Posts

Showing posts from August, 2025
 ఓరి తెలుగోడా!   కనులముందర  తెలుగుతేజం కనబడుతుంటే చీకటిలో తడబడటమెందుకోయ్ ఓరి తెలుగోడా! అచ్చతెలుగు పదాలుండ కవితలలో మెరిసేముత్యాలుండగ అర్ధంలేని వ్యర్ధవాక్యాలకు మనసుమళ్ళిస్తున్నావెందుకోయ్ ఓరి తెలుగోడా! ఆవకాయ గోంగూరకూరలుండ ఆంధ్రుల ఘుమఘుమలుండగ విదేశపువంటలను ఆరగిస్తున్నావెందుకోయ్ ఓరి తెలుగోడా! తేనెలొలుకు మాటలుండ మదినిమురిపించే తేటతెలుగుయుండగ రసహీనమైన భాషణలలో కరిగిపోతున్నావెందుకోయ్ ఓరి తెలుగోడా! సుమధురమైనట్టి తెలుగుబాణీలు పాటాలుండగ అన్యభాష పాటలెందుకోయ్ ఓరి తెలుగోడా! సుందరమైన తెలుగుపడుచులుండ విలువలు వలువలులేని ఇతరరాష్ట్రదేశాల వధువులెందుకోయ్ ఓరి తెలుగోడా! అన్నమయ్య త్యాగయ్య కీర్తనలుండ రాళ్ళనుకరిగించే గానాలుండగ పరభాషగీతాలలో మునిగిపోతున్నావెందుకోయ్ ఓరోరి తెలుగోడా! ఆణిముత్యాల్లాంటి యాబది ఆరు తెనుగువర్ణమాలుండగ ఇరువదియారు  అక్షరాల ఆంగ్లమెందుకోయ్ ఓరి తెలుగోడా! తెలుగుతల్లి గుండెచప్పుడు రక్తంలో కొట్టుకుంటుండగ ఊపిరితీయదనమును మాతృభాషలో వెలువరించవెందుకోయ్ ఓరి తెలుగోడా! తెలుగును కాపాడరా తెనుగును గెలిపించరా గుండెలను గుబాళించరా  ఓరి తెలుగోడా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నాపిచ్చి నాది నాకు పెద్దపేరు రావాలి అఖండఖ్యాతి కావాలి ప్రజలనోర్లలో నానాలి నన్ను వేదికలు ఎక్కించాలి ఉపన్యాసాలు ఇప్పించాలి ఇంద్రుడుచంద్రుడు అనాలి నన్ను పొగడ్తలతో ముంచాలి బిరుదులిచ్చి పురస్కరించాలి చప్పట్లుకొట్టి శ్లాఘించాలి నాకు సాదరస్వాగతాలు పలకాలి సింహాసనంలాంటి పీటవెయ్యాలి గండపెండేరాలు తొడగాలి నాపై పూలజల్లులు కురిపించాలి కమ్మనికవితలు వ్రాయాలి శ్రావ్యమైనపాటలు పాడాలి నాపేరు పత్రికల్లో ప్రచురించాలి టీవీల్లో చూపించాలి రేడియోల్లో మారుమ్రోగించాలి నాకు కాశ్మీరీశాలువాలు కప్పాలి ప్రశంసాపత్రాలు అందించాలి సన్మానసత్కారాలు చేయాలి నన్ను ఎవరెస్టు ఎక్కించాలి ఆకాశానికి ఎత్తాలి జాబిలిపై కూర్చోపెట్టాలి నన్ను అందరూ గుర్తించాలి ఎల్లరూ అభిమానించాలి సర్వులు తలకెత్తుకోవాలి నన్ను ప్రపంచమేటి అనాలి నాకు ఇలలో సాటిలేరనాలి నావ్యవహారం ముదిరందనుకోవాలి నేనెవరినీ తిట్టటంలేదనుకోవాలి నాపిచ్చినాదే అనుకోవాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 ప్రసన్నంకోసం పరంధాముడు ప్రసన్నం కావాలని — పూజా పునస్కారాలు చేస్తా, ప్రసాద తాంబూలాలు పంచుతా. ప్రియురాలు ప్రసన్నం కావాలని — పొంకపు చూపులు విసురుతా, పకపకల నవ్వులు చిందుతా. అధికారులు ప్రసన్నం కావాలని — దండాలు పెడతా, ధనమాశ చూపుతా; బహుమతులు ఇస్తా, బ్రతిమాలుకుంటా. ప్రకృతి ప్రసన్నం కావాలని — పలురీతుల పసందుగా వర్ణిస్తా, పరికింపజేసి పరవశపరుస్తా. పలుకులమ్మ ప్రసన్నం కావాలని — ప్రణామాలు చేస్తా, ప్రతినిత్యం ప్రార్థిస్తా. అక్షరాలు ప్రసన్నం కావాలని — వెదికివెదికి పట్టుకుంటా, ముత్యాల సరాల్లా కూరుస్తా. పదాలు ప్రసన్నం కావాలని — పువ్వుల్లా గుచ్చుతా, ప్రాసల్లో పొసుగుతా. పాఠకులు ప్రసన్నం కావాలని — తనువులు తట్టుతా, మనసులు ముట్టుతా. సాహిత్యలోకము ప్రసన్నం కావాలని — అక్షరజ్యోతుల్లో వెలుగుతా, పతకమాలలతో కులుకుతా. అంతరంగాలు ప్రసన్నం కావాలని — మాటల మల్లెలు విసురుతా, మదులను మత్తులో ముంచుతా. పొరుగువారు ప్రసన్నం కావాలని — పలుకులకు తేనియను పూస్తా, పెదాలకు అమృతం అందిస్తా. ప్రపంచము ప్రసన్నం కావాలని — కవితా గానము ఆలపిస్తా, అంతరంగ సాక్షిగా నిలుస్తా. ప్రసన్నమే నా రక్తి ప్రసన్నతే నా శక్తి ప్రసన్నమే నా యుక్తి ప్రసన్నతే న...
 కవిత్వం అంటే? కవిత్వం అంటే కాదురా భావాల ఉప్పెనా... అక్షరాల ఆటా ... కవిత్వం! ప్రభంజనమై ఉర్రూతలు ఊగిస్తుంది… అమరమై పుస్తకాలలో జీవిస్తుంది… కవిత్వం! అమృతమై అధరాలను తడుపుతుంది, తీయదనమై తనువుల తృప్తిపరుస్తుంది. కవిత్వం! చక్కదనమై సంతోషం కలిగిస్తుంది, శ్రావ్యగీతమై వీనులకు విందునిస్తుంది. కవిత్వం! సూర్యకిరణమై వెలుగులు చిమ్ముతుంది, పున్నమివెన్నెలై మదులు మురిపిస్తుంది. కవిత్వం! వానచినుకులై హృదయాలను తడుపుతుంది, ఇంద్రచాపమై రంగులను వెదజల్లుతుంది. కవిత్వం! కన్యకయై వలపువల విసురుతుంది, వధువై పీటపై కూర్చుంటుంది. కవిత్వం! మధువై ముచ్చటపరుస్తుంది, పరిమళమై పరవశపరుస్తుంది. కవిత్వం! ఆయుధమై దురాచారాలను నిర్మూలిస్తుంది, ప్రాణమై గుండెలను ఆడిస్తుంది! అందుకే…కవిత్వం పదాలసమాహారంకాదు, అది జీవనధ్యానము, హృదయస్పందనము, మనసులప్రతిచర్యలు మధురానుభూతులు! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 జర జాగ్రత్త మానవా! పుండుమీద కారం చల్లేవారున్నారు పాలలో విషం కలిపేవారున్నారు కళ్ళను పొడిచేవారున్నారు నోర్లను మూసేవారున్నారు నిప్పురవ్వలు painaచల్లేవారున్నారు గుంటల్లోకి పడదోచేవారున్నారు బాధలు పెట్టేవారున్నారు బూతులు తిట్టేవారున్నారు ఎక్కేవారిని క్రిందకు లాగేవారున్నారు నడిచేవారిని ఆటంకపరచేవారున్నారు కష్టాలు కలిగించేవారున్నారు నష్టాలు మోపేవారున్నారు ద్వేషాలు రగిల్చేవారున్నారు మోసాలు చేసేవారున్నారు బురద చల్లేవారున్నారు నిందలు వేసేవారున్నారు చేతులకు బేడీలు తొడిగేవారున్నారు కాళ్ళకు సంకెళ్ళు వేసేవారున్నారు హత్యలకు పాల్పడేవారున్నారు శీలాలు దోచుకునేవారున్నారు   నరరూపరాక్షసులను మనించు అసూయపరులను దూరంగాపెట్టు మంచివారితో చేతులుకలుపు ముంచేవారితో తెగతెంపులుచేసుకొమ్ము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఉత్సాహభరితంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదీ 11వ అంతర్జాల సమావేశం ***************************************************************** ఈ రోజు ఉదయం సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భముగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 11వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కవి సాహితీవేత్త శ్రీ దాస్యం సేనాధిపతి గారు తెలుగు సాహిత్యానికి ప్రతాపరెడ్డి సేవలను అనన్యము, శ్లాఘనీయము అని అన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతాపరెడ్డి  గారిని తప్పక స్మరించుకోవాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సహస్ర సినీ టీవి గీత రచయిత తెలుగు వారు ప్రతాపరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.  సమన్వయకర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ  తెలుగు  సాహిత్య సంస్కృతి చరిత్రలో ప్రతాపరెడ్డి గారి స్థానం అతి విశిష్టమైనదని అన్నారు.మొదట, నంది అవార్డు గ్రహీత, సినీ దర్శకుడు శ్రీ దీపక్ న్యాతి గారు తొలిపలుకలతో అందరికీ స్వాగతం పలికారు. తర్వాత కవిసమ్మేళన సామ్రాట్ శ్రీమతి రాధాకుసుమ గారు కవిసమ్మేళనమును చిరుమందహాసంతో, చక్కని వ్యాఖ్యలతో, క్రమశిక్షణతో నిర్వహించారు....
