Posts

Showing posts from November, 2025
Image
 🌅 సూర్యోదయం 🌅 చీకటిని చీల్చుకుంటూ చిరునవ్వుతో పైకి లేచే సూర్యుడు — నిద్ర మత్తును తొలగించి జగతిని జాగృతంచేస్తాడు. మేఘాల ముసుగులు తొలగి, ఆకాశం తామరపూవై తేలిపోతుంది, కాంతి చారలు వెదజల్లుతూ దిక్కులన్నీ మెరిసిపోయాయి. గాలులు మృదువుగా ఊదుతాయి, పక్షులు గీతాల్ని ఆలపిస్తాయి, పూలు తలలు ఊపుతాయి, ప్రకృతిని పులకరింపజేస్తాయి. నదులపై కిరణాలు నాట్యం చేస్తాయి, పొలాలపై బంగారు తెర పరుచుకుంటుంది, తల్లి భూమి చిరునవ్వుతో పిల్లలను మేల్కొలుపుతుంది. సముద్ర ఉపరితలంపై మొదటి కిరణం పడగానే — వేల సంవత్సరాల చరిత్రలాగే నిత్యజీవితం మళ్లీ మొదలవుతుంది. సూర్యోదయం — ఆశకు ప్రతీక, ఆరంభానికి సంకేతం, అంతరంగాలకు నూతనగీతం! ప్రతి ఉదయం చెబుతుంది — "లేచి రా! జీవితం ఎదురుచూస్తుంది" ఆ కిరణాల పిలుపులో ప్రేరణ, ప్రాణం, పరవశం కలిసిపోతాయి!  ✍ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ✍ 
 ఉత్ప్రేక్షలు ఆకాశం అంచులకు ఎత్తుతా - నక్షత్రాలు పెక్కుటిని ఏరిస్తా, పాతాళం లోతుల్లోకి దించుతా - నవరత్నాలు సేకరించి తెమ్మంటా. పలుకుల్లో తేనెను చిందిస్తా - అధరాల్లో సుధను పారిస్తా, మల్లెపూలు తలపై చల్లుతా - మత్తులోకి మనసుని నెట్టుతా. నవ్వులు గాలిలో విసురుతా - పువ్వులు బోలెడు పూయిస్తా, బొట్టులో చంద్రుని చూపుతా - ముక్కుతో కోటేరుని కనమంటా. కళ్ళతో సైగచేసి స్వాగతిస్తా - కరాలతో మృదువుగా స్పృశిస్తా, హంసను నడకతో తలపిస్తా - కోకిలను గానముతో గుర్తుకుతెస్తా. బుగ్గల్లో సిగ్గులు వెలువరిస్తా - మోములో కాంతులు విరజిమ్ముతా, చీరలో సింగారం చూపిస్తా - మేనులో శృంగారం ఒలికిస్తా. గాజులు గణగణమోగిస్తా - గుండెలు ఝల్లుమనిపిస్తా, గజ్జెలు ఘల్లుమనిపిస్తా - మనసులు పులకరింపచేస్తా. కలంతో వెలుగులు ప్రసరిస్తా - పుటలపై ముత్యాలు పేర్చుతా, ఉత్ప్రేక్షలతో హృదుల అలరిస్తా - ఉపమానాలతో మదుల మురిపిస్తా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆసాంతం అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక  అంతర్జాల సమావేశం ********************************************* నిన్న సాయంత్రం అంతర్జాలంలో కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 13వ సమావేశం ఆసాంతం అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న అంతర్జాతీయ తెలుగు కవి డాక్టర్ పెరుగు రామక్రిష్ణ గారు వచన కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి ఒక అరగంట సేపు చక్కని ప్రసంగం చేశారు. కుందుర్తి ఆంజనేయులు, శ్రీశ్రీ, శేషేంద్ర శర్మ మొదలగు కవుల కవితలను ఉదహరించారు. వచన కవితల ప్రాధమిక లక్షణాలైన స్వేచ్ఛాయుత నిర్మాణము, భావ ప్రవాహ ఆధారిత నిర్మాణము, దృశ్యమాన చిత్రాలతో ప్రదర్శనము, సామాజిక స్పృహ మరియు భాషా సరళత గమ్యము గురించి సోదాహరణంగా వివరించారు. సహస్ర గేయ రచయిత, సభాద్యక్షుడు  శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు మొదటగా కాప్రా వేదిక సాహితీ మూర్తులను ఆహ్వానించి చక్కని కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను పెక్కు చేయాలని ఆకాంక్ష్యను వ్యక్తపరిచారు. విశిష్ట అతిధి, విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు కవులు పదికాలాల పాటు ప్రజల నాలుకలలో నిలిచిపోయే కవితలను వ...