Posts

Showing posts from May, 2025
Image
 కవుల ఘనతలు కవులకూర్పులు చిత్రవిచిత్రాలు వైవిధ్యభరితాలు మనోరంజకాలు కవులరాతలు ఊహారూపాలు సుమసౌరభాలు తేనెజల్లులు  కవుల అల్లికలు పూలహారాలు ముత్యాలసరాలు బంగారునగలు కవులతలపులు నీటిప్రవాహాలు గాలితరంగాలు కడలికెరటాలు కవులభావనలు అపరూపాలు అద్వితీయాలు ఆణిముత్యాలు కవులచూపులు సుందరము సుమధురము సౌహార్ధము కవులకల్పనలు అద్భుతము అమోఘము ఆస్వాదనీయము కవులగానాలు కోకిలగళాలు కమ్మదనాలు కర్ణప్రియాలు కవులమదులు రత్నాలగనులు సముద్రజలనిధులు అపారనిక్షేపాలు కవులహృదయాలు అందాలతావులు ఆనందనిలయాలు అత్యున్నతశిఖరాలు కవులప్రేరణలు వాణీకటాక్షాలు సాహితీసమ్మోహితాలు సమాజశ్రేయస్సులు కవులకవితలు అమృతజల్లులు వెన్నెలవిహారాలు రంగులహరివిల్లులు కవివర్యులకు స్వాగతాలు వందనాలు శుభాకాంక్షలు అక్షరప్రేమికులకు ఆహ్వానము అభినందనలు ఆశిస్సులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ చెలీ! ( గజల్ తిస్ర గతి) సప్తవర్ణ ఇంద్రధనసు ఎక్కుదమా హాయిగాను చేయిచేయి కలుపుకోని ఆడుదమా హాయిగాను నీలిమబ్బు తేరుపైకి ఎగప్రాకి నిలుద్దామ   సోయగాల తేరపార చూచెదమా హాయిగాను చందమామ చల్లదనము చల్లగాను నింగిలోన వెన్నెలందు విహారంబు చేయుదమా హాయిగాను కోకిలవలె  గళమునెత్తి శ్రావ్యముగా పాడుదామ  గానంబై సంతసాల చిమ్ముదమా హాయిగాను వాహ్యాళిని చేసెదమా మింటినందు మధురంబుగ కులాసాగ సమయంబును గడిపెదమా హాయిగాను జతనుకట్టి జలసాలను జోరుగాను జరుపుదామ  సరసంబులు ఆడుకొనుచు సాగుదమా హాయిగాను పల్లకెక్కి పోవుదమా పరవశించి గగనమందు ఖుషీఖుషీ మాటలతో కులికెదమా హాయిగాను ఉల్లాసము గొలుపకోరి అందముగా సిద్ధంబయి ఆనందము అందరికీ పంచెదమా హాయిగాను ఒకరికొకరు పుట్టితిమని భావములో మలుగుదామ జీవితమును ఇద్దరమూ గడుపుదమా హాయిగాను  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 సమయోచితకవితలు  మెలుకువ వస్తుంది కల అంతమవుతుంది స్వప్నము గురుతుకొస్తుంది కవిత కూరుతుంది  పువ్వులు వాడిపోతాయి పరిమళాలు చల్లకుంటాయి మనసు నొచ్చుకుంటది  కైత పుట్టకొస్తది  నవ్వులు ఆగిపోతాయి మోములు ముడుచుకుంటాయి ఙ్ఞాపకాలు తడతాయి అనుభవాలు పుటలకెక్కుతాయి  మామిడిచెట్లు కాయకుంటాయి కోకిలలు కూయకుంటాయి గానాలు ఆగిపోతాయి కవనాలు కాగితాలపైకూర్చుంటాయి  మల్లెచెట్లు మొగ్గలెయ్యవు మదులు ముచ్చటపడవు మహిళలు వాపోతారు కవిత కూడుతుంది  వానలు మొదలవుతాయి వరదలు పారుతాయి జలాశయాలు నిండుతాయి కయిత తయారవుతుంది  వసంతం నిష్క్రమిస్తుంది గ్రీష్మము ముగిసిపోతుంది వర్షాలు మొదలవుతాయి కవితాజల్లులు కురుస్తాయి  దృశ్యాలు మారుతాయి ప్రకృతి కొత్తరూపందాల్చుతుంది అందాలు విభిన్నమవుతాయి ఆనందరాతలు ఆవిర్భవిస్తాయి  కాలచక్రం తిరుగుతుంది సమయము గడుస్తుంది జీవితము ముందుకుసాగుతుంది సమయోచితవ్రాత సృష్టించబడుతుంది  కవులు నిత్యమూస్పందిస్తారు కలాలు కదిలిస్తారు కాగితాలు నింపుతారు కవితలను కదంత్రొక్కిస్తారు   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నా ఒయ్యారిని (గజల్ తీస్రగతి) తేనెలాంటి పలుకులతో స్వాగతించ చూస్తున్నా తీపితీపి వంటలతో పులకరించ చూస్తున్నా మరుమల్లెల వాసనతో మభ్యపెట్ట తలపోస్తూ మత్తుచల్లి మైకంలో ముచ్చటించ చూస్తున్నా తేటతేట నవ్వులతో అలరించగ కోర్కొంటూ వదనంబును విరులలాగ వికాసించ చూస్తున్నా ప్రద్యుమ్నుని బాణములను వదలాలని కాంక్షిస్తూ గురినిచూచి గుండెలోకి దూరుపించ చూస్తున్నా పిచ్చిదాన్ని చేయాలని ప్రణాళికను పాటిస్తూ ప్రేమలోకి దించాలని పురాయించ చూస్తున్నా వలనువిసిరి చేపలాగ బంధించగ శ్రమపడుతూ స్వంతంబును చేసుకొనగ సాహసించ చూస్తున్నా చెంతచేరి చేయిపట్టి చనువుగుండ తలంచుతూ తనివితీర తృప్తిపరచి సంతసించ చూస్తున్నా మెడనువంచి తాళికట్టి సతిగపొంద ఆశిస్తూ ఇంటిలోకి ఇల్లాలుగ స్వీకరించ చూస్తున్నా వంటినిండ నగలుతొడిగి వగలాడిగ వీక్షిస్తూ అర్ధాంగిగ స్థానమిచ్చి ఆదరించ చూస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 ఓహో మేఘమాలా! ఆకాశము ఆక్రమిస్తావా అక్కడనీలివర్ణము అంటుతావా ఎండలు తగ్గిస్తావా చల్లదనము కలిగిస్తావా ఉరుములు వినిపిస్తావా పెళపెళా ప్రతిధ్వనించేలా మెరుపులు చూపిస్తావా మిలమిలా మెరిసిపోయేలా రంగులు బదలాయిస్తావా రూపాలు మార్చుకుంటావా ఆకాశంలో తేలుతావా అంతరంగంలో తిష్టవేస్తావా రవిని కప్పుతావా శశిని క్రమ్ముతావా భువికి దిగుతావా భూమిని త్రాకుతావా తనువులు తడుపుతావా తాపము తీరుస్తావా చిందులు త్రొక్కిస్తావా గబగబా ఉత్సాహంగా చినుకులు రాలుస్తావా చిటపటా చిత్రవిచిత్రంగా వరదలు పారిస్తావా గలగలా గంగలా జలాశయాలు నింపుతావా బిరబిరా జాగుచేయకుండా పొలాలు తడుపుతావా పుడమంతా పదునయ్యేలా చెట్లను చిగురింపజేస్తావా ధాత్రిని సస్యశ్యామలంచేస్తావా పంటలు పండిస్తావా ఇల్లంతా నిండేలా గొంతులు తడుపుతావా దాహార్తి తీరేదాకా కడుపులు నింపుతావా ఆకలి సమసేదాకా పువ్వులను పూయిస్తావా పండ్లను ఫలింపజేస్తావా మనసులను ముట్టుతావా మనుజులను మురిపిస్తావా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
మేధోమధనం తలను తడితే తట్టెడు తలపులు  తచ్ఛాడుతాయి మనసును మీటితే మధురభావాలు ముసురుకుంటాయి మదిని మధిస్తే మంచివిషయాలు మెండుగామొలకెత్తుతాయి  హృదిని ఉబికిస్తే ఉత్సాహము ఉప్పొంగుతుంది గుండెను గిల్లితే గాఢముగా  గుబులురేపుతుంది చిత్తాన్ని చిదిమితే చెలరేగి చిందులేయిస్తుంది అంతరంగాన్ని అదిరిస్తే ఆలోచనలను  ఆవిర్భవిస్తుంది ఉల్లాన్ని ఉసిగొలిపితే ఉవ్విళ్ళూరి ఊహలలోకంలోకి తీసుకెళుతుంది మతిని మందలిస్తే మూతిబిగించి మారాముచేస్తుంది మనమును మాడిస్తే మెదలకకదలక మొద్దుబారిపోతుంది మనస్సుకు ముక్కుతాడువేస్తే ముందుకెళ్ళక మట్టికఱిపిస్తుంది మేధోసేద్యము చేస్తే మేలయినపంటలు పండిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 అసూయపరుల అకృత్యాలు ఎదుటివారి ఎదుగుదల చూచి ఏడ్చేవారు కొందరు బాగుపడేవారి బ్రతుకులు కాంచి భరించలేనివారు కొందరు ప్రక్కవాళ్ళు పొందుతున్న పేరుప్రఖ్యాతలువిని తట్టుకోలేనివారు కొందరు కష్టపడేవాళ్ళు కాసులు కూర్చుకుంటుంటే కళ్ళల్లో నిప్పులుపోసుకునేవారు కొందరు సన్మానగ్రహీతలు సంబరపడుతుంటే వీక్షించి సహించలేనివారుకొందరు పచ్చని కుటుంబాలను పరికించి ప్రేమానురాగాల పెంపుదలచూచి కుళ్ళుకునేవారు కొందరు అందగాళ్ళను చూచి ఆనందాలను కని అసూయపడేవారు కొందరు నవ్వుతున్నవాళ్ళను చూచి మురిసిపోతున్న మోములకని ముఖాలుమాడ్చుకునేవారు కొందరు విలాసవంతుల వేడుకలను వీక్షించి ఓర్వలేనివారు కొందరు ఆటుపోట్లకు తట్టుకొని అభివృద్ధిచెందుతున్నవారిని చూచి అలమటించేవారు కొందరు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవిగారిలోకాలు తెలుగులోకం పిలుస్తుంది తేనెచుక్కలు చల్లమంటుంది ఊహాలోకం ఊరిస్తుంది భావాలను బయటపెట్టమంటుంది ప్రేమలోకం ప్రలోభపెడుతుంది ప్రణయగీతాలు పుటలకెక్కించమంటుంది మహిళాలోకం అండనివ్వమంటుంది వివక్షతలకు వ్యతిరేకంగా కలాన్ని కదిలించమంటుంది బాలలలోకం బ్రతిమలాడుతుంది చిత్రవిచిత్రాలను చూపమంటుంది కలలలోకం కవ్విస్తుంది కమ్మనికైతలు కూర్చమంటుంది వెన్నెలలోకం రమ్మంటుంది విరహగీతాలు విరచించమంటుంది పాఠకలోకం ప్రోత్సహిస్తుంది మదులను దోచుకోమంటుంది కవనలోకం ఆహ్వానిస్తుంది కలకాలము నిలిచిపొమ్మంటుంది సాహిత్యలోకం స్వాగతిస్తుంది సత్కవితలను సృష్టించమంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం  
 కవుల ధోరణలు అందాలు చూపించి ఆశలు రేకెత్తించి ఆనందపరచేవారు కొందరు తేనెపలుకులు చల్లి తియ్యదనాలు అందించి తృప్తిపరచేవారు కొందరు అక్షరకుసుమాల కూర్చి పదహారాలను అల్లి అంతరంగాలనుతట్టేవారు కొందరు ఆటలు ఆడించి పాటలు పాడించి పరవశపరచేవారు కొందరు కట్టుకథలు చెప్పి ఊహలలోకానికి తీసుకెళ్ళి ఉర్రూతలూగించేవారు కొందరు పరులహితము కోరి ప్రబోధగీతాలు వ్రాసి ప్రవచనాలుచెప్పేవారు కొందరు ప్రేమానురాగాలు పెంచి ప్రణయగీతికలు పంపి పులకరింపజేసేవారు కొందరు వెన్నెల వెదజల్లి పూదోటలలో విహరింపజేసి వేడుకపరచేవారు కొందరు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవితలకబుర్లు  కవితలను వ్రాద్దామనుకుంటే ప్రోత్సహించేవారు కరువయ్యారు కవితలను చదువుదామంటే వినేవారు లేకున్నారు కవితలను ఇద్దామనుకుంటే తీసుకునేవారు దుర్లభమయ్యారు కవితలను విసురుదామంటే పట్టుకునేవారు రావటంలేదు కవితలను వడ్డిద్దామనుకుంటే తినేవారు చిక్కకున్నారు కవితలను కురిపిద్దామనుకుంటే తడిచేవారు ఎవరూలేరు కవితలను అందిద్దామనుకుంటే దప్పికతీర్చుకోవటానికి ఎవరూరాకున్నారు కవితలను పంపుదామనుకుంటే ప్రచురించటానికి పత్రిలవారుతయారుగాలేరు కవితలను ప్రచురిద్దామనుకుంటే పుస్తకాలనుకొనటానికి వినియోగదారులులేరు కవితలను బ్రతికిద్దామనుకుంటే బాధ్యతతీసుకునేవారు చిక్కకున్నారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
ఓ రమణీమణి! (గజల్ - తీస్రగతి) ముఖవెలుగులు ఎవరిచ్చిరి రమ్యమైన రమణీమణి చూపునిలిపి చూచుచుంటి చిత్రమైన రమణీమణి మేనుసోకు బాగుండెలె అబ్బురాల రమణీమణి కనుదోయిని కట్టివేసె చిత్రమైన రమణీమణి చిరునవ్వులు అద్భుతమే సుందరాల రమణీమణి మనసునిండ ముట్టినవే మధురమైన రమణీమణి నల్లగున్న కేశంబులు నచ్చాయే రమణీమణి తెల్లకనులు పిలిచెనులే కమ్మనైన రమణీమణి ఎరుపుఛాయ శరీరంబు  అదిరెనులే రమణీమణి ప్రేమలోన దించుచుండె దివ్యమైన రమణీమణి బులుగుచీర కుదిరెనులే మంచిగాను రమణీమణి చెంతచేర పిలుచుచుండె శ్రావ్యమైన రమణీమణి తెల్లపళ్ళు  చూడమంటు రమ్మనలే రమణీమణి మెడనదండ మెరిసెనులే  ముచ్చటైన రమణీమణి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నేటి నాహృదయారాటం  అందాలున్నాయి  ఆనందపరచటంలా  తియ్యదనాలున్నాయి  నోటికిచేరటంలా  సౌరభాలున్నాయి  నాసికనుచేరటంలా  తేనేపదాలున్నాయి  చెవులకందటంలా  సమయమున్నది విషయంతోచటంలా  సందర్భమున్నది  వెలువడటంలా  ప్రేమయున్నది  పంచుకోలేకపోతున్నా  భ్రమయున్నది  బయటపడలేకపోతున్నా  ఆకాశమున్నది  అండటంలా  మబ్బులున్నాయి  వర్షించటంలా  మదియున్నది  ముచ్చటపడటంలా  హృదియున్నది  పొంగిపొరలటంలా  పువ్వులున్నాయి  ప్రోత్సాహపరచటంలా  వన్నెలున్నాయి  ఆకర్షించటంలా  ఆశలున్నాయి  తీరటంలా  ఆలోచనలున్నాయి  అక్షరాలుకావటంలా  కలమున్నది  కదలటంలా  కాగితమున్నది  నిండటంలా  వ్రాయాలనియున్నది  రాతలుగామారటంలా  భావాలున్నాయి  బహిర్గతముకావటంలా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 పితృదేవోభవ నాన్నకు సదాసేవలుచేస్తుంటా కన్నఋణమును తీర్చుకుంటా తండ్రికి పూజలుకావిస్తుంటా దేవుడికి సమానంగాచూస్తుంటా అయ్యకు దండాలుపెడతా గౌరవంగా చూచుకుంటా అబ్బకు కోరినవన్నీసమకూరుస్తా అధికసంతసాన్ని కలిగిస్తుంటా జనకుని కాళ్ళుకడుగుతా తలపై నీళ్ళుచల్లుకుంటా పితృభక్తిని చాటుకుంటా కంటికిరెప్పలా కాచుకుంటా నాయనకు దండనువేస్తా కర్పూరహారతిని ఇస్తా బాపు చెప్పినట్లువింటా ఎదురు మాట్లాడకుంటా బాబుసలహాలు తీసుకుంటా హితోక్తులుగా భావిస్తుంటా పితరునిపై మిక్కిలిశ్రద్ధచూపుతా ఏలోటులేకుండా చూచుకుంటా పితృదేవుని మరవకుంటా గుండెలో దాచుకుంటా జనదుని నిత్యంతలచుకుంటా నామస్మరణం ప్రతిదినంచేస్తుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 ఆద్యంతం అద్భుతంగా జరిగిన  కాలిఫోర్నియా వీక్షణం 153 వ అంతర్జాల సాహితీ సమావేశం మరియు కవిసమ్మేళనం  ********************************************* నిన్న 17-05-2025 వ తేదీ మే నెల కాలిఫోర్నియా వీక్షణం 153 వ అంతర్జాల సాహితీ సమావేశం మరియు కవిసమ్మేళనం  అద్భుతంగా జరిగింది.        ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారి స్వాగతవచనాలతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథి శ్రీ నారాయణస్వామి గారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయచేశారు. శ్రీ నారాయణస్వామి గారు సిద్దిపేటలో జన్మించారు. వారు గొప్ప కవి,రచయిత,అనువాదకుడు. గత 27 సంవత్సరాలుగా అమెరికాలో పని చేస్తున్నారు. 14ఏళ్లు విరసం సభ్యులు కూడా కొనసాగారు. ప్రాణహిత పత్రికలో వారి కవితలు ధారావాహికగా వచ్చాయి.       శ్రీ నారాయణస్వామి వెంకటయోగి గారు 'లాటిన్ అమెరికన్ కవిత్వం' అనే అంశంపై గంటకు పైగా అనర్గళంగా ప్రసంగించారు.లాటిన్ అమెరికాలో ఏయే దేశాలు ఉన్నాయో,ఆ దేశ మూలవాసుల భాషలను పెత్తందారులు ఎలాగ అణగ త్రోక్కారో నుండి ప్రారంభించి, నేరుడా, మార్కోస్  (నోబెల్ బహుమతి గ్రహీత ) డెల్మార్...
 మానవా!  పూలబాట పట్టెదవో మానవుడా నీ ఇష్టం ముళ్ళదారి నడిచెదవో మర్త్యుడా నీ ఇష్టం మంచిపనులు చేసెదవో చైతన్యా నీ తలంపు చెడుచేష్టలు సలుపెదవో  మానజుడా నీ ఇష్టం తినటానికి బ్రతికెదవో కుండీరా నీ కోర్కె బ్రతకాలని భుజింతువో పురజనుడా నీ ఇష్టం సౌఖ్యాలను కోరెదవో నిదద్రువా  నీ అభిరుచి కష్టాలను పడుతావో జనపదుడా నీ ఇష్టం విజయాలను గడింతువో దేహవంత నీ ఎంపిక ఓటములను పొందెదవో పుమాంసుడా నీ ఇష్టం సంపాదన గడింతువో పారగతా నీ అభిమతి బిక్షాటనకు దిగిదెవో పూరుషుడా నీ ఇష్టం లక్ష్యాలను చేరెదవో పురవాసీ నీ సర్గము ఆశయాలు వదిలెదవో మనుష్యుడా నీ ఇష్టం   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవనవిహారం కవనమేఘాలు లేస్తున్నాయి తేలుతున్నాయి తిరుగుతున్నాయి కవితాజల్లులు కురుస్తున్నాయి తడుపుతున్నాయి సంతసపరుస్తున్నాయి ఆలోచనలు ఊరుతున్నాయి ఉరుకుతున్నాయి ఉత్సాహపరుస్తున్నాయి అక్షరాలు చుట్టుకుంటున్నాయి ముట్టుకుంటున్నాయి పట్టుకుంటున్నాయి పదాలు పారుతున్నాయి పొసగుతున్నాయి భావాలనువ్యక్తపరుస్తున్నాయి కలాలు కదులుతున్నాయి గీస్తున్నాయి కూర్చుతున్నాయి కాగితాలు నల్లబడుతున్నాయి నిండుతున్నాయి నిక్షిప్తమవుతున్నాయి కవితలు కూడుతున్నాయి కవ్విస్తున్నాయి కుతూహలపరుస్తున్నాయి కవనలోకం ప్రకాశిస్తుంది పరికించమంటుంది పరవశపరుస్తుంది సాహితీజగం స్వాగతిస్తుంది సంబరపరుస్తుంది సన్మానిస్తుంది పాఠకలోకం పఠిస్తుంది పరవశిస్తుంది ప్రతిస్పందిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ప్రియుని కోరిక (గజల్ - తీస్ర గతి) చెలితలపులు తలనుతట్ట చెంతచేర కోర్కెకలిగె గుండెలోన గుబులుపుట్ట ఇల్లుచేర కోర్కెకలిగె చెలిపలుకులు గుర్తుకొచ్చి తియ్యదనము రుచినిచూప చిరునవ్వులు కనమనసయి బయలుదేర కోర్కెకలిగె చెలిచేష్టలు మదినిముట్ట సంతసంబు సంగ్రహించ మూటముల్లె సద్దుకోని ఊరుచేర కోర్కెకలిగె చెలిరూపము భ్రమకొలపగ తక్షణమే చూడాలని హృదిమురియ హుటాహుటిన సఖినిచేర కోర్కెకలిగె చెలిసరసం  ఙ్ఞప్తికొచ్చి శీఘ్రంగా పయనమవ్వ బండినెక్కి దూసకెళ్ళి చెలినిచేర కోర్కెకలిగె చెలిసొగసులు గురుతురాగ ఊహలలో ఊగించగ అనుభవించ ఆత్రుతతో సఖినిచేర కోర్కెకలిగె చెలిమోమును తలచుకొనగ ఎగిరిపోయి వీక్షిస్తూ  సమయాన్ని గడపాలని సకియచేర మనసుకలిగె గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఓ సఖీ! (గజల్ - ఖండ గతి) కాంతినై వదనమును చేరనా ఓసఖీ నవ్వునై చెంపలా వెలగనా ఓసఖీ చూపునై కాంచనా రూపాన్ని ప్రేయసీ అందమై దేహాన్ని అంటనా ఓసఖీ పలుకునై తట్టనా పెదవులా సకియా తేనెనై చుక్కలా చిందనా ఓసఖీ గానమై దూరనా గొంతులో నేస్తమా శ్రావ్యమై చెవ్వులా తట్టనా ఓసఖీ తోడునై ఉండనా అండగా ప్రణయనీ జంటనై ప్రక్కనా నిలవనా ఓసఖీ సుమమునై కూర్చోనా కొప్పులో నెచ్చెలీ పరమళమై చుట్టునూ వీచనా ఓసఖీ జాబిలై లేపనా విరహాన్ని ప్రేమికా వెన్నెలై విహరింప జేయనా ఓసఖీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 నాకిష్టం (గజల్-తీస్రగతి) పూలదండ సిగదాల్చిన సుందరియే నాకిష్టం ముసిముసిగా నవ్వుతున్న నెలతుకయే నాకిష్టం సుగంధాలు చల్లుతున్న సొగసుగత్తె నాకందం చిరునవ్వులు ఒలుకుతున్న సునయనయే నాకిష్టం మల్లెపూలు కొప్పునున్న మానినంటె నాకుప్రియం మెరుపులాగ మెరుయుచున్న కన్యకయే నాకిష్టం గులాబీలు తురుముకున్న గుబ్బలాడి  నాభాగ్యం గుండెలోన గుబులులేపు గుబ్బెతయే నాకిష్టం మందారం జడనయున్న మచ్చెకంటి నానెయ్యం తియ్యగాను పలుకుతున్న తోయలియే నాకిష్టం చేమంతులు కురులనున్న సుభాషిణే నాకుశుభం వలపువలను విసురుతున్న వధూటియే నాకిష్టం సన్నజాజి పూలనల్లి సిగదోపిన ప్రసాదం సరసంబుల సయ్యాటల సువదనయే నాకిష్టం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   
 కవీశ్వరా! గొంతులు ఎండితే కవితామృతముత్రాగించి తృప్తిపరచు కవీశ్వరా! పెదవులు వదరుతుంటే తేనెపలుకులందించి చిందించు కవీశ్వరా! అవయవాలు అశుద్ధమైతే అక్షరజల్లులుచల్లి శుభ్రపరచు కవీశ్వరా! చెమటలు కారుతుంటే కవనగాలులువీచి అలసటతీర్చు కవీశ్వరా! కటికచీకట్లు ఆవరిస్తే కవనజ్యోతులువెలిగించి ధైర్యమివ్వు కవీశ్వరా! మదులు మొద్దుబారితే కవనభావాలుకుమ్మరించి చైతన్యపరచు కవీశ్వరా! కళ్ళు కమ్మనిదృశ్యాలు కాంక్షిస్తుంటే కవనసౌందర్యాలుకనపరచి కుతూహలపరచు కవీశ్వరా! నోర్లు చప్పబడితే కైతారుచులువడ్డించి తినిపించు కవీశ్వరా!  వీనులు శ్రావ్యతనుకోరుతుంటే కవితాగానమువినిపించి హాయిగొలుపు కవీశ్వరా! నాసికలు  మూసుకుంటుంటే కవనసౌరభాలువెదజల్లి ఆనందపరచు కవీశ్వరా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 మట్టిమహత్యం దేశమంటే మట్టిరా మనుజులుండే తావురా మట్టిపైపడితే జననంరా మట్టిలోకలిస్తే మరణంరా మట్టి మనతల్లిరా మట్టి మనదేశంరా మట్టి మనసస్యశ్యామలంరా మట్టి మనపోషణద్రవ్యంరా మట్టి మనల్ని మోస్తుందిరా మట్టి మనల్ని అడుగులేయిస్తుందిరా మట్టి మన ఆస్తిరా మట్టి మన ఇల్లురా మట్టంటే మురికికాదురా మట్టంటే బురదకాదురా మట్టి సుజలంరా మట్టి సుఫలంరా మట్టి మొక్కలపెంచురా మట్టి పచ్చదనమిచ్చురా మట్టి ఖనిజాలగనిరా మట్టి రత్నాలగర్భరా మట్టి మన ఆరంభంరా మట్టి మన అంతంరా మట్టి భూదేవిరా మట్టి మహతిరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 అమ్మంటే అమ్మంటే దేవతరా ఆరాధించరా సేవలుచేయరా అమ్మంటే అన్నపూర్ణరా ఆకలితీర్చురా బాగోగులుచూచురా అమ్మంటే లక్ష్మీదేవిరా అడుగుపెట్టురా ఐశ్వర్యంతెచ్చురా అమ్మంటే ఆప్యాయతరా ప్రేమనుపంచురా పరవశపరచురా అమ్మంటే త్యాగమూర్తిరా అయినవారికొరకుపాటుపడరా అలసటలేకశ్రమించునరా అమ్మంటే వెలుగురా కాంతులుచిమ్మురా కుటుంబాన్నివృద్ధిచేయురా అమ్మంటే అనుబంధమురా ఏకతాటిపైనడిపించురా ఆశయాలనుసాధింపచేయురా అమ్మంటే కుటుంబహేతువురా గౌరవప్రతీకరా గృహానికివెన్నుపూసరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నా బాటలు - నా మాటలు అందాలప్రదేశాలను చూద్దామని ఆనందాలబాటను పడుతున్నా ఉన్నతశిఖరాలను చేరాలని కొండదారిని ఎక్కుతున్నా ఆకాశపు అంచులను తాకాలని మబ్బులమార్గమును ఆశ్రయిస్తున్నా సుఖమైన జీవితాన్ని అందుకోవాలని పూలపథమున పయనిస్తున్నా లోతైన విషయాలను వెల్లడించాలని భావకైతలతెరువును ప్రయత్నిస్తున్నా ప్రణయలోకమందు విహరించాలని ప్రేమత్రోవన ప్రయాణంచేస్తున్నా ఊహలపల్లకిని ఎక్కాలని కల్పనానిగమమున పర్యటిస్తున్నా కాసులమూటలను కట్టుకోవాలని బంగారుగతిన సాగుతున్నా అంతరంగమును అలరించాలని సుగంధాలనడవన నడుస్తున్నా పుణ్యపురుషుడిని కావాలని భక్తి తొవ్వన కాలుమోపుతున్నా కవితాపంటలను పండించాలని కవనసేద్యదోవన కదులుతున్నా తేనెపలుకులను చల్లాలని తేటతెలుగుజాడను ఎంచుకున్నా ప్రియమైన పాఠకులను పరవశపరచాలని సాహితీసరణిని చేబడుతున్నా సరస్వతీమాతను సంతసపరచాలని అక్షరాలరస్తాన అడుగులేస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ఉగ్రవాదుల ప్రోత్సాహక దేశమా! పాము తోకతొక్కితే బుసలు కొట్టదా పడగ విప్పదా కాటు వెయ్యదా! పిల్లిని గదిలోబంధిస్తే గాండ్రించదా పులికాదా పైనబడదా! మగవాడిననివిర్రవీగితే మీసం మెలవేస్తే కోపంతన్నుకరాదా కయ్యానికిదిగరా! మెత్తగావుంటే మెత్తుతుంటే తిరగబడరా తగాదాకుదిగరా! దెబ్బతగిలితే మౌనంగావుంటారా కర్రపట్టరా కసితీర్చుకోరా! ఒకమాటంటే ఊరుకుంటారా నోరుతెరవరా రెండుమాటలనరా! నిందలేస్తే గమ్ముగుంటారా గొంతెత్తరా ఘాటుగాస్పందించరా! కయ్యానికి కాలుదువ్వితే పోరాటానికిదిగరా తగినబుద్ధిచెప్పరా! అమాయకులను సంహరిస్తే సహిస్తారా సంయమనంకోలుపోరా సరైనసమాధానమివ్వరా! ఉగ్రవాదుల ప్రోత్సాహకదేశమా ప్రగల్భాలు వీడు కారుకూతలు మాను క్షమాపణలు చెప్పు మర్యాదగా లొంగిపో! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 నేను - నా విషయాన్వేషణ  చెప్పని విషయంకోసం గాలిస్తున్నా చూడని విషయంకోసం పరికిస్తున్నా వ్రాయని విషయంకోసం ఆలోచిస్తున్నా విన్నూతన విషయంకోసం వీక్షిస్తున్నా అందమైన విషయంకోసం ఆత్రపడుతున్నా ఆనందమైన విషయంకోసం అర్రులుచాస్తున్నా అద్భుతమైన విషయంకోసం ఆరాటపడుతున్నా అమోఘమైన విషయంకోసం అలమటిస్తున్నా మంచి విషయంకోసం ముచ్చటపడుతున్నా మధుర విషయంకోసం ఎదురుచూస్తున్నా కమ్మని విషయంకోసం కష్టపడుతున్నా చక్కని విషయంకోసం శ్రమిస్తున్నా రసాత్మక విషయంకోసం రగిలిపోతున్నా వ్యూహాత్మక విషయంకోసం వేచిచూస్తున్నా పసందైన విషయంకోసం పారజూస్తున్నా ప్రియమైన విషయంకోసం పాటుపడుతున్నా మదులనుముట్టే విషయంకోసం మదిస్తున్నా తలలనుతట్టే విషయంకోసం తపిస్తున్నా శుద్ధమైన విషయంకోసం నిరీక్షిస్తున్నా చిత్రమైన విషయంకోసం ప్రతీక్షిస్తున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 నేతలారా!  ప్రజలంటే అమాయకులు కాదోయ్ చెప్పినవన్నీ నమ్మటానికి చెప్పినట్లు తలలూపటానికి ప్రజలంటే గొర్రెలు కాదోయ్ ఒకేదారిన నడవటానికి గుడ్డిగా ప్రవర్తించటానికి ప్రజలంటే అవినీతిపరులు కాదోయ్ డబ్బులు తీసుకోవటానికి ఓట్లు అమ్ముకోవటానికి ప్రజలంటే పశువులు కాదోయ్ గాటిన కట్టేయటానికి పనులు పురమాయించటానికి ప్రజలంటే పోకిరీలు కాదోయ్ గొడవలు చేయటానికి గోతుల్లో తోయటానికి ప్రజలంటే గాడిదలు కాదోయ్ దెబ్బలు తినటానికి బరువులు మోయటానికి ప్రజలంటే కుక్కలు కాదోయ్ కాపలా కాయటానికి గట్టిగా మొరగటానికి ప్రజలంటే తాగుబోతులు కాదోయ్ మధ్యానికి బానిసలుకావటానికి సారానిచ్చినవారిని గెలిపించటానికి ప్రజలంటే తిండిబోతులు కాదోయ్ బిర్యానిపొట్లాలకు లొంగటానికి బటన్లను నొక్కటానికి ప్రజలంటే మేధావులోయ్ ఆలోచించటానికి నిర్ణయాలుతీసుకోవటానికి ప్రజలంటే చైతన్యపరులోయ్ నిజాలనుచూడటానికి న్యాయంగామెలగటానికి ప్రజలంటే సంఘజీవులోయ్ కలసిబ్రతకటానికి పరస్పరంసహాయంచేసుకోవటానికి ప్రజలంటే ఓటరుమహాశయులోయ్ అభిమతంతెలియజేయటానికి అభివృద్ధికాముకులనెన్నుకోవటానికి ప్రజలంటే ప్రజాసామ్యవాదులోయ్ ప్రజలకొరకు ప్రజలచేత ప్రజలేపాలించే ప్రభుత్వాన్నికోరేవారోయ్ గుండ్లపల్లి రా...
Image
    నేను సైతము నేను సైతము సమాజ శ్రేయస్సుకు చెమటచుక్కలు రాల్చాను శ్రమించాను శ్రద్ధచూపాను నేను సైతము సాహితీ సేవకు సమ్మేళనాలు నిర్వహించాను శాలువాలుకప్పాను సత్కారాలుచేశాను నేను సైతము కష్టపడి అక్షారాలు అల్లాను పదాలుపేర్చాను విషయాలువెల్లడించాను ఏను సైతము సరస్వతీ పుత్రునిగా సుకవితలు వ్రాశాను సూక్తులుచెప్పాను చిత్తాలుదోచాను నేను సైతము తలనందు తలపులు పారించాను తహతహలాడించాను తృప్తినిపంచిపెట్టాను నేను సైతము అనాధలకు అండగా నిలిచాను ఆర్ధికసాయమందించాను ఆదుకున్నాను నేను సైతము అన్యాయాక్రమాలను అడ్డుకున్నాను అణచివేశాను అదుపుచేశాను నేను సైతము అందరి ఆహ్లాదానికి అందాలు చూపాను ఆనందంకలిగించాను అంతరంగాలుమీటాను నేను సైతము పర్యావరణశుద్ధికై మొక్కలు నాటాను తోటలుపెంచాను పువ్వులుపూయించాను నేను సైతము పాఠకులయొక్క మదులుతట్టాను హృదులుముట్టాను మనసుల్లోనిలిచాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 పహల్గాం దాడిని తలచుకుంటే...... కోపం కట్టలుతెంచుకుంటుంది రోషం మొలుచుకొనివస్తుంది ఆయుధం చేపట్టాలనిపిస్తుంది దండనం విధించాలనిపిస్తుంది పౌరుషం పొడుచుకొస్తుంది ఉక్రోషం తన్నుకొస్తుంది ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది అమానుషత్వం అంతంచేయాలనిపిస్తుంది రక్తం ఉడుకుతుంది దేహం కంపిస్తుంది  ఉగ్రవాదం అణచివేయాలనిపిస్తుంది జాతిగౌరవం నిలుపుకోవాలనిపిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 నా స్వేచ్ఛాజీవితం శరీరానికి లోపాలులేనివాడిని అవయవాలను పూర్తిగా ఉపయోగించుకుంటా చేతికి బేడీలులేనివాడిని చేయాలనుకున్నది చేస్తా సక్రమంగా నడచుకుంటా  కళ్ళకి గంతలులేనివాడిని నిజాలను చూస్తా నిర్భయంగా మసలుకుంటా నోటికి తాళాలులేనివాడిని చెప్పాలనుకున్నది చెబుతా తేనెచుక్కలు చల్లుతా చెవులను మూసుకునేవాడినికాను పిలిస్తే పలుకుతా కోరితే సహకరిస్తా కాళ్ళకు బంధాలులేనివాడిని కావలసినచోటుకు వెళ్తా కార్యాలు కరాఖండీగాచేస్తా ఆలోచనలపై అవరోధాలుపెట్టనివాడిని లోతులలోకి వెళ్తా ఉన్నతభావాలు వెలువరిస్తా మనసుపై ఆంక్షలులేనివాడిని ఊహలను ఊరిస్తా మేధోమదనం చేస్తా కాలంపై కాపలాలేనివాడిని కోరినట్లు వాడుకుంటా గమ్యాలను చేరుకుంటా స్వేఛ్ఛ నా ఆయుధం సేవ నా ధ్యేయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 విరుల విన్యాసాలు కుసుమాలు విచ్చుకున్నాయి తేనెటీగలకు సందడే సందడి పరిమళాలు వీస్తున్నాయి ఆఘ్రానితులకు పండుగే పండుగ పుష్పాలు పొంకాలుచూపుతున్నాయి పరికించేవారిది అదృష్టమే అదృష్టం ఆస్వాదించేవారిని అబ్బురపరుస్తున్నాయి అంతరంగాలకి ఆనందమే ఆనందం సుమాలు రంగులువిసురుతున్నాయి కళ్ళకిస్తున్నాయి కుతూహలం కమ్మదనం  కాంచేవారిని కట్టేస్తున్నాయి చేకూరుస్తున్నాయి చోద్యం సంభ్రమం పీలుపులు పిలుస్తున్నాయి బాటసారులకు సంతసమే సంతసం చెంతనే నిలువమంటున్నాయి చేస్తున్నాయి సరదాలు సంబరాలు అలరులు ఊగుతున్నాయి ఆగకుండా తూలుతూ త్రుళ్ళుతూ దోస్తున్నాయి చిత్తాలు ఊపుతున్నాయి ఉయ్యలజంపాలలు ప్రసూనాలు తెంచుకోమంటున్నాయి తురమమంటున్నాయి తరుణుల కొప్పుల్లో దండలు అల్లమంటున్నాయి వెయ్యమంటున్నాయి దేవతల మెడల్లో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 పాఠకా! కబుర్లు చెప్పనా ఖుషీ పరచనా కలం పట్టనా కాగితం నింపనా అక్షరాలు అల్లనా పదాలు పేర్చనా పువ్వులు విసరనా నవ్వులు చిందనా వెలుగులు చిమ్మనా చీకట్లు తరుమనా ఆటలు ఆడనా పాటలు పాడనా చెంతకు రానా చేతులు కలపనా తేనెను చల్లనా తీపిని అందించనా విందును ఇవ్వనా చిందులు త్రొక్కించనా భావాలు బయటపెట్టనా భ్రమలు కలిగించనా సొగసు చూపనా మనసు తట్టనా సూక్తులు చెప్పనా హితాలు చేయించనా గుండ్లపల్లి రాజేందప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆద్యంతం అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక కార్మిక దినొత్సవం **********************************************   నిన్న 01-05-2025వ తేదీ గురువారం కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నిర్వహించిన కార్మిక దినోత్సవం, కవిసమ్మేళనం మరియు రాధా కుసుమగారికి బిరుదు ప్రదానం ఆద్యంతం   అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిధి మరియు మాజీ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ త్రిమూర్తుల గౌరీశంకర్ అమెరికాలో ముందు ప్ర్రారంభమయిన మేడే ఉద్యమాల గురంచి చక్కగా వివరించారు. విశిష్ట అతిధి శ్రీ నాళేశ్వరం శంకరం మేడే పుట్టుపూర్వోత్తర విషయాలను చాలా చక్కగా వివరించారు. మాజీ పోలీసు అధికారి పెద్దూరి వెంకట దాస్ కార్మిక దినోత్సవ విషయాలను అనుభూతులను తెలియజేశారు. మేడే కార్యక్రమానికి శ్రీ తులసీ వెంకట రమణాచార్య మొదట స్వాగత వచనాలను పలికి అతిధులను వేదిక మీదకు స్వాగతించారు.  సభాధ్యక్షులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ అతిధులను మరియు కవులను స్వాగతించి, కార్మిక దినోత్సవ విశేషాలను వివరించి కార్మికులకు, కర్షకులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీపోలీసు అధికారి శ్రీ వెంకట దాస్ గారు మేడే ఆవిర్భావం గురించి మన భారతద...