 రంగులమైకం హరితకంబళం పుడమికికప్పాలి పచ్చదనం పరికింపచేయాలి శ్వేతవర్ణం ప్రసరింపచేయాలి నిష్కల్మషం తెలియపరచాలి బులుగువర్ణం నింగికంటాలి నీలాకాశం నేత్రాలకుచూపాలి ఎర్రదనం వెదజల్లాలి అరుణోదయం చేయించాలి వివిధవర్ణపుష్పవర్షం కురిపించాలి తేనెచుక్కలతియ్యిదనం పంచిపెట్టాలి సింధూరం చెక్కిళ్ళపై పూయాలి బిడియం బుగ్గలపై ప్రదర్శించాలి ఇంద్రాయుధం గగనంలో పొడిపించాలి సప్తవర్ణాలు తిలకింపచేయాలి చక్కదనం కూర్చాలి సంతసం చేర్చాలి చిలిపితనం చిందాలి కలికితనం కనపరచాలి పలుపువ్వులు పూయించాలి వివిధవర్ణాలు వీక్షింపజేయాలి కుంచెను చేతపట్టాలి చిత్తరువులను చిత్రవిచిత్రంగాదిద్దాలి రంగులమద్యం త్రాగించాలి హృదులకుమైకం కలిగించాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
  🌸 పూలుపూచాయి 🌸 పొద్దుపొద్దునే పూలు పూచాయి, పూలతల్లులు పరవశించారు. తేనె నింపె పరమాత్ముడు, రంగులు అద్దె దేవేరులు. పుడమి పొంగిపొరిలె, ప్రకృతి పులకరించి వెలిగె. ప్రభాకరుడు కిరణాలు చల్లె, పడతులు అంతయు సంతసించె. పవనుడు పరిమళమై వీచె, పరిసరాలు ప్రమోదమై పొంగె. పిల్లలు నవ్వులు చిందె, పెద్దలు స్వాగతాలు పలికె. బాలికలు జడలు వేసి సిద్దమయ్యె, భామలు అలంకరించుకొని వెలిగిపొయ్యె. మొగ్గలు తలలూపి పాడె, మదులు మురిసి నాట్యమాడె. పూజారి పూలకు ప్రసన్నమయ్యె, పరమేశ్వరార్చనలో మునిగిపొయ్యె. అందమేమిటో అందరూ గ్రహించె, ఆనందమెందుకో అందరినీ అనుగ్రహించె. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం ✍
 తెలుగు బ్రతకాలంటే...  తెలుగు! వెలుగులు చిమ్మించాలంటే— అందరమూ...! దీపాలు ముట్టించాలి, జ్యోతులు రగిలించాలి, అగ్నికణాల్లా మిన్నలుముట్టాలి! తెలుగు! తియ్యదనాలు చిందాలంటే— మనమందరం...! తేనె చుక్కలై రాలాలి, నదీప్రవాహమై పారాలి, ఊరువాడల్లో మోగాలి! తెలుగు! విశ్వవ్యాప్తం కావాలంటే— తెలుగోళ్ళమంతా...! ఒకే అడుగు వేసి, ఒకే శ్వాస పీల్చి, ఒకే జెండా ఎగరేయాలి! తెలుగు! పాటలు పాడించాలంటే— సర్వులమూ...! గొంతులు కలపాలి, ఒకే స్వరం వినిపించాలి, సింహగర్జన చేయాలి! తెలుగు! సొగసులు చూపాలంటే— మనజాతి...! తేటమాటలు పలకాలి, వెలుగులు విరజిమ్మాలి, విశ్వరూపం చూపాలి! తెలుగు! వ్రాతలు రాయించాలంటే— మనమందరం...! కవులను కాపాడాలి, సాహిత్యాన్ని గౌరవించాలి, అక్షరాలసేద్యము చేయాలి! తెలుగు! బ్రతికి బట్టకట్టాలంటే— మన జాతి అంతా...! ఉద్యమబాట పట్టాలి, ముందుకు కదలాలి, చైతన్యం తేవాలి! తెలుగువారు ఇప్పుడైనా మేల్కొనాలి, నడుము బిగించాలి, కదం త్రొక్కాలి, సత్వరచర్యలు చేపట్టాలి! రండి! కదలిరండి తెలుగుకంకణం కట్టించుకోండి, తెలుగుపతాకం చేతపట్టండి, తెలుగువాణిని వినిపించండి, తెలుగుతల్లిని గౌరవించండి తెలుగుజాతికి! ఇదే సమయం— లేకపోతే చరిత్ర మాపేసి వ...
 ఏలనో? ఒక్కోసారి... ఉత్సాహం ఉల్లాన ఉప్పొంగుతుంది పువ్వుల పరిమళంలా… హరివిల్లు రంగుల్లా! ఒక్కో సమయాన... బయటకు పరుగెత్తిపోవాలనిపిస్తుంది నీలి నింగిని ఆలింగనం చేసుకోవాలని పిండి వెన్నెలను ఆస్వాదించాలని! ఒక్కో రోజున... ప్రకృతిని పరికిస్తే, కళ్ళు విస్తుపోయి వెలుగుల్లా మెరుస్తాయి మనసు మురిసిపోయి మల్లెల్లా పరిమళిస్తుంది!  ఒక్కో నిమిషాన... ఊహలు ఊరుతుంటాయి నదిలోని ప్రవాహంలా… కలం నుంచి జాలువారే అక్షరాల్లా!  ఒక్కో క్షణాన... ఇష్టులను కలిసినట్టనిపిస్తుంది ప్రాణ స్నేహితుడిని… పొంకాల ప్రేయసిని!  ఒక్కో మారు... వేడి తగిలినట్టనిపిస్తుంది రక్తం ఉడికిపోతూ… హృదయం కరిగిపోతూ!  ఒక్కో తడవున... కలం చెయ్యి పట్టుకుంటుంది "అక్షరాలను పేర్చు!" అంటుంది, "కవితలను కూర్చు!" అని ఆజ్ఞాపిస్తుంది! ఒక్కో రీతిన... కవిత కవ్విస్తూనే ఉంటుంది తియ్యదనాలు పంచమని… కమ్మదనాలు కురిపించమని!  కవితలకు  సాదర స్వాగతాలు కవులకు  అక్షర నీరాజనాలు! వాణీదేవికి  వేల వందనాలు సాహిత్య లోకానికి  సుమాంజలులు!  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నేను మన్మధ బాణం కాదు మాటల అస్త్రం సంధిస్తా వ్యర్ధ కార్యాలు కాదు అర్ధవంత పనులు చేబడతా పుష్పాల హారం కాదు అక్షరాల సరం అల్లుతా సుమ సౌరభాలు కాదు కవితా పరిమళాలు చల్లుతా నీటి వరద కాదు ఊహల వెల్లువ పారిస్తా ఖనిజ అన్వేషణ కాదు విషయ వెదుకులాట సాగిస్తా పుటల వినియోగం కాదు పదాల ప్రయోగం చేస్తా వాక్యాల క్రమము కాదు భావాల శ్రేణి కూర్చుతా  రవి కిరణాలు కాదు కవి కాంతులు ప్రసరిస్తా శశి వెన్నెల కాదు కవన కౌముది కురిపిస్తా డబ్బుల హరణం కాదు హృదుల దోపిడి కాంక్షిస్తా చదువరుల పొగడ్తలు కాదు విమర్శకుల వ్యాఖ్యలు ఆశిస్తా పాఠకుల సంతోషం కోసం పగలు రాత్రులు పాటుబడతా నిజమైన కవిత్వం కోసం నిత్యం ప్రయత్నం సాగిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నా ఆనందాలు కళ్లకు కనువిందుగా — దృశ్యాలు చూడటం చెవులకు చెలిమిగా — శబ్దాలు వినటం రుచుల విందుగా — చవులు ఆస్వాదించటం ఇవన్నీ నాకిస్తాయి మధురానందం వెలుగుల తారలలా — చిమ్మిన కాంతులు పూల సుగంధములా — చల్లిన సౌరభాలు మనసు దోచిన మాధుర్యములా — స్నేహస్పర్శలు ఇవన్నీ నాకుచేకూరుస్తాయి మధురానందం వర్షపు చినుకుల్లా — ప్రేమలు కురిపించటం వసంతపు వీచికల్లా — అభిమానం అందుకోవటం మిత్రుని కరచాలనంలా — అన్యోన్యంగా మెలగటం ఇవన్నీ నాకుకలిగిస్తాయి మధురానందం సంభాషణలలో — జ్ఞానవీణ మ్రోగటం స్వాగతాలలో — హృదయదీపం వెలగటం సన్మానాలలో — సత్కారం సువాసన పూయటం ఇవన్నీ నాకందిస్తాయి మధురానందం పూలను పరికించటం — కవిత్వ పుటలలో వెన్నెలలో విహరించటం — కలల కాగితాల్లో కడలితరంగాలు వీక్షించటం — ఊహల లోకములో ఇవన్నీ నాకవుతాయి మధురానందం రంగుల రమ్యముగా — చిత్రాల అద్దటం హంగుల హరివిల్లులా — అందాలను దిద్దటం పొంగుల పండుగలా — ఉత్సవాలు వీక్షించటం ఇవన్నీ నాకొసగుతాయి మధురానందం నవ్వుల నక్షత్రాల్లా — ముఖములు వెలిగించటం చిరునవ్వుల చినుకుల్లా — మోములు పూయించటం సహాయం చేయటం — సూర్యరశ్మిలా నడిపించటం ఇవన్నీ నాపాలిట మధురానందం ఆటలలో ఉల్లాసం — పిల్లల హాసం పాటలలో మ...
 నవయువతీ… తెలుసుకో! అందాలు చూసి — అర్రులు చాస్తుంటారు! ఆనందము పొంది — అంటుకొని పోతుంటారు!! చెంతకు చేరి — సరసాలు ఆడతారు! సమయము గడిపి — సరదాలు చేస్తారు!! ఆశలు రేపి — అతిచేష్టలతో ముంచుతారు! మనసును తట్టి — అదుపులో పెట్టుకుంటారు!! చిరునవ్వులు చిందించి — చిక్కించుకుంటారు! వేషాలు వేసి — వెర్రినాటకాలు ఆడతారు!! ముచ్చట్లు చెబుతూ — మురిపిస్తారు! చప్పట్లు కొడుతూ — శ్లాఘిస్తారు!! తోడుగా తెచ్చుకొని — తృప్తి పొందాలనుకుంటారు! “జోడుగా ఉంటాం” అంటూ — జబర్దస్తీ చేస్తారు!! చేతులు కలిపి — చెలిమిని పెంచుతారు! అవసరము తీర్చుకొని — ఆవలకు నెడతారు!! డబ్బులు ఉన్నాయని— డబ్బాలు మోగిస్తారు! డాబులు చూపించి — డుమ్మాలు కొడతారు!! చెప్పినవి అన్నీ - నిజమని నమ్మవద్దు! చూపినవి అన్నీ - ఘనమని అనుకోవద్దు!! మోహలోకం ఇది! మోసలోకం ఇది!! మాటలకు మోసపడి — మట్టిలో కలిసిపోవద్దు!!! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ముందుకు వెళదామా…  అక్షరాలు పేర్చుదాం ఆవిరిగా మార్చుదాం ఆకాశానికి పంపుదాం అంబుదముగా మార్చుదాం చినుకులై కురుద్దాం కాలువలై పారుదాం తనువులు తడుపుదాం మనసులు మురిపిద్దాం పెదవులు విప్పుదాం స్వరములు పలికిద్దాం కోకిలలై పాడుదాం హృదులు హరిద్దాం చిత్రములు గీద్దాం రంగులను పూద్దాం పువ్వులై వికసిద్దాం సువాసనలై వ్యాపిద్దాం పున్నమిని వర్ణిద్దాం జాబిలిని పొడిపిద్దాం మేఘాలను కదిలిద్దాం దోబూచులు ఆడిద్దాం చుక్కలను పేర్చుదాం తళతళలు చిమ్ముదాం వెన్నెలను కురిపిద్దాం వెలుగులు చల్లుదాం కలమును పట్టుదాం కాగితాలు నింపుదాం ప్రాసలను కూర్చుదాం లయను కొనసాగిద్దాం కవితలను అల్లుదాం తేనెలను అంటుదాం సౌరభమును చిమ్ముదాం సాహిత్యమును అలరిద్దాం ఆలోచనల పందిరై కలలతోట వనమవుదాం సత్య స్వప్నయాత్రలో జీవితగమ్యం అవుదాం గుండెలు కొట్టుకునేంతవరకు మనసులు పాడుకునేంతవరకు కడదాక ఆనందయాత్ర సాగిద్దాం కలసి అడుగులు ముందుకేద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా ప్రేమలు జీవితాన్ని ప్రేమిస్తున్నా చూచే అవకాశమిచ్చినందుకు వినే వీలు కలిగించినందుకు చేసే భాగ్యం ప్రసాదించినందుకు అందాలను ప్రేమిస్తున్నా అంతరంగం తడుతున్నందుకు అనుభూతులు అందిస్తున్నందుకు ఆనందాలు పంచుతున్నందుకు పువ్వులను ప్రేమిస్తున్నా పొంకాలతో పలుకరిస్తున్నందుకు పరిమళాలు చల్లుతున్నందుకు పరవశాలు పంచుతున్నందుకు నవ్వులను ప్రేమిస్తున్నా సంతోషం తెలియజేస్తున్నందుకు స్పందనలు వ్యక్తం చేస్తున్నందుకు మోములు వెలిగించుతున్నందుకు వెన్నెలను ప్రేమిస్తున్నా సూరీడు లేని లోటు తీరుస్తున్నందుకు చిత్తాలను మెల్లగా తాకుతున్నందుకు మదులను ముత్తుతూ మురిపిస్తున్నందుకు అమ్మలను ప్రేమిస్తున్నా జీవజాతిని కాపాడుతున్నందుకు మంచి అలవాట్లు నేర్పిస్తున్నందుకు సంఘాభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు నాన్నలను ప్రేమిస్తున్నా పిల్లలను పెంచి పోషిస్తునందుకు బాధ్యతల భారం మోస్తున్నందుకు భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దుతున్నందుకు స్నేహితులను ప్రేమిస్తున్నా చెంతనిలిచి తోడ్పడుతున్నందుకు సలహా, సూచనలు ఇచ్చుతున్నందుకు సరియైన మార్గం చూపించుతున్నందుకు సమాజాన్ని ప్రేమిస్తున్నా వెన్నుతట్టి వెనుక నిలుస్తున్నందుకు స్పందనలు తెలియజేస్తున్నందు...
 ఈ కవితలో… నేను  మీరు చదివే — ఈ కవితలో కొన్ని పంక్తులున్నాయి…  కొన్ని పదాలున్నాయి…  కొన్ని అక్షరాలున్నాయి… మీరు చూసే — ఈ కవితలో  కొన్ని దీపాలున్నాయి…  కొన్ని వెలుగులున్నాయి…  కొన్ని చిత్రాలున్నాయి… మీరు ఆలకించే — ఈ కవితలో  కొన్ని శబ్దాలున్నాయి…  కొన్ని స్వరాలున్నాయి…  కొన్ని గీతికలున్నాయి… మీరు మనసుపడే — ఈ కవితలో  కొన్ని ఆలోచనలున్నాయి…  కొన్ని కల్పనలున్నాయి…  కొన్ని భావనలున్నాయి… మీరు ఆస్వాదించే — ఈ కవితలో  చక్కెర రసముంది…  తేనె చుక్కలున్నాయి…  తీపి మిఠాయిలున్నాయి… మీరు ఇష్టపడే — ఈ కవితలో  ప్రాసలు పొదిగాయి…  పోలికలు పూచాయి…  పరిమళాలు విరిచాయి… మీరు మునిగిపోయిన — ఈ కవితలో  వాన జల్లులు కురుస్తున్నాయి…  తనువును తడిపేస్తున్నాయి…  చిందులు త్రొక్కిస్తున్నాయి… మీరు మెచ్చుకునే — ఈ కవితలో  అందాలు దాగివున్నాయి…  ఆనందాలు అందిస్తున్నాయి…  అంతరంగమును అంటుతున్నాయి… మీకు ఈ కవితలో —  నేను కనబడుతున్నానా?  నేను మాట్లాడుతున్నానా?  నేను వినబడుతున్నానా? మీకు ఈ కవితతో —...
 పూలకైపులు గులాబీలు గుబాళిస్తుంటే మల్లెలు మత్తెక్కిస్తున్నాయి మందారాలు మురిపిస్తుంటే మొగలిరేకులు ముచ్చటపరుస్తున్నాయి బంతిపూలు మదిదోస్తుంటే చేమంతులు చోద్యపరుస్తున్నాయి సన్నజాజులు సంబరపరుస్తుంటే సంపంగెలు స్వాగతిస్తున్నాయి తామరలు తలలుతడుతుంటే కలువలు కళ్ళనుకట్టేస్తున్నాయి పువ్వులు ప్రకాశిస్తుంటే హృదులు ఆస్వాదిస్తున్నాయి పుష్పాలు పలురంగులుచిమ్ముతుంటే మదులు మహదానందపడుతున్నాయి సుమాలు సుగంధాలుచల్లుతుంటే సీతాకోకలు చుట్టుముటుతున్నాయి పూలకన్యలు పిలుస్తుంటే కవులకలాలు కదులుతున్నాయి పూలవర్షము కురుస్తుంటే కవితాజల్లులు పారుతున్నాయి పూలతోట ఎంతహృద్యము? పూలబాట ఎంతసుందరము? పూలదృశ్యము ఎంతరమణీయము? పూలకవితలు ఎంతమధురము? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 మానవనైజం పగలంటే — ప్రియమే రాత్రంటే — భయమే లాభమొస్తే — సంతోషం నష్టమొస్తే — విచారం దేవుడంటే — నమస్కారం దెయ్యమంటే — తృణీకారం హీరోకయితే — అభిమానం విలనయితే — విద్వేషం అందమంటే — ఆనందం అసహ్యమంటే — అయిష్టం ఆదాయమొస్తే — సుఖం వ్యయమైతే — దుఃఖం ఆరోగ్యమంటే — భాగ్యం అనారోగ్యమంటే — శోకం తోడులభిస్తే — సంతసం ఒంటరైతే — విలాపం మంచికైతే — ఆహ్వానం చెడుకైతే — తిరస్కారం శుభమైతే — పొంగిపోవటం అశుభమైతే — కృంగిపోవటం జననం — పర్వదినం మరణం — శోకదినం మానవనైజం — చిత్రమే జీవితపయనం — విచిత్రమే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 మధురక్షణాలు జాబిలి పొడిచే — వెన్నెల కురిసే హృదయం పొంగే — మధుర క్షణమయ్యే మబ్బులు లేచే — చినుకులు చల్లే మనసు ఉప్పొంగే— మధుర క్షణమయ్యే సూరీడు వచ్చే— అరుణోదయం అయ్యే చీకటిని తరిమే — మధుర క్షణమయ్యే పువ్వులు పూసే — పరిమళం చల్లే అంతరంగం అలరారే — మధుర క్షణమయ్యే నవ్వులు చిందే — మోములు వెలిగే ఆనందం పంచే — మధుర క్షణమయ్యే చెలి చెంతచేరే — సొగసులు చూపే ఉల్లాసం నింపే — మధుర క్షణమయ్యే చిత్రకారుడు కుంచెపట్టే — రంగులగీతలు గీచే అందాలాబొమ్మను సృష్టించే — మధుర క్షణమయ్యే కవివరేణ్యుడు కలంపట్టే — అక్షరముత్యాలు జార్చే మనసును హత్తుకొనే — మధుర క్షణమయ్యే మధురక్షణాలను ముందుంచినందుకు కవులకు చిత్రకారులకు వందనాలు అభివందనాలు మానవ జీవితమంతా అపరూపక్షణాల పండుగే చక్కని దృశ్యాలమయమే ఆనంద సమయాలే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ – భాగ్యనగరం
 ఒలకబోతలు ఒలకబోసిన వయ్యారాలు రేపుతున్నాయి మానసిక ఉద్వేగాలు ఒలకబోసిన చిరునవ్వులు వెలిగిస్తున్నాయి అందాల మోములు ఒలకబోసిన  రాగాభిమానాలు మురిపిస్తున్నాయి ప్రేమికుల మదులు ఒలకబోసిన తేనీరు మార్చుకోమంటున్నాయి తడిసిన దుస్తులు ఒలకబోసిన పాఠాలు తప్పక మళ్ళీచెబుతున్నాడు పాఠశాలలో పంతులు ఒలకబోసిన చేటబియ్యము తిట్టుకుంటూ ఎత్తుచున్నది ఇంటి ఇల్లాలు ఒలకబోసిన కన్నీరు కరిగిస్తున్నది కఠిన హృదయాలు ఒలకబోసిన అక్షరాలు చిందుతున్నాయి దివ్వెల వెలుగులు ఒలకబోసిన మాటలు ముట్టుతున్నాయి హృదుల మీటలు ఒలకబోసిన భావాలు లేపుతున్నాయి మదిన భ్రమలు ఒలకబోసిన నిత్య చేష్టలు పుట్టిస్తున్నాయి హృదిన తలపులు ఒలకబోసిన జీవన క్షణాలు రంగులద్దుతున్నాయి మనసుల పుటలకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 భావసృష్టి ఖాళీ మనసును రంగులతో నింపు చిక్కగా కలుపు చక్కగా చూపు నింగిపైకి విసురు నీలముగా మార్చు అందాలదృశ్యము ఆవిష్కరించు ఆనందాలను పంచిపెట్టు దీపాలలో నింపు అగ్గిపుల్లతో వెలిగించు కాంతులు వెదజల్లు చీకటిని తరుము గాలిలోకి చిమ్ము సుగంధాలు అంటించు ఆఘ్రానించమని చెప్పు ఆహ్లాదంలో ముంచు కడలిలో కలుపు బులుగును అద్దు కెరటాలను ఎగిరించు కుతూహలము కలిగించు గ్లాసులలో నింపు తీపిని జోడించు గొంతులకు అందించు గీతాలను కమ్మగాపాడించు చెట్లమీద చల్లు పూలకు తగిలించు తేటులను పిలువు తేనెను త్రాగించు భావచిత్రాలు సృష్టించు వైభవంగా ప్రదర్శించు చైతన్యము రగిలించు గుండెలలో నిద్రించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
లక్ష్మీదేవిని పూజిద్దాం రారండి శ్రావణమాసం శుక్రవారమున శ్రీలక్ష్మీదేవిని సేవిద్దాం రారండి           ||శ్రావణ|| ఆడవాళ్ళం అందరంకలసి వరలక్ష్మీదేవిని పూజిద్దాం రారండి వరలక్ష్మీదేవి వ్రతమురోజున అమ్మవారిని ఆరాధిద్దాం రారండి         ||శ్రావణ|| ముత్తైదువులకు జాకెట్టుముక్కలుపెట్టి పసుపుకుంకాలిచ్చి గౌరవిద్దాం రారండి అష్టలక్ష్ములను అంతరంగానతలచి ఇంటికిరమ్మని మాతనుపిలుద్దాం రారండి     ||శ్రావణ|| పిల్లాపెద్దలం పూలుపండ్లుపట్టుకొని అమ్మవారిగుడికి త్వరగావెళ్దాం రారండి భోగభాగ్యాలను కొరవలేకుండా ఇవ్వమని జననినివేడుదాం రారండి     ||శ్రావణ||  భర్తాపిల్లలను సదాకాపాడమని కరుణచూపమని ప్రార్ధిద్దాం రారండి చేతికి గాజులు కాళ్ళకుమెట్టెలు నిండునూరేళ్ళు నిలుపమందాం రారండి        ||శ్రావణ|| నుదుటబొట్టు కొప్పునపూలు మెడకుతాళి కాపాడమందాం రారండి       మంత్రాలు చదివి హారతులు ఇచ్చి ప్రసాదాలు పంచి తల్లినికొలుద్దాం రారండి     ||శ్రావణ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   ...
 ఎదురుచూపులు సీతాకోకలు వెదుకుతుంటాయి విరబూసినతాజాపూలకోసం టక్కున వ్రాలాలని గ్రక్కున తేనెను త్రాగాలని పావురాలు ఎదురుచూస్తుంటాయి జంటపక్షికోసం ముక్కులు పొడుచుకోవాలని తనువులు రాసుకోవాలని మల్లెలు నిరీక్షిస్తుంటాయి గ్రీష్మంకోసం మెండుగా పూయాలని మత్తులో పడదోయాలని కోకిలలు కాచుకొనియుంటాయి వసంతంకోసం మామిచిగురులు తినాలని మధురంగా గొంతులువిప్పాలని నేల నింగివైపు చూస్తుంటుంది చినుకులకోసం తడిసి ముద్దవ్వాలని పచ్చనిమొక్కలు కనిపెంచాలని రాత్రి చూస్తుంటుంది వెన్నెలకోసం జాబిలి రావాలని వెన్నెలను చిమ్మాలని కడలి తొందరపడుతుంది కెరటాలకోసం ఎత్తుగా ఎగిసిపడాలని తీరాన్ని తాకాలని మేఘాలు పొంచియున్నాయి గాలికోసం నింగినిండా వ్యాపించాలని అవనినంతా కాంచాలని మదులు వీక్షిస్తుంటాయి ఆలోచనలకోసం తలలకు పనిపెట్టాలని తనువులు తృప్తిపరచాలని హృదులు ప్రతీక్షిస్తుంటాయి ప్రేమకోసం ఎవరో వస్తారని ఎదను మమకారంతో నింపుతారని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా జీవనపయనంలో… పచ్చని అరణ్యంలో పొంకాలను పరికిస్తూ ఆనందమధురిమలో విహరించాలనుకుంటున్నా కీకర అరణ్యంలో ఎటువంటి గోడుగూలేక నిశ్శబ్దంగా సంచరించాలనుకుంటున్నా క్రూర అరణ్యంలో పశుపక్షాదులను స్నేహితులుగాభావించి ప్రేమతోమెలగాలనుకుంటున్నా సాంద్ర అరణ్యంలో చీమలాగ చిన్నచిన్న అడుగులు వేసుకుంటూ దారినిపట్టి పయనించాలనుకుంటున్నా దట్టమైన అరణ్యంలో గాలిలాగా స్వేచ్ఛగా దూసుకుంటూ ముందుకుసాగాలనుకుంటున్నా జనారణ్యంలో అదురూ బెదురూలేకుండా స్వేచ్ఛావాయువులుపీల్చుకుంటూ సంచరించాలనుకుంటున్నా అక్షరారణ్యంలో పదాలను అల్లుకుంటూ, త్రోసుకుంటూ నా కవనపధాలను విస్తరించాలనుకుంటున్నా భావారణ్యంలో బహువర్ణముత్యాల్లా అనుభూతులను ఏరుకొని విన్నూతనంగా విప్పిచెప్పాలనుకుంటున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఎందుకు చూస్తా ఊరకుండటం? ఎందుకు కళ్ళల్లో కారంచల్లుతారు మాటల్లో విషంక్రక్కుతారు నోర్లకు తాళాలువేస్తారు చెవుల్లో సీసంపోస్తారు ఎందుకు హితాలను పెడచెవినపెడతారు నగుమోములను ఏడిపించుతారు మాటలతో విద్వేషాలులేపుతారు చేతలతో ద్వేషాలుపెంచుతారు ఎందుకు పండంటి కాపురాలనుకూలుస్తారు ముత్తైదువుల తాళిబొట్లుతెంపుతారు చేతలకు బేడీలేస్తారు కాళ్ళకు సంకెళ్ళేస్తారు ఎందుకు ముందుకేళ్ళేవారిని ఆపుతారు పరిగెత్తేవాళ్ళను పడదోస్తారు ముఖాలపై ఉమ్మివేస్తారు బట్టలపై బురదచల్లుతారు ఎందుకు అందాలపువ్వులను నలిపేస్తారు సీతాకోకచిలుకలను చంపేస్తారు కోయిలలను గొంతువిప్పనియ్యరు మయూరాలను నాట్యంచేయనివ్వరు ఎందుకు సమాజానికి సేవలుచేయరు సంఘవృద్ధికి తోడ్పడరు మదులను సృజించరు హృదులను మురిపించరు ఎందుకు కవులై కలాలుపట్టరు కవితలురాసి మార్పులుతీసుకురారు గాయకులై గళమెత్తరు నటులై మంచిపాత్రలుపోషించరు అందరంకలసి మాటలను మధురంచేద్దాము హృదయాల్లో ప్రేమవిత్తనాలు చల్లుదాము సమాజంలో సేవాస్ఫూర్తిని వెలిగిద్దాము కళతో కరుణతో కొత్తలోకం సృష్టిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 రంగులలోకం పూలు పలురంగులతో ఆకర్షిస్తాయి చెట్లు పచ్చదనంతో అలరిస్తాయి హరివిల్లు సప్తవర్ణాలతో శోభిల్లుతుంది గగనము నీలిరంగుతో ముచ్చటకొలుపుతుంది చిలుక ఆకుపచ్చతో ఆకట్టుకుంటుంది సీతాకోకచిలుక విచిత్రరంగులతో వేడుకపరుస్తుంది రవి అరుణకాంతులతో ఉదయించిమేల్కొలుపుతాడు చంద్రుడు తెల్లనివెన్నెలతో మదులనువశపరచుకుంటాడు బుగ్గలు ఎర్రరంగుతో సిగ్గులుచూపుతాయి నల్లబొట్లు దిష్టితగలకుండా కాపాడుతాయి కళ్ళు నల్లకాటుకతో మిలమిలలాడుతాయి జుట్టు నల్లరంగుతో మెరిసిపోతాయి చిత్రాలు రంగులదిద్దులతో రమణీయమవుతాయి లక్కబొమ్మలు వర్ణపూతలతో రాజిల్లుతుంటాయి కాషాయం త్యాగాలను గుర్తుకుతెస్తుంది సముద్రం బులుగురంగును తలిపిస్తుంది నలుపు దిష్టితగలకుండా కాపాడుతుంది గోరింట కాళ్ళచేతులవ్రేళ్ళు ఎర్రగాపండిస్తుంది రంగులు కళ్ళను తెరిపిస్తాయి హంగులు మదులను మురిపిస్తాయి కాగితాలు తెల్లగుండి రాయమంటాయి అక్షరాలు నల్లగుండి చదవమంటాయి కవులు వన్నియలను చూపించుతారు కవితలు రంగులదృశ్యాలు కనపరుస్తాయి వస్త్రాలకు వన్నెప్రాణం కనకానికి మెరుగెముఖ్యం రంగులప్రపంచం రమణీయం పువ్వులప్రపంచం వీక్షణీయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవివరా! (వాక్య ప్రతాపాలు) వాక్యంతో మనసుద్వారాలు తెరిపిస్తావా వాక్యంతో ఆలోచనలు పారిస్తావా వాక్యంతో అమృతము అందిస్తావా వాక్యంతో గళము ఎత్తిస్తావా వాక్యంతో వీనులకువిందు ఇస్తావా వాక్యంతో దేహాలు అలంకరిస్తావా వాక్యంతో నవ్వులు చిందిస్తావా వాక్యంతో తేనెచుక్కలు చల్లిస్తావా వాక్యంతో తియ్యదనము కలిగిస్తావా వాక్యంతో వెలుగులు వెదజల్లుతావా వాక్యంతో సుందరదృశ్యాలు చూపించుతావా వాక్యంతో హృదులను హత్తుకుంటావా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నా కలం అల్లమంటుంది అక్షరాలు ముత్యాలసరాల్లా పలకమంటుంది పదాలు చక్కని చిలుకల్లా కాయించమంటుంది వెన్నెల పున్నమి జాబిలిలా ప్రసరించమంటుంది కిరణాలు ఉదయిస్తున్న సూర్యుడిలా చిందించమంటుంది నవ్వులు మోములు వెలిగేలా చల్లమంటుంది సౌరభాలు మరుమల్లె పువ్వుల్లా కురిపించమంటుంది కవితలు వానజల్లుల్లా అలరించమంటుంది అంతరంగాలలోతులు నీలిగగనంలా దోచుకోమంటుంది హృదులను రంగుల హరివిల్లులా నిలిచిపొమ్మంటుంది చిరకాలము చరిత్రలో అమరుడిలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం