తాయి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నిన్నే చూశాను... (ప్రేమగీతం) నిన్నే చూశాను - నన్నే మరిచాను నీ అందం చూశాను - నే ఆనందం పొందాను    నీ రూపం చూశాను - నే తాపం చెందాను నీ వలకు చిక్కాను - నే ప్రేమలో పడ్డాను     ||నిన్నే|| నీ  చూపులు చూశాను - నే బందీ అయ్యాను నీ నవ్వులు చూశాను - నే పువ్వులు చల్లాను  నీ మాటలు విన్నాను - నే పాటలు పాడాను నీ ఆటలు చూశాను - నే మత్తులో పడ్డాను    ||నిన్నే|| నీ చేష్టలు చూశాను - నే నివ్వెర పోయాను నీ దుస్తులు చూశాను - నే కొంగును చుట్టాను నీ పిలుపులు విన్నాను - నే చెంతకు వచ్చాను నీ చెలిమిని చేశాను - నే చేతులు కలిపాను    ||నిన్నే|| నీ వదనం చూశాను - నే కలవరం చెందాను నీ నడకను చూశాను - నే అడుగులు వేశాను నీ రక్తిని చూశాను - నే శక్తిని పొందాను నీ హృదిని చూశాను - నే కవిని అయ్యాను    ||నిన్నే||  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.                                                          ...
 నా దారి – అక్షరసుపథం దారిని కనిపెట్టాలని ఉన్నది — గమ్యం అనే కలను అడుగుల ముందే నిలిపి త్వరగా చేరవేయాలని ఉన్నది. దారిని చూపాలని ఉన్నది — చీకటి మలుపుల్లో ధైర్యం అనే దీపాన్ని మనసుల చేతుల్లో వెలిగించాలని ఉన్నది. దారిని మలచాలని ఉన్నది — తప్పుదోవల వంకరలను సరైన దిశగా తిప్పి నిశ్శబ్దంగా సరి చేయాలని ఉన్నది. దారిని చెయ్యాలని ఉన్నది — అలసిన అడుగులకు ఆశ్రయమై ప్రయాణమే గురువయ్యేలా జీవనానికి నిలకడ నేర్పాలని ఉన్నది. దారిని పట్టించాలని ఉన్నది — వంచనల వలల్ని విడదీసి నిజానికి సూటి మార్గాన్ని అడుగుల కింద పరచాలని ఉన్నది. దారిని కాచాలని ఉన్నది — నిద్రపోని కళ్లతో దోపిడీ చేసే ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేయాలని ఉన్నది. దారికి తేవాలని ఉన్నది — జీవితపు చెల్లాచెదురు క్షణాల్ని ఒక అర్థవంతమైన పథంగా సరిదిద్దాలని ఉన్నది. దారిని వెంబడించాలని ఉన్నది — ముష్కరుల ఆటల్ని సత్యపు వెలుగులో నిలబెట్టి నిర్వీర్యం చేయాలని ఉన్నది. అక్షరాల దారిన నడవాలని ఉన్నది — మదిలో మరిగే భావాల్ని మౌనాన్ని చీల్చి పదాలుగా మలచాలని ఉన్నది. కవితా దారిని పట్టాలని ఉన్నది — కమ్మని అనుభూతుల్ని లయలో కూర్చి మనసులకు చేరవేయాలని ఉన్నది. నా దారి కేవలం రహదారి కా...
