Posts

Showing posts from December, 2025
 అక్షరాకాశం  ఆకాశ దేశం – ఆశల రాజ్యం, కలలు రాజులై రాజ్యం చేసే లోకం. ఆకాశ దీపం – అంతరంగ కిరణం, నిరాశ చీకటిని కరిగించే ప్రకాశం. నీలి ఆకాశం – నమ్మకపు అంబరం, భూమిపై పరుచుకున్న దేవతా వస్త్రం. వెన్నెల ఆకాశం – మౌన సంగీతం, ఒంటరితనాన్ని ఒడిసిపడేసే మాధుర్యం. శూన్య ఆకాశం – మౌన మహాకావ్యం, మన లోపలి శబ్దాల ప్రతిధ్వానం. ఉదయ ఆకాశం – ఆశల సింధూరం, ప్రతిరోజూ జీవితానికి కొత్త ప్రారంభం. రంగుల ఆకాశం – కలల చిత్రపటం, హరివిల్లు కరిగిన ప్రేమ లోకం. ఎర్రని ఆకాశం – వీర పతాకం, ధైర్యాన్ని నింపే సూర్య సందేశం. అక్షర ఆకాశం – కవుల స్వర్గం, కలం తాకితే పూలయ్యే పదప్రవాహం. అందాల ఆకాశం – ఆనంద లోకం, వీక్షకుల చూపుల్లో మెరిసే స్వర్గధామం. — గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం
Image
  🙏🎉కొత్త సాలుకు స్వాగతం! సుస్వాగతం!!🎉🙏 అదిగో నవ్వుల పల్లకీలో… నవవత్సరం కాంతుల్ని రత్నాల్ని చల్లుకుంటూవస్తుంది, గతకాలపు గాయాలను గాలికి వదిలి, రేపటికి మణుల్ని మాణిక్యాల్ని ఏరుకుందాం. నిన్నటి నిట్టూర్పులను నేటి నీలిమేఘాల జలధారలతో, వేదనల వలలను వెలుగుల వానతో కడిగేద్దాం. పొద్దుటి పూల పరిమళంలా పవిత్రమైన ఆశలు చల్లుతూ, ప్రతి ఇంటి ముంగిట్లో ప్రార్థనల దీపాలు వెలిగిద్దాం. ఆశల అక్షరాలకు అమృతపు అర్థాలు నింపుదాం, మనసుల మల్లెలను మంగళ సుగంధాలతో మురిపిద్దాం. పాత ఏడాది పుటలను పాఠాల పుస్తకంగా మలిచి, కొత్త ఏడాది పుటలపై కలల కవితలు వ్రాసేద్దాం. కన్నీటి నీడలను కాంతి కిరణాలతో తొలగిస్తూ, కష్టాల గోడలపై కొత్త ఆశల తలుపులు తెరుద్దాం. పాత సాలుకు వీడుకోలు చెప్పుదాం, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం. రేపటి వెలుగుల్ని వరాలుగా స్వీకరిద్దాం, జీవన గగనాన్ని సుఖశాంతులతో నింపేద్దాం. ✒️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✒️ 🙏🌼 కొత్త సాలుకు హృదయపూర్వక స్వాగతం! 🌼🙏 🌸🌸అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు 🌸🌸
Image
 చిరునవ్వులు చిరునవ్వు అంటే  మోములో పూసిన మల్లెమొగ్గ, మదిలో మొలిచిన మమతామేఘం, మౌనంలో మెరిసే మణిదీపం. కన్నుల కొమ్మల్లో కాంతి కురిపించి, చిమ్మచీకటిలో దారి చూపించి, కలతల చీకటిని తరిమేసే చిన్న వెలుగు రేఖ – చిరునవ్వు. వేదనలను తరిమే వెన్నెల వర్షము, విరహాన్ని కరిగించే మందార మకరందము, వెడబాటును తొలిగించే సాధనము, మనసుకు మందు – చిరునవ్వు. అమ్మ ఒడిలో పుట్టే తొలి ఆశ్వాసం, మిత్రుని మాటల్లో మెరిసే స్నేహము, ప్రేయసి చూపుల్లో నర్తించే అనురాగము – అన్నీ చిరునవ్వులే! ఒక చిరునవ్వు చాలు రోజంతా వెలుగు నింపటానికి, జీవితపు బాటలో ఆశల పూలు పూయించటానికి. చిరునవ్వులు చిందాలి, చీకటిని తరమాలి, వెన్నెలను వెదజల్లాలి, వేదనలను వెడలగొట్టాలి. పసివాడి చిరునవ్వు - అమ్మానాన్నలకు వెలుగు ఇల్లాలి చిరునవ్వు - ఇంటెల్లపాదికి దీపము. చిరునవ్వులు  దొర్లించు సిరులు  తొలగించు కష్టాలు - నష్టాలు చిరునవ్వులు కావాలి నిత్య నూతనము, అనుదిన ప్రవర్ధనము, సహస్రకిరణాల సంగమము. చిరునవ్వులే అందము - ఆనందము, బంగారము - సింగారము, ప్రకాశము - పరిశుద్ధము. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మత్తుమాటల మహమ్మారి తస్మాత్… తాగినోడు వస్తున్నాడు తూగుతూ తుళ్ళుతూ – రహదారికే వంపు పెట్టినట్టుగా అడుగులు వేసుకుంటూ! మత్తెక్కిన మాటలు – మంత్రాలట! మత్తుదిగిన మాటలు – మహావాక్యాలట! తొక్కతోలు మాటలు – తత్త్వమట! బూతు మాటలు – బుద్ధిజీవుల భాషట! “నేనే తోపు” అంటాడు, తోచిన పలుకులను తూలుతాడు. “నేనే తొండి” అంటాడు, తెగిన బుద్ధికి బిరుదులు పెట్టుకుంటాడు. చేయని ఇతరుల ఘనకార్యాలు   చెప్పుకుంటాడు తనవని,  చేసిన దుష్టకార్యాలనుండి   తప్పించుకుంటాడు తనవికాదని.  చిల్లర మాటలు చిధ్రాలై, అల్లరి మాటలు వ్యర్థాలై – వినేవాళ్ల చెవుల్లో విసిరేసిన గులకరాళ్లై పడతాయి! మిత్రుల్ని మిథ్యగా ముద్దాడి, శత్రువుల్ని శ్లోకాలతో శపించి, తన అజ్ఞానానికి తానే పెద్ద పీఠం వేసుకుంటాడు. ఇది మాటల మద్యం కాదు – మద్యం మింగిన మాటల మహమ్మారి! ఇది నవ్వుల వినోదం కాదు – సమాజానికి సంక్రమించే వ్యాధి! కాబట్టి వినండి పౌరులారా – తాగినోడు చెప్పే తత్త్వం తాగిన గ్లాసులోనే వదిలేయండి, తాగిన నోటిలోనే మూసేయండి! ఎందుకంటే… స్పృహ లేని మాటలు సత్యం కావు, సమాజానికి వెలుగుకాదు – వాటికి దూరమే నిజమైన జాగ్రత్త! గల్తీగాళ్ళను గమనించి  ...
 అక్షరమెరుపులు మదిలో మోగిన మౌనాన్ని      మెరుపుల్లా చిలికే అక్షరాలు – చీకటి ఆలోచనల గగనాన్ని వెలుగుల వర్షంతో తడిపేమంత్రాలు. కలల కాంతులు కవితలై జారితే, కలముని ముంచి వెలిగే భావనలే అక్షర మెరుపులై మెదులుతూ మనసు నేలపై పండే ఆశలపంటలు. ప్రతి పంక్తిలో ఓ పులకింత, ప్రతి పదంలో ఓ ప్రాణం, నిశ్శబ్దాన్ని నాదంగా మార్చే నవజీవన నాదమే అక్షరప్రకాశాలు. కవిగారి కలల కిరణాలు లోకానికి వెలుగు పంచితే – చీకటిని చీల్చే చిరునవ్వులై పదాలు పూయించేను అక్షరపువ్వులు. అక్షర మెరుపులు పడే చోట హృదయాలే పుణ్యక్షేత్రాలు, కవితలే కాంతి దీపాలు, ప్రపంచమే ఆయ్యేను భావాలమందిరము. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 తెలుగు యాత్రలు -వెలుగు జ్యోతులు   నాడు తెలుగు తాటిచెట్ల నీడల్లో, తల్లుల ఒడుల్లో - తాతల కథల్లో, పల్లె పొలాల్లో - పలుకుల పరిమళం. నేడు తెలుగు డిజిటల్ తెరలపై డాలర్ల దేశాల్లో - విమానాల రెక్కలపై సరిహద్దులు దాటిన - స్వర్ణాక్షర సంచారం. ఆంధ్రాలో అమ్మతనపు అక్షరాలు, తెలంగాణాలో తేజోమయమైన తేటతనం, తమిళనాడులో తేనెచుక్కల తెలుగు పలుకులు, కర్నాటకలో కన్నడ గంధంతో కలిసిన కవితా సౌరభం. ఒరిస్సాలో ఉత్కలుల ఉల్లాల్లో ఊయలలూగే పదాలలాలిత్యం, మహారాష్ట్రలో మరాఠీ మన్నులో మేళవించిన మధురగానం. అమెరికాలో సిలికాన్ లోయలో సంస్కృతి సెమినార్లలో సంస్కారస్వరం, ఆస్ట్రేలియాలో సముద్ర అలలతో కలిసి సరసమైన సాహితీ సుగంధం. ఇంగ్లాండులో వర్షపు వీధుల్లో వర్ణాల వేదనాడి, మలేషియాలో మలయ మల్లెలతో మిళితమైన మాధుర్యం. మారిషస్సులో క్రిష్ణాగోదావరీ నదీతీరపు గుండె చప్పుడు, కెనడాలో మంచు మధ్య మదిని కరిగించే మాతృభాష మమకారం. ఆరబ్బు దేశాల్లో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రుల మాతృభాషావాడకం శ్రీలంకలో సీతాదేవి అడుగుల జాడలో సంస్కృతీ సంచారం. నాడు పల్లెటూరి పుట్టిల్లు, నేడు విశ్వగ్రామపు వెలుగు,  తెలుగు – ఒక భాష కాదు… ఒక తల్లి గుండె చప్పుడు, ఒక జాతి ఆత్మ...
🌺 కవుల లోకం 🌺 కవుల మాటలు మధువుల జల్లు – మదిని తడిపే పలుకులు, మౌనాల లోతుల్లోంచి మార్మోగే మాణిక్యవీణా ధ్వనులు… కవుల రాతలు చీకట్ల చెరలను చీల్చే వెలుగుల వాక్యాలు, నిశ్శబ్దాన్ని పలికించే నిజాల శబ్దాలు… కవుల కలాలు కాలానికి కన్నీళ్లు తుడిచే కరుణా కుంచెలు, గాయాల మీద గంధం పూసే ప్రేమ హస్తాలు… కవుల గళాలు అణచివేతల మీద అగ్ని స్వరాలు,  అన్యాయంపై న్యాయపు అమర నినాదాలు… కవుల చూపులు చీకటిలోనూ వెలుగును చూసే దివ్యదృష్టులు, మట్టిలోనూ మణిని కనుగొనే మౌనవిజ్ఞానాలు… కవుల మదులు కవితలతో కరిగే కరుణా హృదయాలు, ప్రపంచ బాధల్ని బయట పెట్టు ప్రాణాలు… కవుల కలలు ప్రపంచాన్ని పూలతో నింపే పవిత్ర సాధనాలు, ప్రేమకే రాజ్యాభిషేకం చేసే పావన సంకల్పాలు… కవుల కాలము కాలాన్నే నిలిపేసే అక్షరాల అమృతం, తరతరాలకూ తరగని వెలుగు మార్గం… కవుల గొప్పలు పేరు కాదు – పుటలలో నిలిచే చరిత్ర సాక్ష్యం, కాలం మారినా మసకబారని అక్షరాల అమరత్వం…! కవుల లోకము మదులను మురిపించే మరో ప్రపంచం,    కలమే కిరీటమై కవితలకే కనకసింహాసనం…! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 ఇదా రాజకీయం? రాజకీయమంటే ప్రాంతలను పాలించటమా - ప్రత్యర్ధులను దూషించటమా, ఆత్మస్తుతి చేసుకోవటమా - పరనిందలకు పాల్పడటమా. రాజకీయమంటే ప్రజాసేవ చేయటమా - స్వలాభాలు పొందటమా, వేదికలెక్కి ఉపన్యసించటమా - రచ్చచేసి నిప్పురగిలించటమా. రాజకీయమంటే అభివృద్ధికి పాటుపడటమా - రప్పారప్పా ఆడించటమా, పరిస్థితులు సరిదిద్దటమా - తొక్కవలవటమా తోలుతీయటమా. రాజకీయమంటే వక్రీకరణలను పటాపంచలుచేయటమా - అబద్ధాలుచెప్పటమా, సన్మానాలు పొందటమా - సత్కారాలు చేయ్యటమా. రాజకీయమంటే సమరం సాగించటమా - సంధి చేసుకోవటమా, సింహాసనం అధిరోహించటమా - ప్రత్యర్ధులపై పగతీర్చుకోవటమా. రాజకీయమంటే  కుళ్ళు కుతంత్రాలకు దిగటమా - అవినీతి ఆక్రమాలకు పాల్పడటమా,  చీకటి వ్యవహారాలు నడపడటమా - కక్కుర్తి కార్యాలు కొనసాగించటమా.  రాజకీయమంటే మాయమాటలుచెప్పటమా - మధ్యంపంచిడబ్బులుపెట్టి ఓట్లుకొనటమా, పక్షాలుమారటమా ముఠాలుకట్టటమా - పెత్తనంచేయటమా. రాజకీయమంటే కులమతప్రాంతాలను రెచ్చకొట్టటమా - ప్రజాభిష్టాలను నెరవేర్చటమా,  సంక్షేమకార్యాలు చేయటమా - ప్రజస్వామ్యాన్ని రక్షించుకోవటమా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ⚖️ నేతిబీరకాయల్లో నెయ్యా న్యాయస్థానాల్లో న్యాయం?  చేతిలో తులసి కాదు – తూకపు త్రాసు, కళ్లకు గంతలు కాదు – పక్షపాతం లేని చూపు, చేతిలో రాజ్యాంగ పుస్తకం – అన్యాయంపై న్యాయపు శాసనం… ఆమే పుటలపై వెలిగే – న్యాయదేవత! రాజసభలు మారాయి, సింహాసనాలు మారాయి, కాని మనుషుల కన్నీళ్ల రుచి మాత్రం ఇంకా మారలేదు… న్యాయస్థానాల మెట్లపై వేదనతో నిలబడ్డవారి నీడలు, ప్రతీ గుమ్మం ముందు ప్రార్థనలై వరసలో నిలుస్తున్నాయి. సత్యం చేతుల్లో పత్రాలై మారి, నిజం నోటిలో వాదనలై మిగిలి, న్యాయం మాత్రం తేదీల తాళాల్లో చిక్కుకుపోతున్నది… కాలం గడుస్తోంది, వ్యాజ్యం నడుస్తోంది, కానీ బాధితుడి జీవితమే వాయిదాల బారిన పడుతోంది! ఆలోచించు ఓ న్యాయదేవతా! నీ త్రాసు తూగుతున్నదా లేదా బాధితుల ఓపికను కొలుస్తున్నదా? స్వార్ధపరువైపు మొగ్గు చూపుచున్నదా! కళ్ళ గంతులు తొలగించి ఒక్కసారి కన్నీళ్లను చూడవమ్మా… న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాదని లోకమే చెబుతోంది కదా! న్యాయస్థానాల గడపలు  ఆశల తలుపులుగా మారాలి, తీర్పులు గాయాలపై మాన్పులుగా మారాలి, అప్పుడే న్యాయదేవత చిరునవ్వు అభయహస్తం అవుతుంది! అన్యాయం అణగదొక్కబడాలి  అక్రమాలు నిరోధించాలి  ఆవినీత...
 ఓ కవీశ్వరా! కవన పీఠము ఎక్కరా కీర్తి కిరీటము దాల్చరా మంచి మాటలు చెప్పరా శ్రోతల మదులు దోచరా తేనె పలుకులు చిందరా కవితా ఆసక్తి పెంచరా అమృత జల్లులు చల్లరా జనుల నోర్లనందు నానరా చక్కగా అక్షరాలు అల్లరా ప్రాసలతో పదాలు పేర్చరా ఉల్లాలలో ఊహలు ఊరించరా బాగుగా భావాలు పారించరా జగాన వెలుగులు చిమ్మరా సుమ సౌరభాలు వెదజల్లరా అంద చందాలు చూపరా ఆనంద పరవశాలు కలిగించరా నవ రసాలు అందించరా ప్రజా నాడిని పట్టరా మధుర గళము విప్పరా వీనులకు విందు ఇవ్వరా కవన సేద్యము సాగించరా కవితా పంటలు పండించరా సాహితీ లోకమును ఏలరా కవన రాజ్యమును పాలించరా అక్షరదీపమై అంధకారము తొలగించరా సత్యస్వరమై లోకహితమును బోధించరా నీకలమే మానడకకు మార్గదర్శకము కావాలిరా నీకవితలే కాలమునకు సాక్ష్యముగా నిలవాలిరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మనిషి ఆరాట–పోరాటాలు ఆశల అడుగుల్లో ఆరాటం అంకురిస్తుంది కలల గగనంలోకి చూపులు విస్తరిస్తాయి అడుగడుగునా అడ్డంకులు అయినా ఆగకూడదు ప్రయాణం పడిపోతే లేచినిలబడే మనిషి మనోధైర్యమే ఆయుధం పోరాటం అంటే యుద్ధం కాదు లోపలి భయాలతో చేసే సమరం ఆరాటం అంటే వృధా ప్రయాసకాదు జీవితానికి అర్థం పరమార్ధం చీకటి కమ్ముకున్నా వెలుగును నమ్మే హృదయం వెన్ను చూపని సంకల్పమే విజయానికి తొలి సాక్ష్యం గెలుపు ఓ మలుపు మాత్రమే పరాజయం ఓ పాఠం ఆరాట–పోరాటాల మధ్యే సాగుతుంది జీవన పయనం మానవులు లేనిదానికోసం  మానుకోవాలి అర్రులుచాచటం దొరికిందేచాలు అనుకోవటం  నేర్చుకోవాలి మానవసమాజం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 సందేశాల సంపూర్ణం  అక్షరసందేశం కలమునుంచి జాలువారిన నిశ్శబ్దపు నదిలా పుటలపై పారుతూ కాలపు గడపలు దాటి మనసుల తలుపులు తడుతుంది శబ్దసందేశం గళం గగనాన్ని తాకి తరంగాలలో తేలుతూ విన్న హృదయాలలో వణుకుల్ని పుట్టించి భావాలకు రెక్కలు తొడుగుతుంది మేఘసందేశం ఆకాశపు అంచుల నుంచి చినుకులై జారుతూ ఎండిన ఆశలను మాటలులేకుండానే తడిపి మేల్కొలుపుతుంది హృదయసందేశం పలుకుల అవసరం లేని నాడుల మధ్య ప్రయాణం చూపులలో మెరుపై స్పర్శలో స్పందనై నిజాన్ని తెలియజేస్తుంది ప్రేమసందేశం కాలం చెరిగించలేని కళ్యాణాక్షరంలా గుండెను తట్టి  మనసును ముట్టి  హృదయకాంక్షను తెలుపుతుంది  మౌనసందేశం ఏ అక్షరమూ లేని అత్యంత లోతైన కవిత అర్థమయ్యేవారికే అనుభూతిగా మారే ఆత్మభాషను వెలిబుచ్చుతుంది  కవితాసందేశం జీవితపు గాయాలపై పూసిన అక్షర మల్లెపువ్వై  చీకట్లోనూ దీపమై నిజాలను నెమ్మదిగా హృదయాలకు చేరవేసే అనంతమైన భావమవుతుంది  ఇవన్నీ వేర్వేరు మార్గాలైనా గమ్యం ఒక్కటే— మనిషిని మనిషిగా నిలబెట్టే సత్యసందేశం మదుల్లో నిలిచిపోతుంది  ఇన్ని సందేశాలు నేను రాసినవని మీరు వింటున్నారేమో… కానీ వాటిలో నన్ను నేను వినిపించుకున్నాను అక్షరాల మధ...
కవిగారి స్వగతం (కవితాపైత్యం) కవితలు పుటలకెక్కిస్తా సాహితీప్రియులకు అందించి  కమ్మదనాలు చేకూరుస్తా కవితలు వినిపించుతా శ్రావ్యంగా పాడి  శ్రోతలను అలరించుతా కవితలు వెలిగిస్తా కాంతులు ప్రసరించి  వాఙ్ఞయలోకాన్ని ప్రభవిస్తా కవితలు పారిస్తా సాహిత్యక్షేత్రాలను సుసంపన్నం చేస్తా కవితలు పూయిస్తా అందాలు చూపించి కయితానందాలను సమకూరుస్తా కవితలు కాయిస్తా తృప్తిగా ఆరగించమని కవనప్రియులకు వడ్డిస్తా కవితలు పండిస్తా విరమించక  కవితాసేద్యమును కొనసాగిస్తా కవితలు నాటుతా ఏపుగా ఎదిగించి సాహితీవనాన్ని సృష్టిస్తా కవితలు వ్యాపించుతా కవిరాజునై కైతాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తా కవితలు నేర్చుకుంటుంటా ఇంకా ఇంకా కయితారుచులు అందిస్తుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కాఫీకప్పు కబుర్లు ఆవిరి ఊపిరితో ఉదయం పలకరించే చిన్న కాఫీ కప్పు మదిని తడుతుంది నిద్రమత్తును నెమ్మదిగా కరిగిస్తూ ఆలోచనలకు అక్షరాలా వేడిపుట్టిస్తుంది తొలి గుటక తొందరపెడితే మలి గుటక తృప్తినిస్తుంది కప్పు అడుగున మిగిలిన చేదులోనూ జీవితానికి తియ్యనిధైర్యం దాగుంటుంది చక్కెర తీపి, పాల మృదుత్వం కాఫీ వగరు — మూడు కలిసి జీవితరుచిలా మలుచుకుంటాయి వర్షపు ఉదయమైనా ఎండకాల సాయంత్రమైనా సంగతేమైనా సందర్భమేదైనా కాఫీకప్పు తోడుంటుంది కాఫీకప్పు  అందించే శ్రీమతికైనా ఇప్పించే మిత్రులకైనా ధన్యవాదాలు చెప్పటం మరువకు చిన్నదైనా కాఫీ కప్పు— రోజు మొదలవటానికి శుభాల సూచిని  ఉత్సాహ ప్రదాయిని  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 పొగడ్తలు పొగడ్తలు పూల వర్షాల్లా కురిసితే మనసు మైదానంలో ఆత్మవిశ్వాసం మొలుస్తుంది పొగడ్తలు మంచి మాటలై తాకితే అలసిన అడుగులు కూడా మళ్ళీ దారి పట్టుతాయి పొగడ్తలు అద్దంలా నిజాన్ని చూపితే అహంకారము నశిస్తుంది ఆత్మపరిశీలన పెరుగుతుంది పొగడ్తలు అతి కాకుంటే ప్రతిభకు ప్రేరణ లభిస్తుంది ప్రయాణానికి బలం కలుగుతుంది నిజమైన పొగడ్త మదుల నుంచి పుట్టి హృదయాలకు చేరుతుంది మనిషిని  మంచివాడిని చేస్తుంది  పొగడ్తలకు పొంగకు లొంగకు పొగడ్తలను ఆశించకు  విశ్వచించకు గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం9177915285
 సాహిత్య సౌరభాలు అక్షరాల తోటలో అల్లుకున్న భావపుష్పాలు పదాల పుప్పొడితో పరిమళించు సౌరభాలు కలం తాకితే హృదయమే వికసించి మౌనాల మడిలోంచి మధురనాదం పొంగుతుంది శబ్దాలే శిల్పాలై భావాలే రంగులై మనసు గవాక్షంలో అందాల చిత్రాలవుతాయి వేదనకూ ఓ పరిమళం ఆనందానికీ ఓ వాసన సాహిత్య సౌరభాలే జీవితానికి జ్ఞానగంధం కాలం మారినా కలముశక్తి తరగదు కవితా సౌరభాలు తాకుతూనే ఉంటాయి  సాహిత్యసౌరభాలు ఆస్వాదించుదాం అంతరంగాలను ఆనందపరుద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నవ్వులు పువ్వులు నవ్వులు వదన వెలుగులు సూటి సందేశాలు మనో సంతసాలు నవ్వులు తెల్లని మల్లియలు ముద్ద మందారాలు ఎర్రని గులాబీలు నవ్వులు సూర్యుని కిరణాలు జాబిలి వెన్నెలలు తారల తళుకులు నవ్వులు పకపకలు తళతళలు నవనవలు నవ్వులు ఆణిముత్యాలు నవరత్నాలు సప్తవర్ణాలు నవ్వులు అందాల దృశ్యాలు ఆనంద భావాలు అంతరంగ సూచికలు నవ్వులు హృదయపు తలుపులు తిన్నగా తెరిచే తీయని తాళాలు నవ్వులు చీకటి ముడులను విప్పి వేసే వెలుగు రేఖలు నవ్వులు పంచుకుంటే మోమునపూచే పువ్వులు పరిసరాలచల్లే పరిమళాలు నవ్వులు మనుషులకు అందమైన ఆభరణాలు నవ్వులు ఆశల ఆహ్వానాలు అలసిన మదులకు అమృతపు చుక్కలు నవ్వులను స్వాగతిద్దాము పువ్వులను వెదజల్లుదాము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 వెలుగుల వర్ణమాల వెలుగులు వెంటపడుతున్నాయి కలమును చేపట్టమంటున్నాయి వెలుగులు విస్తరిస్తున్నాయి నిజాలను తెలియజేస్తున్నాయి వెలుగులు చీకట్లనుచీల్చుతున్నాయి ఆశలతలుపులను నెమ్మదిగాతెరుస్తున్నాయి వెలుగులు కళ్ళల్లోపడుతున్నాయి విశ్వమును వీక్షించమంటున్నాయి వెలుగులు మదులనుముట్టుతున్నాయి భయాలను మటుమాయంచేస్తున్నాయి వెలుగులు దారిచూపుతున్నాయి కాళ్ళను కదిలించుతున్నాయి వెలుగులు దీపాలనుండిపుడుతున్నాయి జీవితాలకు అర్ధాలనుచెపుతున్నాయి వెలుగులు పంచమంటున్నాయి అఙ్ఞానమును తరుమమంటున్నాయి వెలుగులు హృదులనుతాకుతున్నాయి అంతరంగాలను ఆలోచనలలోముంచుతున్నాయి వెలుగులు అక్షరాలపైపడుతున్నాయి పుటలను ప్రకాశింపజేస్తున్నాయి వెలుగులను విరజిమ్ముదాం ఉల్లాలను ఉత్తేజపరుద్దాం వెలుగులను ఆహ్వానించుదాం విశ్వమును పరిశోధించుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 స్పందనలపర్వం చేయిచాచితే చెంతకుచేరి చేతులుకలుపుతా వేలుచూపితే వెన్నుచూపి దూరంగావెళ్లిపోతా మెత్తగుంటే మెల్లగా పిసికిపెడతా గట్టిగుంటే విరగకొట్టి పిండిచేస్తా తీపిగుంటే గుటుక్కున త్రాగుతా చేదుగుంటే చటుక్కున క్రక్కుతా మాట్లాడితే మూతితెరచి ముచ్చటిస్తా కొట్లాడితే కఠినంగా తిరగబడతా తిన్నగుంటే మిన్నగా ఉండిపోతా వంకరుంటే చక్కగా తీర్చిదిద్దుతా ఎత్తుగుంటే కత్తినిపట్టి కోసేస్తా పొట్టిగుంటే పట్టుకొని సాగదీస్తా మంచిగుంటే మదులను మురిపిస్తా మొండికేస్తే మందలించి మూలపెడతా నవ్వుతుంటే తిరిగి స్పందిస్తా ఏడుస్తుంటే జాలిపడి ఓదారుస్తా ముందుకొస్తే బెట్టుచేయక జతకడతా ఎదురుతిరిగితే నెమ్మదిగా దారికితెచ్చుకుంటా బ్రతిమాలితే బిగిసిపడక ఒప్పుకుంటా స్తుతిమించితే శీఘ్రంగా తప్పుకుంటా మురిపించటమే నా మార్గం మెప్పించటమే నా ధ్యేయం మానవత్వమే నా మూలం మదులుముట్టటమే నా సూత్రం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ఎందుకో? కలగని తృప్తిపడితిని కల్లయని తెలిసికూడా ఊహించి సంతసించితిని నిజముకాదని తెలిసికూడా చెమటోడ్చితి సాధించితిని ప్రయోజనములేదని తెలిసికూడా వెంటబడి దారికితెచ్చితిని మొండిఘటమని తెలిసికూడా ఇష్టపడి ఊడిగంచేసితిని నష్టమేనని తెలిసికూడా ప్రేమించి భంగపడితిని అత్యాశేనని తెలిసికూడా కవ్వించి కాలుదువ్వితిని విజయందుర్లభమని తెలిసికూడా దుష్కర్మలుచేసితి పాపమునొడికట్టుకుంటిని నరకంతప్పదని తెలిసికూడా సలహాలడుగుచుంటి బంధుమిత్రులని పరిహారములేదని తెలిసికూడా పూజలుచేయుచుంటిని కాపాడమనిదేవుళ్ళకి క్షమించుటకష్టమని తెలిసికూడా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 పదహారణాల పక్కాతెలుగు (పదారుగుణాల పక్కాతెలుగు) అచ్చతెలుగు - అందాలమయము అమ్మా-ఆవులశబ్దము - ఆనందభరితము తేటతెలుగు - చిందుశ్రావ్యము తేనెచుక్కలుచల్లు - స్థిరస్థావరము స్వచ్ఛతెలుగు - శ్వేతవెలుగు స్వాతికిరణాలు- చిమ్ముసాధనము జానుతెలుగు - బహుప్రఖ్యాతము వీనులకువిందు - వడ్డించుమార్గము తీపితెలుగు తన్మాత్రము సంతసాలుకూర్చు - సువిశాలమార్గము మేటితెలుగు - ప్రచురణాత్మకము మస్తకాలుమెరిపించు - మహాసాధనము సుందరతెలుగు - సంగీతప్రశస్త్యము కీర్తాలాపనలు - కర్ణాలకుభాగ్యము మంచితెలుగు - మనోహరగానము సుమసౌరభాలు - చల్లుటక్నువు పల్లెతెలుగు - ప్రశంసనీయము జానపదాలదీపం - జనచైతన్యము పట్నతెలుగు - ప్రజలపలుకులు ప్రచారపధాల్లో - నిత్యనూతనాలు వరాలతెలుగు - వాగ్దేవివరము వాక్కులురసాత్మకము - వందనీయము సుస్వరాలతెలుగు - ఎత్తించుగళము సుమధురగీతాలు - అందించుపీయూషము బంగారుతెలుగు - మోములవెలుగు కులుకులొలుకు - నవ్వులచందనము రత్నాలతెలుగు - నిధులనిక్షేపము ముత్యాలజిలుగులు - వెదజల్లువిశ్వము అజంతాతెలుగు - పలుప్రక్రియలప్రవాహము ప్రచండపవనము - ప్రపంచవ్యాప్తము మనతెలుగు - మనోరంజకము మహిమాన్వితము - మహిలోవిశిష్టము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 సాహితీప్రపంచం సాహితీజగతి స్వాగతిస్తున్నాది అందాలప్రకృతి అలరించుచున్నాది అక్షరవిత్తనాలు నాటమంటున్నాయి పచ్చనీమొక్కలు పొడుచుకొస్తామంటున్నాయి ఆలోచనాధారలు ఊరుతామంటున్నాయి భావాలజ్వాలలు పారుతామంటున్నాయి పదాలపుష్పాలు పూస్తామంటున్నాయి సుమాలసౌరభాలు చల్లుతామంటున్నాయి తేనెపలుకులు విసరమంటున్నాయి సీతాకోకచిలుకలు ఎగురుతామంటున్నాయి కవనమేఘాలు తేలుతామంటున్నాయి అమృతజల్లులు కురుస్తామంటున్నాయి ప్రాసల ప్రవాహాలు ప్రయోగించమంటున్నాయి పాఠకుల హృదయాలు స్పర్శించమంటున్నాయి నవ్వుల చరణాలు నాట్యం చేస్తామంటున్నాయి మోముల వెలుగులు ముసురుతామంటున్నాయి కవితా కెరటాలు ఎగిసిపడతామంటున్నాయి చక్కనీ జాబిలి వెన్నెల వెదజల్లుతానంటున్నాది సాహితీసేద్యము చేయమంటున్నాది సాహిత్యయాత్రను సాగించమంటున్నాది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 వింతలోకం చెప్పమనేవారు కొందరు చేయమనేవారు మరికొందరు కుదించమనేవారు కొందరు సాగించమనేవారు మరికొందరు పొంగి పొగిడేవారు కొందరు కృంగి తెగిడేవారు మరికొందరు కలంపట్టి రాయమనేవారు కొందరు గళమెత్తి పాడమనేవారు మరికొందరు భరించేవారు కొందరు భారమయ్యేవారు మరికొందరు సూచించేవారు కొందరు నిరసించేవారు మరికొందరు దాచుకునేవారు కొందరు దోచుకునేవారు మరికొందరు శ్రమించేవారు కొందరు శయనించేవారు మరికొందరు ఇదే మన వింతలోకం ఇదే జన వైవిధ్యం కొందరు నింపేవారు మరికొందరు ఖాళీచేసేవారు ఇదంతా విచిత్రలోకం మనమే తీర్చిదిద్దేలోకం మంచి మనుషులలోకం మారుస్తుంది ఈలోకం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 మాటలు — మనసును మేల్కొలిపే మంత్రాలు మాటలు ఊహలను కదిలిస్తే ఉషోదయాలే రూపమెత్తుతాయి మాటలు మనసును తట్టితే మౌనాన్నే మేలుకొలుపుతాయి మాటలు హృదయాన్ని కట్టేస్తే హరివిల్లులై మెరుస్తాయి మాటలు గుండెలను తాకితే పద్మాలై వికసిస్తాయి  మాటలు జీవితాన్ని పలికిస్తే జ్యోతిరేఖలై జాగృతపరుస్తాయి మాటలు పదాలై ప్రకాశిస్తే మదిపొంగులే కవితలవుతాయి మధురమాటలు ఎప్పుడైనా - ఎక్కడైనా అంతరంగాలను అంటుకుంటాయి మంచిమాటలు ఎవరివైనా- ఎందుకైనా ప్రేరణలై కదిలిస్తాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కలం విన్యాసాలు కలం పుటలను తడుపుతుంది, కాంతులు చిమ్ముతుంది, కన్నులను వెలిగిస్తుంది. కలం ఊహలకు రూపమిస్తుంది, భావాలను వెల్లడిస్తుంది, సాహిత్యసౌభాగ్యం సృష్టిస్తుంది. కలం పువ్వులను పూయిస్తుంది, నవ్వులను కురిపిస్తుంది, మనసులను మురిపిస్తుంది. కలం గుండెగుబులు పలుకుతుంది, గాయాలకు మందుపెడుతుంది, గమ్యస్థానాలకు నడిపిస్తుంది. కలం చిరుగాలిలా విస్తరిస్తుంది, నదినీరులా ప్రవహిస్తుంది, కడలిలా ఎగిసిపడుతుంది. కలం వానచినుకులు కురిపిస్తుంది, నిప్పురవ్వలు చిందిస్తుంది, హృదయధ్వనులు వినిపిస్తుంది. కలం గళన్ని ఎత్తిస్తుంది, గీతాన్ని పాడిస్తుంది, గతిని దారినిపెడుతుంది/ కలం అమృతాన్ని చిలుకరిస్తుంది, సుగంధాన్ని చల్లుతుంది, వెన్నెలను కాయిస్తుంది. కలం శక్తిని నింపుతుంది, యుక్తిని చూపుతుంది, రక్తిని రగిలిస్తుంది. కలం చేతిని కదిలిస్తుంది, మూతిని పలికిస్తుంది, ప్రీతిని చాటుతుంది. కలం అక్షరవిన్యాసాలు చేయిస్తుంది, పదప్రయోగాలు కనబరుస్తుంది, సాహిత్యమును సంపన్నంచేస్తుంది. కలం కవిత్వమును ఉన్నతపథంలో నడిపిస్తుంది, కవన రాజ్యాలను నిర్మింపజేస్తుంది, కవులకు కిరీటధారణ చేయిస్తుంది. --గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 గళం - ప్రేరణా శంఖం గళం నాదం వినిపిస్తే గాలికి కూడా గర్వమేస్తుంది గళం గుండెను విప్పితే గుసగుసల్ని కూడా గానంచేస్తుంది గళం గర్జన మొదలెడితే నిజానికి కూడా బాసటవుతుంది గళం మృదు మధురమైతే హృదులకు కూడా మత్తేక్కిస్తుంది గళం నినాదమైతే శ్రోతలకు కూడా పనిపెడుతుంది గళం శ్రావ్యత కురిపిస్తే పశువులను కూడా పరవశపరుస్తుంది గళం శుభం పలికితే తధాస్తుదేవుళ్ళు కూడా దీవెనలందిస్తారు గళం పూనుకుంటే నిశ్ఛబ్ధం కూడా పటాపంచలవుతుంది గళం తేనెచుక్కలు చల్లితే వీనులకు కూడా విందుదొరుకుతుంది గళం  నదిలా పారితే జీవననౌక కూడా ముందుకు సాగుతుంది గళం ఎప్పుడూ గరళం కాకూడదు వీచాలి హృదయ తరంగాలు ఇవ్వాలి ఉల్లాలకు ఉత్సాహాలు గళం ఎన్నడూ శబ్దం మాత్రమేకాదు చెయ్యాలి మౌనంపై పోరాటాలు ఊదాలి ప్రేరణా శంఖారావాలు ---గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 మన ఆంధ్రా ఆంధ్రుల గర్వం భాగ్యనగరం ఆంధ్రుల భవితవ్యం అమరావతిపట్నం ఆంధ్రుల తెలుగు రంగుల వెలుగు అంధ్రుల ఘనత కాకతీయ చరిత ఆంధ్రుల భూమి అందాల స్వర్గం ఆంధ్రుల కలిమి ఆనంద తాండవం ఆంధ్రుల తెలివి జగతికి ఆదర్శం ఆంధ్రుల సరణి అనుసరణీయం ఆంధ్రుల పలుకులు తేనియల జల్లులు ఆంధ్రుల పెదవులు అమృత నిలయాలు ఆంధ్రుల పద్యాలు తెలుగోళ్ళ ప్రత్యేకము ఆంధ్రుల గళాలు గాంధర్వ గానాలు ఆంధ్రుల ఖ్యాతి అజరామరం ఆంధ్రుల జాతి అవనికితలమానికం ఆంధ్రుల అక్షరాలు గుండ్రని ముత్యాలు ఆంధ్రుల పదాలు అజంతా స్వరాలు ఆంధ్రుల వరాలు క్రిష్ణా-గోదావరులు ఆంధ్రుల సిరులు ఆత్మాభిమానాలు ఆంధ్రదేశము దేవతల నిలయము ఆంధ్రుల ఆరాధ్యము తిరుపతి వెంకటేశుడు తెలుగుమాతకు మల్లెలదండ అలంకారం  త్రిలింగనేలకు కర్పూర నీరాజనం ఆంధ్రులకు జైకొట్టుదాం తెలుగోళ్ళని పైకెత్తుదాం తెనుగును తలకెత్తుకుందాం అంధ్రవైభవాన్ని విశ్వానికిచాటుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ కడుపుమండిన కవీ! కలమును చేతపట్టు కరవాలంలా విసురు చెమటను చిందించు రక్తాన్ని రగిలించు నిప్పురవ్వలు క్రక్కు అవినీతిని కాల్చు గట్టిగా గళమునెత్తు విషబాణాలు వదులు ఉద్యమాలు చేయించు విజయాలు సాధించు చరిత్రపుటలకు ఎక్కు చిరంజీవిగా నిలువు సమాజశ్రేయస్సును కోరు శుభకార్యాలను జరిపించు జనాన్ని చైతన్యపరచు ఇనుపసంకెళ్ళను తెంచు అభివృద్ధిని ఆకాంక్షించు సంక్షేమాన్ని సాధించు కడుపుమండిన కవీ కదులు ముందుకుకదులు -- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
 ఓ చిట్టి చిలకమ్మా! గూట్లోకి రమ్మంటావా గూబలో గుసగుసలాడమంటావా గూడులోకి దూరమంటావా గణగణమని గంటలుమ్రోగించమంటావా గుమ్మం బార్లాతెరుస్తావా లోనికి సాదరంగాస్వాగతిస్తావా గోరుముద్దలు పెడతాతింటావా గుటగుటా గుటుక్కునమ్రింగుతావా గుడిసెను పావనంచేయమంటావా గుడిని తలపించమంటావా గులాబీలు గంపెడుతెమ్మంటావా గృహాన్ని గుబాళింపజేయమంటావా గింజలు చేతికివ్వమంటావా గొంతులోకి క్రుక్కమంటావా కొత్తగుడారం కట్టివ్వమంటావా క్రొత్తకాపురం పెట్టించమంటావా గగనమంతా ఎగురుతావా విహారయాత్రలు చేసివస్తావా గుడ్లును పెడతావా గబాలున పొదుగుతావా గుడ్ బై చెప్పమంటావా సెలవు తీసుకోమంటావా గడియ వేసుకుంటావా గమ్ముగా నిద్రలోకిజారుకుంటావా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
కవిని రోదసికి వెళ్ళివస్తా, రిక్కలని సర్దివస్తా. మేఘాలపై కూర్చుంటా, పుడమిపై పరిభ్రమిస్తా. అక్షరాలు కురిపిస్తా, పదాలు పారిస్తా. రవితో మాట్లాడుతా, శశితో సంప్రదిస్తా. వెలుగులు చిమ్ముతా, వెన్నెలను వెదజల్లుతా. మాటలు విసురుతా, గళాలు తెరిపిస్తా. ఊహలు ఊరిస్తా, భావాలు తేలుస్తా. పువ్వులు చల్లుతా, నవ్వులు చిందిస్తా. మల్లియలు పూయిస్తా, సౌరభాలు వ్యాపిస్తా. దండలు అల్లుతా, మెడలు అలంకరిస్తా. మదులను ముట్టుతా, తనువులు తట్టుతా. అందరినీ ఆహ్వానిస్తా, ఆనందాల్లో ముంచేస్తా. కలాన్ని వెలిగిస్తా. పుటల్ని మెరిపిస్తా. సాహిత్యాన్ని పోషించుతా, పాఠకుల్ని ప్రోత్సహించుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 వృద్ధుడను వ్యర్ధుడను వ్రాలిపోయే వృక్షమును రాలిపోయే పుష్పమును ఎండిపోయే కొమ్మను ఊడిపడే ఆకును ఆరిపోయే దీపమును ఆగిపోయే గుండెను వీడుబోయిన పొలమును తగలబెట్టిన పంటను ఆకర్షణలేని రూపమును ఆకట్టుకోలేని అక్షరమును పుచ్చిపోయిన విత్తనమును చెడిపోయిన ఫలమును పదునులేని ఖడ్గమును సిరాలేని కలమును వయసుమీరిన వృద్ధుడను శక్తిలేని అసమర్ధుడను అస్తమిస్తున్న సూరీడును కదలలేకున్న కలమును రాహుమ్రింగుతున్న చంద్రుడను కూలుపోబోతున్న నక్షత్రమును జుట్టులేని శిరమును ఊహలుడిగిన మనసును చూపుమందగించిన అంధుడను వినికిడితగ్గిన బధిరుడను కరిగిపోయే కాలమును ఎగిరిపోయే దూదిపింజను కాల్చబోయే కాయమును గోడకేలాడబోయే చిత్రమును రాయాలనుకున్న కవితలుకూర్చలేనివాడను పాడాలనుకున్నా గళమునెత్తలేనివాడను సాహితీసేవను సాగించలేనివాడను కవితాజల్లులును కురిపించలేనివాడను డబ్బులు లేనివాడను జబ్బులు ఉన్నవాడను ఇంటికి బరువును భూమికి భారమును ఏమయినా అక్షరాల్లో ఇంకా మండుతుంటా వెలుగుతుంటా మదుల్లో మెదులుతుంటా జనాల్లో జీవిస్తుంటా -- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం