Posts

Showing posts from July, 2024
Image
 ఓ మనిషీ! పూలుపూయని మొక్కను పీకేయకురా! కాయలుకాయని చెట్టును కొట్టేయకురా! బిడ్డలుకనని భార్యను బాధించకురా! వాసనలేని విరులను విసిరేయకురా! వర్షించని మేఘాలను దూషించకురా! పంటపండలేదని పొలాలను బీడులుగా వదలకురా! నిత్యం మానవత్వం చూపరా! అనుదినం ఆర్తులను ఆదుకోరా! రోజూ ప్రేమను పంచరా! ప్రతిదినం ప్రజాసేవను చెయ్యరా! సతతం సంఘసంక్షేమానికి శ్రమించరా! మనిషిగా మెలగరా మూర్ఖత్వాన్ని వీడరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవుల ఘనకార్యాలు ఊహల్లో ఉరికిస్తారు ఉల్లాల్లో ఉండిపోతారు కైతల్లో కనపడతారు కలల్లో కవ్విస్తారు నదుల్లో ముంచుతారు సముద్రంలో తేలుస్తారు పెదవుల్తో పలికిస్తారు గొంతుల్తో గళమెత్తిస్తారు కల్పనల్లో కూరుస్తారు బ్రాంతుల్లో పడవేస్తారు ఉయ్యాలల్లో ఊగిస్తారు ఉత్సాహాల్లో ఉప్పొంగిస్తారు వెన్నెలలో విహరింపజేస్తారు పూలతోటల్లో పచార్లుచేయిస్తారు కలాల్లో దూరతారు కాగితాల్లో కూర్చుంటారు అక్షరాల్తో బంధిస్తారు పదాలతో కట్టేస్తారు దోసిట్లలో అమృతంపోస్తారు అధరాలతో ఆస్వాదించమంటారు అందాల్లో కాపురంపెట్టిస్తారు ఆనందాల్లో కాలక్షేపంచేయిస్తారు కవులు కవనబ్రహ్మలు కవితలు తేనెలజల్లులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాకుమ్మరింపులు అరిసెలా తీయగున్నది నోటిలో నానుతున్నది ముద్దలా మ్రింగమంటున్నది కడుపును నింపుకోమంటున్నది చుక్కలా చక్కగున్నది కనులారా కాంచమంటున్నది గాలిలా వీచుచున్నది మేనును త్రాకుచున్నది ఊహలు లేపుచున్నది ఊయల ఊపుచున్నది ఉత్సాహం కలిగిస్తుంది ఉవ్విళ్ళు ఊరిస్తుంది అమృతంలా త్రాగమంటున్నది అధరాలకు అంటుకుంటున్నది పసందుగా పాడమంటున్నది పరవశంలో మునిగిపొమ్మంటున్నది తనను గుర్తించుకోమంటున్నది కవిని తలచుకోమంటున్నది కవితకి స్వాగతం కవికి వందనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాధ్యేయం కవితాతీరు మారాలి కవనశక్తిని చాటాలి విషయం వైవిధ్యం కనపరచాలి విధానం విన్నూతనం చూపించాలి అల్లిక అదరగొట్టాలి మదులను మురిపించాలి హృదయాలను పొంగిపొర్లించాలి పాఠకులను పరవశపరచాలి పోలికలు ఆకర్షించాలి మోదము మదులమీటాలి కవిత్వం కమ్మదనముచూపాలి సాహిత్యం శాశ్వతముగనిలవాలి కవనాలు కీర్తీనితేవాలి కవులు అమరులయిపోవాలి సమ్మేళనాలు సాగుతుండాలి సత్కారాలు జరుగుతుండాలి చెప్పిందే చెప్పకూడదు తోచిందే రుద్దకూడదు భాషను బ్రతికించేలాగుండాలి వెలుగులను వ్యాపించేలాగుండాలి సాహితీపయనాన్ని సాగిద్దాం సరస్వతీసేవలని చేసేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా చిట్టా చూపు చక్కగుండాలి పిలుపు తియ్యగుండాలి నడక రాజసంచూపాలి నడత ఆదర్శంగుండాలి శాంతం ముఖానకనిపించాలి పంతం పనుల్లోచూపాలి నవ్వులు చిందుతుండాలి మోమును వెలుగిస్తుండాలి తలనిండ మేధస్సుండాలి తనువునిండ తేజస్సుండాలి ముచ్చట్లు కొలుపుతుండాలి మురిపాలు చేస్తుండాలి నాలుక కదులుతుండాలి కడుపు నిండుతుండాలి పెదవులు అమృతంచల్లాలి చెవులు శ్రద్ధగావినాలి ఆకారం ఆకర్షించాలి అంతరంగం ఉప్పొంగిపోవాలి అందం ఆకట్టుకోవాలి ఆనందం మదినినింపాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనవృక్షం నేను కడలిలో చుక్కను కారడవిలో మొక్కను కవులలో అనామకుడను రోజూ కవనవృక్షంక్రింద కూర్చుంటాను కుతితీర్చుకుంటాను రోజూ లక్షల అక్షరపత్రాలను ప్రోగుచేస్తాను పేర్చుతాను రోజూ వందల పదపుష్పాలను సేకరిస్తాను అల్లుతాను రోజూ కొలది కవితాకాయలను పండిస్తాను పంచుతాను రోజూ కవనతరంగాలను త్రోలుతాను తనువులుతడతాను రోజూ కవితాగానాలను వినిపిస్తాను వినోదపరుస్తాను రోజూ కవనమేఘాలను చెంతకుపిలుస్తాను జల్లులుకురిపిస్తాను రోజూ సాహితీవనప్రియులను సమీపిస్తాను సంబరపరుస్తాను రోజూ సాహితీవనంలో సంచరిస్తాను సుభిక్షంచేస్తాను రోజూ కవినై కవితనై ముందుకొస్తుంటాను మదులుదోస్తుంటాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తీరనిదాహం నా దాహం తీరటంలా నేకోరింది దొరకటంలా నా స్వప్నం నిజమవటంలా నేననుకున్నది జరగటంలా నా సేద్యము ఫలప్రదమవటంలా నేనాశించినది పండటంలా నా ప్రయత్నం ప్రయోజనమివ్వటంలా నేనుతలచినది లభించటంలా నా పయనం ఆగటంలా నేచేరాలనుకున్నది చేరువవ్వటంలా నా ఆశయం నెరవేరటంలా నేకాంక్షించినది చిక్కటంలా నా కలం నాణ్యంగావ్రాయటంలా నేనుచెప్పింది అమలుపరచటంలా నా ఊహలు ఉపయోగపడటంలా నేనుద్దేశించింది సిద్ధించటంలా నా మనసు సహకరించటంలా నేకావాలన్నది అందించటంలా అందమైన ఆనందకరమైన కవిత కూరటంలా అద్భుతమైన అపరూపమైన కైత తయారవటంలా అమోఘమైన ఆశ్ఛర్యకరమైన కయిత పుటలకెక్కటంలా అమూల్యమైన అసమాన్యమైన కవనము కలమునుండిజాలువారటంలా ఆదిప్రాసయుక్తమైన అంత్యప్రాసయుక్తమైన కైతము కాగితాలపైకూర్చోవటంలా అమృతతుల్యమైన అపూర్వమైన కవిత్వము ఆవిర్భవించటంలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాస్వాదనలు కొన్నికవితలు కురుస్తాయి కడవలోపట్టుకో కమ్మగాక్రోలుకో కొన్నికవితలు వీస్తాయి సౌరభాలుపీల్చుకో సంతసాలతేలిపో కొన్నికవితలు హారాలుగావస్తాయి అందుకో అలరించుకో కొన్నికవితలు పారుతుంటాయి ప్రవాహములోదిగు అమృతములాత్రాగు కొన్నికవితలు వంటకాలులావస్తాయి ఆరగించు ఆహ్లాదించు కొన్నికవితలు తేనెనుచిందుతాయి స్వీకరించు సంబరపడు కొన్నికవితలు అందాలొలుకుతాయి వీక్షించు వినోదించు కొన్నికవితలు శ్రావ్యంగావినబడుతాయి ఆలకించు ఆనందించు కొన్నికవితలు రమ్మనిపిలుస్తాయి చెంతకువెళ్ళు ఆస్వాదించు కొన్నికవితలు పూస్తాయి కాంచు కుతూహలపడు కైతలను తప్పకచదువు కవులను మదినతలచు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 వదలింపులు చిన్నప్పటినుండి వదులుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు పేరు వదులుకున్నా అసలుపేరు అంకయ్య నేటిపేరు రాజేంద్రప్రసాదు ఊరు వదులుకుకున్నా పుట్టినఊరు చీర్వానుప్పలపాడు నేడునివసిస్తున్నఊరు హైదరాబాదు పొలాలు వదులుకున్నా తక్కువధరలకు అమ్ముకున్నా అన్నదమ్ములతో పంచుకున్నా ఆస్తులు వదులుకున్నా సంతానానికి ఇచ్చా సతికి వ్రాసిచ్చా వ్యవసాయం వదులుకున్నా ఓపిక నశించింది శ్రద్ధ తగ్గిపోయింది వృత్తి మార్చుకున్నా చేసినవృత్తి బ్యాంకు ఉద్యోగము చేస్తున్నవృత్తి రచనా వ్యాసాంగము పిల్లలను వదులుకున్నా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు భార్యమాత్రమే నిలిచిందితోడు స్నేహితులను వదులుకున్నా ఉన్నారోలేదో తెలియదు ఎక్కడున్నారో పత్తాలేదు బాంధవ్యాలు వదులుకున్నా అక్కాచెల్లెల్లు అలకపూనారు అన్నాతమ్ములు అవసరంలేదనుకున్నారు అభిమానులను వదులుకుంటున్నా పొగడ్తలు వద్దంటున్నా పలకరింపులు వలదంటున్నా ప్రాణాలను వదలబోతున్నా దేవుడిపిలుపుకై ఎదురుచూస్తున్నా క్రిష్ణారామాయంటూ కాలంగడుపుతున్నా విప్పాను వదలింపుల చిట్టా తెలిపాను త్యజింపుల లెక్క గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఆకాశం  ఆకాశం అందాలనుచూపింది ఆనందం అందరికీచేర్చింది చందమామా రావే అని మదిపిలిచింది రమ్మన్నారనుకొని గగనమే  క్రిందకు కదిలింది సత్వరం బయలుదేరింది గాలివేగం పుంజుకుంది వడగళ్ళు టపటపారాల్చింది చినుకులను చిటపటాచల్లింది రాళ్ళునీళ్ళు విసిరింది చల్లగాలులు తోలింది వెన్నెలను వెదజల్లింది తళుకులను చిమ్మింది కిరణాలను కురిపించింది చీకట్లను తరిమివేసింది మేఘాలను అరిపించింది మెరుపులను మెరిపించింది నీలిరంగు పులుముకున్నది నేత్రాలను పరవశపరచింది ఇంద్రధనుస్సు వెలిసింది ధరణి మురిసింది ఆకాశం దిగివచ్చింది అంతరంగం ఎగిరిగంతులేసింది భావకవిత్వానికి బంధాలులేవని తెలిసింది బహిరంగపరచటానికి భ్రమలుచాలునని తేలింది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జై జై తెలుగు తెలుగుతల్లి బిడ్డనోయ్ వెలుగుచిమ్ము వాడనోయ్ తెలుగుపలుకు నోరునోయ్ తీపి చల్లుచుందునోయ్ తెలుగుజాతి వారసుడనోయ్ తాతముత్తాతల తలతునోయ్ తెలుగునేల తిరుగువాడనోయ్ తోటివారిమేలు కోరుచుందునోయ్ తెలుగుతోట పెంచువాడనోయ్ వివిధపండ్లు కాయించెదనోయ్ తెలుగుపూలు పూయించదనోయ్ పరిమళాలు ప్రసరించెదనోయ్ తెలుగుఖ్యాతి చాటువాడనోయ్ గళమునెత్తి స్తుతించువాడనోయ్ తెలుగుజ్యోతులు వెలుగించువాడనోయ్ చుట్టూకాంతులు వ్యాపించువాడనోయ్ తెలుగుగాలి వీచువాడనోయ్ తనువుతట్టి పులకించువాడనోయ్ తెలుగుదేశానికి జైకొట్టువాడనోయ్ గొంతులుకలిపి ముందుకురారండోయ్ తెలుగక్షరాలు ముత్యాలోయ్ చిక్కగహారాలు కూర్చండోయ్ తెలుగుపదాలు చక్కెరగుళికలోయ్ చక్కగపొదిగి పాటపాడండోయ్ తెలుగుకైతలు కూర్చెదనోయ్ తేటపదాలు వాడెదనోయ్ తెలుగామృతము చల్లెదనోయ్ తృప్తినందరికి కలిగించెదనోయ్ జైజై తెలుగు జయహో తెలుగు జైజై తెలుగు జయహో తెలుగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాయా పండా!  పసరు పిందెయ మిక్కిలి చిన్నది ముచ్చట కొలిపేది అందరిని అలరించేది పచ్చబడిన పండు తెంపినకాని తినటానికిపనికిరానిది దొంగలు దగ్గరకురాకుండా కోయకుండా కాపాడవలసినది చిలక కొట్టినపండు తయారయినదని తీపితోనిండినదని తంటాలుతెచ్చుకోకుతిని ఎర్రగా పండినపండు రంగు ఆకర్షిస్తుంది నోరును ఊరిస్తుంది తినమని తొందరపెడుతుంది ఎక్కువగా మాగినపండు రసముతోనిండినది జుర్రుకోవలసినది సంతసపరచగలది రాలిపడిన పండు ఈగలుదోమలు ముసిరినది మట్టి అంటుకున్నది కడుక్కొని తినవలసినది ఫలాలప్రియా తేల్చుకో పసిడిపిందెను కోరకు పశువువు కాబోకు పచ్చికాయను కాంక్షించకు ఆవేశపరుడవని చాటకు ఎంగిలిపండుకు ఆశపడకు కక్కుర్తిపరుడనని ముద్రవేసుకోకు పరిపక్వఫలమును వాంఛించు ఆరగించి ఆనందించు పండు ఎవరో భక్ష్యకుడు ఎవరో అర్ధమయిందా మనసుకెక్కిందా అర్ధంకాకపోతే మరలాచదువు మనసుకెక్కితే ముచ్చటపడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవిత్వం కావాలికవిత్వం చూపాలికవిత్వం కవిత్వం కమ్మగానుండాలి సాహిత్యం సొమ్ములాగుండాలి కవిత్వంలో కవితశాతంపెరగాలి కవనంలో వచనశాతంతగ్గాలి తక్కువపదాలతో ఎక్కువభావంతెలుపాలి అనవసరపదాలతో ఎక్కడావిసిగించకుండాలి విషయాలలో విన్నూతనంచూపాలి వివరణలలో వైవిధ్యంచాటాలి అక్షరాలు జలజలలాడాలి పదములు జివజివలాడాలి ధనమై దాచుకోమనాలి దుస్తులై ధరించమనాలి చూస్తే ఆకర్షించాలి చదివితే అంటుకుపోవాలి ఆరంభం అదరగొట్టాలి అంతం అంతరంగాన్నితట్టాలి పోలికలు పెక్కుండాలి ప్రాసలు ప్రవహించాలి విసిరితే వంటికితగలాలి ప్రేలిస్తే మనసులోదూరాలి స్వాగతిస్తే చెంగుచెంగునరావాలి స్వరపరిస్తే చెవులకుశ్రావ్యతనివ్వాలి కదిలిస్తే చకచకనడవాలి అదిలిస్తే పరుగులుతీయాలి అర్ధంచేసుకుంటే అమృతంచల్లాలి మదిలోదాచుకుంటే మహత్యంచూపాలి క్షరరహితాలు కళకళలాడాలి కూర్చినపదాలు కువకువలాడాలి కవిత్వం పెన్నిధికావాలి కవనం సన్నిధినుండాలి కవిత్వం శ్రీశ్రీనితలపించాలి కవనం త్రిశ్రీనిగురుతుకితేవాలి కవిత్వం కావాలి కవిత్వం కవిత్వం చూపాలి కవిత్వం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం (త్రిశ్రీ= త్రిపురనేని శ్రీనివాస్)
Image
 సాహిత్యశోభలు మేఘాలు చినుకులు రాలుస్తున్నాయి చిన్నారులు చిందులు త్రొక్కుతున్నారు కవులు కలాలకు పనిపెడుతున్నారు పలుకులు తేనెచుక్కల్లా చల్లబడుతున్నాయి వినేవాళ్ళు ఆలకించి అబ్బురపడుతున్నారు కైతగాళ్ళు కమ్మగ పుటలనింపుతున్నారు రవి కిరణాలను ప్రసరిస్తున్నాడు భువి మిలమిల మెరిసిపోతున్నది కవి కని కైతలుకూరుస్తున్నాడు శశి వెన్నెలను వెదజల్లుతున్నాడు గాలి చల్లగా వీస్తున్నది కయి ప్రేమపాటలు వ్రాస్తున్నాడు కవులు భావాలను వదులుతున్నారు పాఠకులు పఠించి పరవశపడుతున్నారు సాహితీలోకము సుసంపన్నమై శోభిల్లుతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనయఙ్ఞము రోజూ కవితాక్షీరాన్ని చిలుకుతున్నాను కాస్తోకూస్తో సాహిత్యామృతాన్ని వెలికితీస్తున్నాను రోజూ ఊహలను ఉల్లానపారిస్తున్నాను ఏవో విషయాలను వివరిస్తున్నాను రోజూ కలమును కరానపడుతున్నాను ఏదో భావమును బయటపెడుతున్నాను రోజూ అక్షరసేద్యము చేస్తున్నాను ఎన్నో సాహిత్యపంటలు పండిస్తున్నాను రోజూ పదపుష్పాలను సేకరిస్తున్నాను ఎన్నో కవనహారాలను గుచ్చుతున్నాను రోజూ అందాలను చూస్తున్నాను ఏలనో పుటలపైన పెడుతున్నాను రోజూ ఆనందాలను పంచుతున్నాను ఎందరికో మానసికతృప్తిని కలిగిస్తున్నాను రోజూ వాణీదేవిని పూజిస్తున్నాను ఎన్నో వరాలిమ్మని వేడుకుంటున్నాను రోజూ కవితను వ్రాస్తున్నాను ఎన్నో మదులను దోస్తున్నాను రోజూ కవితాయఙ్ఞము చేస్తున్నాను ఏలనో విరామము ఇవ్వలేకున్నాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తల్లీ సరస్వతీ! ఊహలుపారించి ఉత్సాహముకలిగించి ఉల్లమునుపొంగించి ఉవ్వెత్తునలేపించి కవనలోకమందు కాంతులు చిమ్మించుటకు నీవే కారణము తల్లీ నీదే ప్రేరణము తల్లీ! కలములుపట్టించి కాగితాలనందించి కవితలువ్రాయించి కవులనుసృష్టించి సాహిత్యప్రపంచమందు శాశ్వతస్థానమిప్పించుటకు నీవే ప్రధానము తల్లీ నీదే ప్రావీణ్యము తల్లీ! చదివించి పాడించి మదులతట్టి ఆనందపరచి సాహితీజగత్తునందు చిరంజీవినికావించుటకు నీవే స్ఫూర్తి తల్లీ నీదే కీర్తి తల్లీ! అక్షరాలనేరి పదాలపేర్చి పంక్తులపొదిగి కైతలనుకూర్చి కవితాజగమునందు కలకాలమునిలుపుటకు నీవే మూలము తల్లీ నీదే మూల్యము తల్లీ! సమ్మేళనాలునిర్వహించి శాలువాలుకప్పించి బిరుదులుప్రదానముచేసి పేరుప్రఖ్యాతులునిచ్చి సారస్వతవిశ్వమందు తారకల్లా వెలుగుటకు నీవే అస్త్రము తల్లీ నీదే శస్త్రము తల్లీ! గీతాలనురాయించి గళములనెత్తించి గాంధర్వులచేపాడించి గానామృతమునుపంచి సంగీతజగత్తునందు వీణానాదములువినిపించుటకు నీవే యుక్తి తల్లీ నీదే శక్తి తల్లీ! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 9177915285
Image
 కోకిల కబుర్లు కోకిల పొద్దున్నెవచ్చింది పెరటిచెట్టుపైన వ్రాలింది కొమ్మపైన కూర్చుంది గళమును విప్పింది కుహూకుహూ కూసింది కుతూహలము కలిగించింది కమ్మగ పిలిచింది మాధుర్యాలు క్రోలుకొమ్మంది శ్రావ్యంగ పాడింది బాధలు మరచిపొమ్మంది చెంతకు రమ్మంది చెవులకు విందునిచ్చింది మదిని మురిపించింది మధురిమలను పంచిపెట్టింది సంతసము పొందమంది తనను గుర్తించుకొమ్మంది మనసుపెట్టి వినమంది రాగామృతము త్రాగమంది ఆలపించి ఆకర్షించింది మనసును దొచేసింది సెలవు తీసుకుంది మరసటిరోజు మరలావస్తానంది రివ్వున ఎగిరిపోయింది నిశ్శబ్దము ఆవరించింది కోకిలకబుర్లు నచ్చకపోతే క్షమాపణలు కూర్చినవ్రాతలు బాగున్నాయంటే ధన్యవాదాలు   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పెళ్ళాం జోలి పెళ్ళాన్ని ఒప్పించటం ఒక కళ పెళ్ళాన్ని మెప్పించటం ఒక కల పెళ్ళాన్ని ముట్టుకోవటం ఒక సుఖం పెళ్ళాన్ని తట్టుకోవటం ఒక కష్టం పెళ్ళాన్ని రెచ్చకొట్టటం ఒక అవివేకకార్యం పెళ్ళాన్ని ఎదిరించటం ఒక అనాలోచితకృత్యం పెళ్ళాన్ని తిరస్కరించటం ఒక తిరోగమనకార్యం పెళ్ళాన్ని వదులుకోవటం ఒక అవివేకనిర్ణయం పెళ్ళాని సమర్ధించటం తననుకాపాడుకోవటం పెళ్ళాని అర్ధించటం తనశాశ్వతలొంగుబాటుతనం పెళ్ళాన్ని కాపాడుకోవటం ఒక సామాజికవసరం పెళ్ళాన్ని పోషించటం ఒక తప్పుకోలేనివాగ్దానం పెళ్ళాన్ని ప్రశ్నించటం ఒక తగవుకుశ్రీకారంచుట్టటం పెళ్ళాన్ని ప్రేమించటం ఒక తెలివైనభర్తపాటించవలసినగుణం పెళ్ళాన్ని సరిసమానిగాచూడటం పరస్పరనమ్మకానికినిదర్శనం పెళ్ళాలను మంచిగచూచుకుందాం మమతానురాగాలనుపంచుకుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 జీవితపాఠాలు జీవనం గాలివాటం బ్రతకటంకోసం నిత్యపోరాటం బాల్యం అమాయకం తోచిందిచెయ్యటం దొరికిందిపుచ్చుకోవటం కౌమారం ఙ్ఞానార్జనం జీవితగమ్యం నిశ్చయించుకోవటం యవ్వనం కలలుకనటం భాగస్వామితోకాలంగడపడటం సుఖాలుపంచుకోవటం వృధ్యాప్యం ఙ్ఞాపకాలునెమరువేసుకోవటం మరణంకోసం ఎదురుచూడటం పరోపకారం మానవత్వం అపకారం అమానుషం పడటం సామాన్యం లేవటం సరిదిద్దుకోవటం ప్రయత్నం సాధనకుమూలం విరమించుకోవటం ఓటమినొప్పుకోవటం ఓడిపోవటం సహజం విజయసాధనం వీరలక్షణం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 9177915286
Image
 కవనరహస్యాలు అందాలు నన్ను వెతుక్కుంటువస్తున్నాయో అందాలను నేను వెతికిపట్టుకుంటున్నానో అర్ధంకావటంలా పువ్వులు నను చేరుతున్నాయో పూలకడకు నేను వెళ్ళుచున్నానో అంతుబట్టటంలా చెలి నాహృదయం దోచుకుందో చెలిని నేను వశపరచుకున్నానో ఆలోచనకుచిక్కటంలా కవిత నను కవ్వించివ్రాయిస్తుందో కవితలను నేను కోరికూర్చుతున్నానో తెలియటంలా కవనాలు నేను చెవులారావినిపించినా వ్రాతలు పాఠకులు నోరారాపఠించినా వ్యత్యాసమున్నట్లా వాణీదేవి నను ఆదేశిస్తుందో వీణాధారిని నేను ఆహ్వానిస్తున్నానో తేలటంలా ఏది ఏమైనా సాహితీవనం వర్ధిల్లుతుందికదా పాఠకలోకం పరిఢవిల్లుతుందికదా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహిత్యసవ్వడులు చిన్నారుల ముద్దుపలుకులు ముచ్చట కొలుపుతాయి కోకిలల కమ్మనికూతలు కర్ణాలకింపు కలిగిస్తాయి చిలుకల చక్కెరపలుకులు చెవుల సంబరపరుస్తాయి గాంధర్వ గానాలు మదుల మురిపించుతాయి చెలియ గుసగుసలు హృదయాల పరవశపరుస్తాయి ప్రేమ పలకరింపులు మనసుల పులకరింపచేస్తాయి చినుకుల చిటపటలు చెప్పలేనిహాయి చేకూరుస్తాయి గాయకుల శ్రావ్యస్వరాలు శ్రోతల సంతసపరుస్తాయి పండితుల ప్రవచనాలు తత్వాలను తెలియపరుస్తాయి తుమ్మెదల ఝుంకారాలు పువ్వులను వణికిస్తాయి భక్తుల భజనలు భగవంతునందు భక్తినిపెంచుతాయి కవితల చప్పుడులు చిత్తాలను చెలరేగిస్తాయి సాహితీ సవ్వడులు సరస్వితీదేవిని స్మరింపజేస్తాయి వీణానాదానికి వినమ్రస్వాగతాలు వాణీదేవికి వందనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కోడళ్ళకధలు ఓ కాబోయేకోడలు షరతు విధించింది అత్తామామలతో కలసివుండాలంటే  పెళ్ళికి అంగీకరించనని ఓ రాబోయేకోడలు ముందుగా చెప్పింది వేరేకాపురం పెడితేనే భర్తదగ్గరకు వస్తానని ఓ ఉద్యోగంచేసేకోడలు నిర్మొహమాటంగాచెప్పింది అత్తపనిమనిషిలాగా అన్నిపనులుచేస్తేనే ఒప్పుకుంటానని లేకపోతే తరిమిపారేస్తానని ఓ గడుసరికోడలు ఒక కధనల్లింది మామ చేయిపట్టుకుంటున్నాడని ఇంటినుండి పంపించేయాలని ఓ సుప్పనాతికోడలు మొగుడుకు చెప్పింది మామకు అన్నంపెట్టనని తానేపెట్టుకొని తినాలని ఓ వగలమారికోడలు భర్తను బెదిరిస్తుంది అత్తామామలను వదులుకోవాలని లేకుంటే పుట్టింటికివెళ్తానని ఓ గడుగ్గాయికోడలు నోట కొక్కిరింతలుకూసింది నొసట ఈసడింపులుచూపింది మొహాన ఉమ్మేసినంతపనిజేసింది అత్తాకోడళ్ళూ కుక్కాపిల్లులా ఉప్పూనిప్పులా తూర్పూపడమరలా కోడళ్ళకు మొగుళ్ళుమాత్రమే కావాలా అత్తామామలు అక్కరలేదని గెంటివేయాలా కోడళ్ళకు మగనిభర్త ఆస్తులుకావాలా మామగారిని ఇంటినుంచి పంపించెయ్యాలా కోడళ్ళారా తెలుసుకోండి కొడుకులపెళ్ళాలు రేపు నిన్నూ బాధలుపెడతారు నీవునేర్పినవిద్యయె అత్తమ్మాయంటారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అందాల చిన్నది ఎంత చక్కని చూపులు చూడ ముచ్చటగున్నది ఎంత చక్కని రూపము కళ్ళు లాగుతుయున్నది ఎంత చక్కని వదనము వెలుగు చిమ్ముచుయున్నది ఎంత చక్కని బట్టలు బుట్ట బొమ్మగయున్నది ఎంత చక్కని కంఠము కోకిలమ్మగ యున్నది ఎంత చక్కని పలుకులు తేనె చిమ్ముతుయున్నది ఎంత చక్కని మాటలు మదిని ముట్టుతుయున్నది ఎంత చక్కని బుగ్గలు ఎరుపు రంగునయున్నవి ఎంత చక్కని వర్ణము పసిడి రంగునయున్నది ఎంత చక్కని చిన్నది తోడు కోరుచుయున్నది ఎంత చక్కని నడకలు హొయలు ఒలుకుచున్నది ఎంత చక్కని చిలిపిది చెయ్యి చాపుతుయున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మాటలముల్లెలు  మాటలు మీటుతున్నాయి తూటాలు పేల్చమంటున్నాయి మాటలు పైనపడుతున్నాయి మూటలు కట్టేయమంటున్నాయి మాటలు పిలుస్తున్నాయి ప్రేమలు ఒలకబోస్తున్నాయి మాటలు ప్రేమిస్తున్నాయి మోహము రేపుతున్నాయి మాటలు మురిపిస్తున్నాయి ముచ్చట్లు చెప్పమంటున్నాయి మాటలు ఊరుతున్నాయి పుటలు నింపమంటున్నాయి మాటలు పేర్చమంటున్నాయి కైతలు కూర్చమంటున్నాయి మాటలు వెంటబడుతున్నాయి పాటలు వ్రాయమంటున్నాయి మాటలు తీపిచుక్కలుచల్లుతున్నాయి మిఠాయీలు తయారుచేయమంటున్నాయి మాటలు మంత్రాలవుతున్నాయి మనసులు బంధించబడుతున్నాయి మాటలు మరుమల్లియలు సుమసుగంధాలు తేనెతియ్యదనాలు మాటలు మెరుపులు మంత్రాలు మిఠాయీలు మాటలు పువ్వులు నవ్వులు జల్లులు మాటలు పరువు తెరువు దరువు మాటలు క్రుక్కను క్రక్కను త్రొక్కను మాటలు జారను మీరను తప్పను మంచిమాటలు వీడకు మాయమాటలు నమ్మకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ వర్షమా! చూడు వర్షమా చెట్లు వాడిపోతున్నాయి పొలాలు బీడువారుతున్నాయి గొంతులు ఎండిపోతున్నాయి వర్షమా అలగకు మొహమును చాటేయకు వర్షమా కోపపడకు హర్షాన్ని దూరంచేయకు వర్షమా దాగుకొనకు ప్రార్ధనలను పెడచెవినపెట్టకు వర్షమా కదులు వాగులు పారించు వర్షమా కరుణించు కరువుకాటకాలు రానీయకు వర్షమా విన్నపాలువిను ప్రాణులను పరిరక్షించు వర్షమా ఆషాడమైనాపరవాలేదు శ్రావణమాసమువరకు వేచియుండకు వర్షమా కుండపోతగాకురువు కాలవలుపారించు జలాశయాలనింపు పిల్లలపై తల్లి అలగవచ్చా భక్తులపై దేవుడు కినుకవహించవచ్చా వర్షమా అర్ధంచేసుకో కవికోర్కెను అంగీకరించు వర్షం ప్రత్యక్షమయ్యింది జల్లులు ప్రారంభించింది వర్షం కవికోరిక తీరుస్తానన్నది సరస్వతీదేవిని సంతృప్తపరుస్తానన్నది వర్షానికి వందనాలు ప్రాణులకు శుభాకాంక్షలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పుత్తడిబొమ్మ సృష్టికర్త బ్రహ్మ చేశాడు బొమ్మ పోశాడు ప్రాణము పంపాడు భూలోకము బుగ్గల పాలుకార్చే బొమ్మ సిగ్గుల ఒలకబోసే బొమ్మ పెదాల తేనెలుచిందే బొమ్మ మోమున వెలుగులుచిమ్మే బొమ్మ అందరిని అలరించే బొమ్మ ఆనందాన్ని కలిగించే బొమ్మ వయ్యారాలు వీక్షించమనే బొమ్మ విచిత్రాలు వ్యక్తపరచే బొమ్మ పకపకలు కురిపించే బొమ్మ తళతళలు చూపించే బొమ్మ కులుకులు చిందేబొమ్మ పలుకులు చల్లే బొమ్మ ఆటలు ఆడే బొమ్మ పాటలు పాడే బొమ్మ చిత్తాలు దోచే బొమ్మ చిత్రాలు చూపే బొమ్మ అందాల అపరంజి బొమ్మ ఆనందాల అపర బ్రహ్మ ఆమె నేటిమొగ్గ రేపటి విరి నేటి సుమబాల రేపటి పుష్పకన్య ఆమె నేటి కవనబాల రేపటి కవితాకన్యక నేటి పసిపాప రేపటి ముగ్ధమోహిని ఆమె సృష్టికి మూలం ప్రేమకు బీజం అందాలకు ముద్దుగుమ్మ ఆనందాలకు పట్టుగొమ్మ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ మనసా! నువ్వు ఆడిందల్లా ఆటంటే ఎలా! పాడిందల్లా పాటంటే ఎలా! కోరిందల్లా కావాలంటే ఎలా! పట్టిందల్లా పసిడికావాలంటే ఎలా! చెప్పిందల్లా వినాలంటే ఎలా! చూచిందల్లా కొనాలంటే ఎలా! నడవకుండా గమ్యంచేరాలంటే ఎలా! ఒళ్ళువంచకుండా సంపాదించాలంటే ఎలా! ప్రతిరాత్రి పౌర్ణమికావాలంటే ఎలా! ప్రతిప్రయత్నం ఫలించాలంటే ఎలా! తెల్లనివన్నీ పాలనుకుంటే ఎలా! నల్లనివన్నీ నీళ్ళనుకుంటే ఎలా! రాసిందల్లా కవిత్వమంటే ఎలా! కూసిందల్లా కోకిలస్వరమంటే ఎలా! ఆకాశానికి నిచ్చెనవెయ్యాలంటే ఎలా! మేఘాలపై స్వారీచేయాలంటే ఎలా! భ్రమల్లో తేలాలంటే ఎలా! కలలతో కాలంగడపాలంటే ఎలా! లేచిందేతడవుగా పరుగులుతియ్యాలంటే ఎలా! తట్టిందేతడవుగా అమలుచెయ్యాలంటే ఎలా! ఓ మనసా! సావధానంగా ఆలోచించు సమయానుకూలంగా సంప్రదించు సక్రమంగా ముందుకునడిపించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగుపాట పాడనా! నేడు తెలుగుపాట పాడనా వెలుగుబాట చూపనా                               ||నేడు|| నాకు పాటలు రావు మాటలు రావు స్వరాలు రావు రాగాలు రావు అయినా శ్రోతలు అడిగారు పాటలు కోరారు గీతము వ్రాశాను ప్రాసలు కలిపాను                      ||నేడు||  కోకిలను తలుస్తాను కంఠమును ఎత్తుతాను పెదవులను తెరుస్తాను పెద్దగరాగము తీస్తాను తేటగ పలుకుతాను తేనెను చిందుతాను చక్కగ పాడుతాను చక్కెర చల్లుతాను                      ||నేడు|| తెలుగులొ పాడుతాను వెలుగులు చిమ్ముతాను అమృతము కురిపిస్తాను ఆనందము కలిగిస్తాను మనసులు దోస్తాను తలలలొ నిలుస్తాను హృదయము విప్పుతాను ప్రేమను కురిపిస్తాను                    ||నేడు|| గుండెలు కదిలిస్తాను గురుతులు మిగిలిస్తాను మమతను చాటుతాను మదులను మీటుతాను సొంతగ రాస్తాను వింతగ పాడుతాను కొత్తగ చెబుతాను ప్రీతిగ వినిపిస్తాను      ...