Image
 అక్షరాలపై అయిదు ఆటవెలదులు రాయ రాయ అక్షరాలు రత్నాలగు చదువ చదువ బుద్ధి చాల పెరుగు విద్య లేనివాడు వింతపశువగును కన్నులుండికూడ కానకుండు బ్రతుకు నిలువకుండు బంగారమున్నను బుద్ధిలేనివాడు బూడిదగును అక్షరాలుయున్న అన్నియు వశమగు అవియు లేకయున్న అంధుడగును మాటవంచనాల మాయలోన పడకు పుస్తకాలతోడ నేస్తముచెయి వదలకుండ విధిగ వాస్తవాలను చెప్పు దాచినపుడు దారి దగ్ధమగును చదువులేనివాడు సరసునందున కప్ప నీటిలోనయుండి నెరపలేడు అక్షరమను గొప్ప ఆయుధముండిన మనుజడపుడు మంచి మానవుడగు అక్షరములు అగును అమృతపుధారలు కాలము గడచినను కరగకుండు కవితలల్లినట్టి కవులకు కీర్తొచ్చు సాహితీజగమున సతము నిలుచు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 అక్షరయానం నుదిటిపై అక్షరాలు — దేవుని విధిరాతలు, నాలుకపై అక్షరాలు — భావాలకు శ్రావ్యస్వరాలు. నామకరణ రోజున బియ్యంపై రాసిన అక్షరాలు — జీవితానికి తొలి చిరునామా, అక్షరాభ్యాసంనాడు దిద్దిన బీజాక్షరాలు — జ్ఞానానికి తెరిచిన తలుపులు. పలకపై అక్షరాలు — చిన్న చేతుల కలల గుర్తులు, మట్టిపై అక్షరాలు — చిన్నారుల సాధనకు తొలి చిహ్నాలు. నీటిపై అక్షరాలు — క్షణభంగుర సత్యాలు, నోటుబుక్కుపై అక్షరాలు — ఆశల్ని దాచుకున్న రహస్యాలు. నల్లబోర్డుపై అక్షరాలు — గురువు చూపిన గీతల్లో జీవితానికి దారి చెప్పే బుద్ధి బీజాలు. ఇసుకపై అక్షరాలు — అలలొచ్చి చెరిపినా మానస తీరాల్లో మిగిలిపోయే జ్ఞాపకాలు. ప్రశ్నాపత్రాలపై అక్షరాలు — గుండెల్ని తడిపే భయం–ధైర్యాల పరీక్షాకాలాలు. సమాధానపేజీలపై అక్షరాలు — ఆలోచనల చెమటతో సాధనకు ఫలమిచ్చే విజయ మార్గాలు. లేఖపై అక్షరాలు — దూరాల్ని దగ్గరచేసే ప్రేమ తార్కాణాలు, పుస్తక పుటలపై అక్షరాలు — తర తరాల్ని వెలిగించే దీపాలు. శిలాఫలకంపై అక్షరాలు — చెరపలేని శాశ్వత ఘనతలు, సమాధిరాళ్లపై అక్షరాలు — పెద్దలను గుర్తుకుతెచ్చే మాటలు. పత్రికల్లో అక్షరాలు — సమాజ నాడిని పట్టే నిజాల నిప్పులు, అబద్ధాల తెరలు. టీవీల్లో అక్షరాల...
Image
 అక్షరీకరణం చూచిన దృశ్యాలు — కళ్ల అంచుల్లో ఆగక మనసు గోడలపై చిత్రాలై నిలిచిపోతే, వాటిని అక్షరాలుగా కట్టిపడేస్తాను. తట్టిన ఆలోచనలు — మెరుపుల్లా మెదిలి  మాయమయ్యేలోపు పదాల వలలో పట్టి కవితగా మలుస్తాను. ఏర్పడిన భావాలు — హృదయపు లోతుల్లో నిశ్శబ్దంగా ఉప్పొంగి ఊపిరి కోరినప్పుడు  వాగ్దేవి వాక్యాలుగా వెలువరిస్తాను. ప్రకృతి అందాలు — పూల పరిమళాలు, ఆకుల గుసగుసలు, నదుల పారుదల, వాన చినుకుల చిరునవ్వులను — అక్షరాల పూలమాలగా అర్థవంతంగా అలంకరిస్తాను. విన్న విషయాలు — ఆనంద జ్ఞాపకాలై  మనసును తాకితే  కవితా స్వరాలుగా మారుస్తాను. మెరిసిన మెరుపులు — ఆలోచనలకు వెలుగై, అక్షరాల్లో చమకించి, మేఘాల గర్జనలు — వేదనల ఉగ్రస్వరమైతే పుటలపైకి ఎక్కించి పలుకవనాలకి ప్రాణం పోస్తాను. తేనె పలుకులు — మాటల మాధుర్యమై,  అక్షరాల నోట నిద్రపోతే, కలంపట్టి కాగితాలపై గీసేస్తాను. ప్రేమ బంధాలు —  వలవేసి పట్టుకుంటే శాశ్వత అర్థాలుగా మలచి కవిత గుండెల్లో బిగిస్తాను. వాగ్దేవి వాక్కులు — నన్ను నడిపించే  దివ్య దీపాలై  అక్షరీకరణానికి ఆశీర్వాదమై నిలుస్తాయి. ఇదే నా సాధన — జీవితం తాకిన ప్రతి క్షణాన్ని అక్షరాలుగా ...
Image
 అక్షరసూరీడు అక్షరసూర్యుడు పొడుస్తున్నాడు, అక్షరోదయం చేస్తున్నాడు. అక్షరకిరణాలు వెదజల్లుతున్నాడు, అక్షరజ్యోతులు వెలిగించుచున్నాడు. అక్షరలోకాన సంచరిస్తున్నాడు, అక్షరవైభవాలు కనబరుస్తున్నాడు. అక్షరదిక్కులు చూస్తున్నాడు, అక్షరమాయలు చేపిస్తున్నాడు. అక్షరజగతిని అలరిస్తున్నాడు, అక్షరమదులను మురిపిస్తున్నాడు అక్షరమంటలు రగిలిస్తున్నాడు, అక్షరవంటలు పండిస్తున్నాడు. అక్షరరంగులు పులుముతున్నాడు, అక్షరహరివిల్లులు పుట్టిస్తున్నాడు. అక్షరమబ్బులు తేలుస్తున్నాడు, అక్షరజల్లులు కురిపిస్తున్నాడు. అక్షరశోభలు ప్రదర్శిస్తున్నాడు, అక్షరహృదయాలు దోచుకుంటున్నాడు. అక్షరజాతికి జీవంపోస్తున్నాడు, అక్షరకవితలు సృష్టిస్తున్నాడు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
 నీళ్ళు…  మంచినీరు — దేహాల దప్పికను తీరుస్తూ ప్రాణాలకి ప్రాణవాయువుగా మారే పంచభూతాల సత్యస్వరూపం. తేనీరు — అలసట అంచున వేడిగా పలకరించే సాధారణ స్నేహం, ఆనందం. చన్నీరు — ఆకలికి ముందే అమ్మ చేతులు అందించే శాంతి జలం, ప్రసాదం. ఎలనీరు — వేసవి గాడ్పులకు ప్రకృతి ఔషధం, శరీరానికి శ్రేయం. ఏటినీరు — కాలం ఒడిలో పారుతూ తరతరాల కథలు మోసుకొచ్చే జీవనసాక్ష్యం, ప్రకృతిపుణ్యం. వేడినీరు — నొప్పుల్ని కరిగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచే చిన్న చికిత్స. వాననీరు — ఆకాశం భూమికి రాసిన ప్రేమలేఖ, పంటలకు జీవం. వరదనీరు - హద్దులు చెరిపేసే మనిషి అహంకారానికి ప్రకృతి చేసే హెచ్చరిక. పన్నీరు — ప్రేమ తాకితే భావాలు పరిమళాలై పూసే మౌన సుగంధం. కన్నీరు - హృదయం విరిగినపుడు కళ్ళు చూపించే మానసిక వేదన. మున్నీరు అంతులేని విస్తారం, తరంగాల గుండెల్లో సమాధానం, దాచుకున్న భూమిశ్వాస, తుపానుభీభత్సం. ఇన్ని నీళ్ళు —  ఒక్కొక్కటి ఒక్కో జీవితం,  ఒక్కొక్కటి ఒక్కో భావం. నీరు లేక జీవితం లేదు, భావం లేక కవిత లేదు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 అక్షరగీతం  అక్షరగీతం రాయాలని ఉన్నది — మనసుల తట్టే భావాల మ్రోగింపుని పల్లవిగా మలచాలని ఉన్నది. అక్షరపాట పాడాలని ఉన్నది — అమ్మభాష ఒడిలో లయల్ని ఊపిరిగా చేసుకుని హృదయాలకు హితబోధ చేయాలని ఉన్నది. అక్షరస్వరాలు వినిపించాలని ఉన్నది — నిశ్శబ్దపు నాడుల్లోకి నాదమై ప్రవహించి, భావాల రక్తధారల్లో లయను నింపాలని ఉన్నది. అక్షరవీణ వాయించాలని ఉన్నది — ప్రేమ తంతుల్ని తాకుతూ వేదనల్ని రాగాలుగా మలచి శ్రోతలకు శాంతి రుచి చూపించాలని ఉన్నది. అక్షరసన్నాయి ఊదాలని ఉన్నది — పండుగ గాలుల్లో తెలుగుతనం పరిమళిస్తూ ఆనందాల పిలుపునివ్వాలని ఉన్నది. అక్షరనృత్యం చేయాలని ఉన్నది — అర్థాల అడుగుల్ని లయల చేతుల్లో పెట్టి భావాల శిల్పంగా మలచాలని ఉన్నది. అక్షరజాతర చేయాలని ఉన్నది — అ ఆ ల నుంచి క్ష ఱ వరకు అక్షరాల్ని అల్లరి పిల్లలుగా పరుగెత్తించాలని ఉన్నది. అక్షరామృతం తాగించాలని ఉన్నది — కవిత అనే కలశంలో తెలుగుభాష తియ్యందనాలు పోసి అనంతానందంలో ముంచాలని ఉన్నది. అక్షరాలే నా శ్వాస, అక్షరాలే నా సంగీతం, అక్షరాలే నా పూజ, అక్షరాలే నా పరమార్థం. నేను — అక్షరాలు నడిపించే భావ యాత్రికుడిని,  సామాన్య సాధకుడిని. గుండ్శ్లపల్లి రాజేంద్రప్రసాద్,...
Image
 తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు, భక్తుల హృదయాల్లో భక్తి దీపం వెలిగించే బాలాజి అమృతబిందువు, అమూల్యప్రసాదం. లడ్డు లభించుట చేసుకున్న పుణ్యం, చేతికి చేరిన క్షణమే కలియుగ దేవుని కరుణా కటాక్ష ప్రాప్తం. పంచితే పుణ్యమై, పుచ్చుకుంటే ప్రసాదమై, అహంకారాన్ని కరిగించి అనురాగాన్ని పంచే శ్రీనివాస అనుగ్రహం. నెయ్యి పరిమళం, ఏలకుల సువాసన, భక్తి తాపంతో కలసి హృదయాల్లో నిలిచే వేంకటేశ్వర మాధుర్యం. ప్రతి బూందీలో వెంకటేశ్వర నామస్మరణ, గోవింద గోవింద ధ్వని అంతరంగాన్ని తాకే తిరుమలేశుని వైశిష్ట్యం. కళ్లలో కన్నీటికి సంతృప్తి చిరునవ్వు, మనసుకి శాంతి, శరీరానికి సాంత్వన, ఆనందం — తిరుపతి ప్రసాదం. శరీరానికి బలం, మనసుకి విశ్వాసం, ఆరోగ్యప్రదాయకమై ఆత్మకి ధైర్యం ఇచ్చే ఏడుకొండలస్వామి దివ్యప్రసాదం. తిరుపతి లడ్డు — ఒక తీపి పదార్థం కాదు, భక్తి, అదృష్టం, పుణ్యాల సంగమం, కలియుగ దేవుని నైవేద్య నైర్మల్యం, మహాప్రసాదం, దివ్య ఔషధం, మనోరంజితం, గోవిందునివరం. — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఊపుల ఊసులు  ఊయల ఊపితే — చిన్ననాటి నవ్వులు గాలిలో జోలపాటలై, కాలం తల్లడిల్లి గతం మళ్ళీ ఒడిలోకి జారుతుంది. చెట్టును ఊపితే — కొమ్మల విసుర్లతో ఆకుల చప్పట్లతో గాలికీ ఒక భాష పుడుతుంది. తలను ఊపితే — అవునన్న అంగీకారమో, కాదన్న నిరాకరణో, మౌనమే మాటలై పలుకుతుంది. చేతులు ఊపితే — వీడ్కోలు కన్నీటిగా మారి, స్వాగతం ఆశగా వికసించి, దూరాలు దగ్గరవుతాయి. జెండాను ఊపితే — వీరుల రక్తస్మృతులు అలలై ఎగసి, గుండెల్లో దేశం జయజయ ధ్వనిగా మోగుతుంది. బ్యాటును ఊపితే — బంతి కాదు ఎగిరేది, లక్షల కలలు, గెలుపు గుబురుగా పూస్తుంది. నడుము ఊపితే — లయకు శరీరం నాట్యం చేస్తుంది, అందం ఆడుతుంది, ఆనందం వెల్లివిరుస్తుంది. పైటకొంగు ఊపితే — సిగ్గు చిరునవ్వు చింది, సౌందర్యం మౌనంగా హృదయాల్ని దోచుకుంటుంది. తోకను ఊపితే —  నిజాయితీ గుర్తించక నేరగాడిగా ముద్ర వేస్తారు, అవసరం తీరగానే తెగగొట్టి పడేస్తారు, లాభం కోసం తన్ని తగలేస్తారు. నోటును ఊపితే — చెంతకు చేరి చెలిమిచేస్తారు, మాటలతో మేనమామలు అవుతారు, చేతులు కలిపి, సమయంచూచి చేటుచేస్తారు. ఇవన్నీ ఊపులే —  కానీ ఒక్కో ఊపు జీవితానికి ఒక అర్థం, హృదయానికి ఒక స్పందన, మనసుకి ఒక ఉత్సవం. ఊపు...
Image
 నలిగిన బతుకులు  నలిగిన బట్టలు పేదరికపు మచ్చలు, నలిగిన దేహాలు మోసపోయిన మనసులు. నలిగిన బంధాలు విఫలమైన ప్రేమలు, నలిగిన హృదయాలు కన్నీటి సముద్రాలు.   నలిగిన మనసులు వేదనలకు తావులు, నలిగిన మనుషులు నిరాశల స్థావరాలు. నలిగిన అక్షరాలు చెప్పలేని వేదనలు, నలిగిన కాగితాలు దాచిపెట్టుకున్న కలలు. నలిగినా… జీవితాలు పూర్తిగా విరగవు, బూడిదలో దాగిన నిప్పుల్లా ఒక రోజు తిరిగి మండుతాయి. నలిగిన ప్రతీ మనిషి లోపల ఒక అగ్ని నిద్రపోతుంది -  అది తప్పక లేస్తుంది,  రేపటి ఉదయమవుతుంది. నలిగిన పువ్వులు సువాసనలు చల్లుతాయి, నలిగిన బంగారము కాంతులు చిమ్ముతాయి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 తెరిచిన వేళలు  తెరిచిన తలుపులు — అతిధులను ఆహ్వానిస్తాయి,  అందాలు చూపుతాయి, ఆనందాలు అందిస్తాయి.    తెరిచిన పుస్తకాలు — నిజాలు తెలుపుతాయి, నిజాయితీ నిరూపిస్తాయి, నమ్మకాలు కలిగిస్తాయి.  తెరిచిన కళ్ళు — చూపు పరిధిని దాటి, నిజాన్ని, న్యాయాన్ని నిశ్శబ్దంగానే గుర్తిస్తాయి. తెరిచిన నోరు — అబద్ధాల మౌనాన్ని చెరిపి, సత్యానికి స్వరం ఇచ్చి సమాజాన్ని కదిలిస్తుంది. తెరిచిన మనసులు — ద్వేషపు తాళాల్ని విరిచివేసి, అనురాగానికి, ఆలోచనకు విశాలమైన స్థలాన్ని ఇస్తాయి. తెరిచిన గతము — జీవితపు గమ్యాల్లో దాచిన కష్టసుఖాల సరుకును ఒక్కొక్కటిగా బయటపెడతాయి. తెరిచిన గుప్పెట్లు — పిడికిలిలో దాచిన రహస్యాల్ని వెదజల్లుతూ, వెల్లడించటమే నిజమైన సద్గుణం అని  మనసుకు నేర్పుతాయి. ఇవన్నీ తెరిచినప్పుడే — కాలమే తెరచుకుంటుంది, మనిషి మనిషిగా ఎదిగి జీవితం అర్థవంతమవుతుంది. తెరిచిన వేళలే - అంతరంగాల్లో నిద్రపోయిన  వెలుగుకు మేల్కోలుపు, ఆలోచనల బహిరంగము.  తెరిచిన క్షణాల - కాలం నిశ్శబ్దంగా నడుస్తుంది, తెరిచిన వేళల - మనసు తనే తనను చదువుకుంటుంది. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.  
 అక్షరాల ఇంద్రజాలం అక్షర భ్రమలు — మనసు అద్దాల్లో మెరుస్తూ, భావాల ప్రతిబింబాల్ని అనంతంగా తిరిగే చక్రాలుగా మలుస్తాయి. అక్షర స్వప్నాలు — నిద్రలేని కన్నుల్లోకి నక్షత్రాల్ని దించి, కవితల పూలవనాలు పూయిస్తాయి. అక్షర కల్పనలు — కల్పవృక్షాల నీడలో అనుభూతుల ఊయలలు ఊగి, అసాధ్యాన్నీ సుసాధ్యం చేస్తాయి. అక్షర పన్నాగాలు — సర్పిల వాక్యాల్లో అర్థాల్ని బంధించి, వేల భావాల్ని కూర్చుతాయి. అక్షర స్మృతులు — కాలపు గడియారాల వెనుక నిలిచిన చిరునవ్వుల్లా, హృదయాన్ని మళ్లీ మళ్లీ తాకుతాయి. అక్షర స్తుతులు — మౌనానికి మంత్రాలై, వాక్కుకు వెలుగులై, సృష్టిని ప్రశంసించే గానంగా మారుతాయి. అక్షర వేటలు — అజ్ఞాన అరణ్యాల్లోకి దూకి, సత్యాల్ని పట్టుకుని, చైతన్యపు దీపాలు వెలిగిస్తాయి. అక్షర యుక్తులు — తర్కానికి సౌందర్యాన్ని జోడించి, బుద్ధికి భావాన్ని కట్టించి, వాక్యాన్ని వజ్రంలా తీర్చిదిద్దుతాయి. అక్షర సూక్తులు — చిన్న వాక్యాల పొదల్లో జీవితపు సారాన్ని దాచి, యుగాల్ని దాటింటే దారులవుతాయి. అక్షర రాతలు — కవికలంనుంచి జారి, హృదయపు శ్వాసలై కాలంపై చెక్కిన చిరునామాలవుతాయి. అక్షర మాయాజాలం — నా కలం పలికిన క్షణం నుంచీ భాషకు శ్వాస, భావానికి రూ...
Image
 🌧️ అక్షరవాన కురుస్తుంటే… 🌾📖 వానచినుకులు చిటపటా పడుతుంటే, భూమి లయపట్టి సుశబ్దాలు వినిపిస్తుంది, కాలం క్షణాల్లో కరిగిపోతూ, నిశ్శబ్దం శ్వాస తీసుకుంటుంది. అక్షరజల్లులు టపటపా రాలుతుంటే, మౌనపు గర్భంలో అర్థాలు మొలకెత్తి, ఆలోచనలకు రూపం ఇచ్చి, మనసుకు దారులు చూపిస్తుంది. నల్లని మబ్బులు గర్జిస్తుంటే, అంతరంగ మౌనం గొంతు విప్పి, అనుభవాల భారం దించుకుని, కాలంతో మాట కలుపుతుంది. మిన్నున మెరుపులు మిళమిళా మెరుస్తుంటే, చీకటి నుదుట సత్యం మెరుస్తుంది, అజ్ఞానపు అంచులు చెదిరి, అర్థజ్యోతి సర్వత్రా వ్యాపిస్తుంది. చల్లని గాలి తాకిన వేళ, జడమైన ఆలోచనలు కదిలి, నిశ్చలత కరిగి ప్రవాహమై, చైతన్యం దారి పడుతుంది. మట్టివాసనలు వ్యాపిస్తుంటే, వేరుల జ్ఞాపకాలు తడుముతాయి, నేలతో ఉన్న బంధం గుర్తొచ్చి, మనసు నేలవైపు వంగుతుంది. వర్షపునీరు గలగలా పారుతుంటే, పాత గాయాలు మానిపోతాయి, వేదనల బరువు తేలిపోగా, హృదయం తేలికపడుతుంది. అక్షరఝరులు టకటకా ప్రవహిస్తుంటే, స్పర్శలుగా మనసును తాకి, గాయాలపై సాంత్వన చల్లుతూ, భావాలకు ఊపిరి పోస్తాయి. సకాలవర్షం సంబరమైతే, సమాజం సేదతీరుతుంది, అక్షరవాన కురిస్తే, సాహిత్యం పునర్జన్మ పొందుతుంది. వానలు కురవాలి ...
Image
 🌺 తెలుగు అక్షరాల జోరు 🌺 తెలుగు అక్షరాలు పువ్వులైతే — తల్లి తలపై చల్లమను, దండలుగా అల్లించి, తెలుగు మాత మెడలో వెయ్యమను. తెలుగు అక్షరాలు నవ్వులైతే — మోములను వెలిగించి, పెదాలను తెరిపించి, తెలుగు వెలుగులు చల్లించు. తెలుగు అక్షరాలు ముల్లులైతే — వ్యతిరేకులను హెచ్చరించి, వారి తీరును మార్చించి, తెలుగు బాటను పట్టించు. తెలుగు అక్షరాలు కర్రలైతే — విన్యాసాలు చేయించి, వినోదాలు అందించి, తెలుగు కళలను ప్రదర్శించు. తెలుగు అక్షరాలు నిప్పులైతే — అవినీతి చీకట్లను కాల్చి, ధర్మాన్ని నిలబెట్టి, తెలుగు జ్యోతులై ప్రసరించు. తెలుగు అక్షరాలు దీపాలైతే — అజ్ఞాన అంధకారంలో వెలిగి, బుద్ధి బాటలో నడిపించి, తెలుగు ఖ్యాతిని వ్యాపించు. తెలుగు అక్షరాలు రంగులైతే — జీవిత చిత్రపటాలకి ప్రాణం పోసి, నవరసాల సమ్మేళనంగా, తెలుగోళ్ల మనసులు మురిపించు. తెలుగు అక్షరాలు ఏరులైతే — అనుభూతి కొండల నుంచి జారి, భావ సాగరానికి చేరి, తెలుగు కవితా స్రవంతిగా ప్రవహించు. తెలుగు అక్షరాలు వెన్నెలైతే — నేలపై జల్లుగా కురిసి, కలల తోటలో తెలుగు శాంతి కుసుమాలు పూయించు. తెలుగు అక్షరాలు కవితలైతే — అందాలు చూపించి, ఆనందాలు పంచి, తెలుగు ప్రేమికుల అంతరంగాలు ద...
 అక్షరానుభూతులు అక్షరాలు చూస్తే — కళ్లల్లో దూరుతున్నాయి, నిశ్శబ్ద నుదిటిపై నక్షత్రాల్లా వెలుగుతాయి. అక్షరాలు వస్తే — హృదయానికి హరివిల్లై, అనుభూతుల అంచులపై అమృతబిందువులై చేరుతున్నాయి. అక్షరాలు రాస్తే — వేళ్లకు వేదన ఒక వరమై, పుటలపై సిరిమువ్వలై సంగీతపాఠాలు చెబుతున్నాయి. అక్షరాలు చెబితే — నోటి నిండా నెయ్యిలా, అర్థాల అగ్నిలో ఆలయ దీపాలవుతున్నాయి. అక్షరాలు రాలితే — కాలం కడలిలో జ్ఞాపకాల ముత్యాలై మౌనానికి అర్థం చెబుతున్నాయి. అక్షరాలు వెళ్ళితే — విడిపోతున్న వేళల్లో మనసుని ముట్టే వేదనగా మిగిలిపోతున్నాయి. అక్షరాలు లేస్తే — నిద్రలేని ఆలోచనలకు ఉషస్సులై వచ్చి ఆశలకు అద్దం పడుతున్నాయి. అక్షరాలు తడితే — భావాల వర్షంలో పదాలు పరిమళించి కవితగా పూస్తున్నాయి. అక్షరాలు కురిస్తే — చీకటి గుండెల్లో వెలుగు నదులై వేగంగా ప్రవహిస్తున్నాయి. అక్షరాలు తోస్తే — ప్రాణాల పడవను అనంత తీరాలకు అక్షయంగా నడిపిస్తున్నాయి. అక్షరాలు - హృదిని కదిలిస్తున్నాయి, మదిని తొలుస్తున్నాయి, జీవనసుధని కురిపిస్తున్నాయి. అక్షరాలు - కలమును పట్టిస్తున్నాయి, ముందుకు నడిపిస్తున్నాయి, కవనాలు వ్రాయిస్తున్నాయి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగర...
Image
మంగళూరు మహతోభార  మంగళాదేవి మాతా!  వెండితేజస్సు విగ్రహమై విశ్వశాంతిని ఒలికించే కరుణామయి మంగళాదేవీ — వేలవేల వందనాలు విశ్వమాతా!  నిత్యజ్యోతుల వెలుగులలో అభయహస్తం విప్పి అపాయాల అపహరించే తల్లీ — పదివేల ప్రణామాలు ప్రసూతీ! పుష్పహారాల పరిమళంలో భక్తి బిందువులు జలజలలాడగా వెండిముఖంలో మెరుస్తున్న వాత్సల్య చంద్రకాంతివి నీవే అమ్మా! మంగళనామమే మంత్రమై మంగళూరుకు ప్రాణమై శక్తి పీఠపు సింహాసనంపై శాశ్వత శాంతిగా నిలిచినావు జననీ! వివాహ విఘ్నాలు వీడి పోవగా వంశవృద్ధి వసంతమవగా దుఃఖదారులు మూసి వేసి సుఖసోపానాలు విప్పే తల్లీ! అమ్మా మంగళాదేవీ! నీ వెండి స్వరూప దర్శనమే నా కవితకు కాంతియై నా జీవితానికి మంగళదీపమై— నిత్యం నా అక్షరాలలో వెలుగవమ్మా దేవీ! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం