Posts

Showing posts from January, 2026
 అక్షరాల పరిమళం  అక్షరాల్తో తేనెచుక్కలు చల్లుతా — జనుల నాలుకలపై తీపిరుచులు పారిస్తా. అక్షరాల్తో వానచినుకులు కురిపిస్తా — ఎండిన మనసుల నేలపై ఆశల మొగ్గలు మొలకెత్తిస్తా. అక్షరాల్తో తలలోతలపులు పారిస్తా — ఆలోచనల అంచుల్లో భావాల నదులు ప్రవహింపజేస్తా. అక్షరాల్తో భావబండారాలను బయటపెడతా — మౌనాల తాళాలు విప్పి నిజాల్ని నుదిటిపై పెడతా. అక్షరాల్తో పువ్వులు పూయిస్తా — పదాల పొదల్లో పరిమళాల పండుగలు జరిపిస్తా. అక్షరాల్తో నవ్వులు చిందిస్తా — చీకటి చెరువుల్లో వెలుగుల కమలాలు వికసింపజేస్తా. అక్షరాల్తో సుమసౌరభాలు వ్యాపిస్తా — సాహితీ గాలుల్లో సుగంధాల వానలు కురిపిస్తా. అక్షరాల్తో తెలుగు వెలుగులు చిమ్ముతా — పాఠకుల గుండెల్లో మాతృభాష దీపాలు వెలిగిస్తా. అక్షరాల్తో తనువులు తడతా — చల్లని వెన్నెలలో హాయిగా విహరింపజేస్తా. అక్షరాల్తో మనసులు మీటుతా — మౌనాల మధ్య మధురమైన మాటలు వినిపిస్తా. అక్షరాల్తో కలము కదిలిస్తా — నిద్రపోయిన కాలాన్ని కవితలతో మేల్కొలుపుతా. అక్షరాల్తో కవితలు సృష్టిస్తా — ఆశల ఆకాశంలో కలల రెక్కలు కట్టిస్తా. — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ముఖసంకేతాలు ఒక్కోసారి మొహం ఎత్తుకుంటా — మనసులోని నిజాయతీకి పతాకం ఎగరేస్తూ, చూపుల్లో సత్యం మెరిపిస్తూ, అడుగుల్లో న్యాయం నడిపిస్తూ. ఒక్కోమారు మొహం తిప్పుకుంటా — అన్యాయపు ఆడంబరాల రభసలకు, అబద్ధపు అరాచకాలకు సాక్షిభూతం కాకూడదనుకుంటూ. ఒక్కోవేళ మొహం మాడ్చుకుంటా — అహంకార జ్వాలకు కాలిన గర్వానికి గుణపాఠం చెప్పాలని తలంచుతూ. ఒక్కోక్షణాన మొహం వెలిగిస్తా — మమత దీపంతో, మానవత్వ నూనెతో మనుజుల హృదయాల్లో వెలుగులు నింపాలనుకుంటూ. ఒక్కోనిమిషాన మొహం దించుకుంటా — తప్పు తెలిసిన వేళ తలవంచి క్షమాపణ చెప్పి, మళ్లీ మంచికి అడుగులేయాలని తలచుకుంటూ. ఒక్కోసమయాన మొహం అలంకరించుకుంటా — స్నేహపు చిరునవ్వులతో, స్నేహ సుగంధాలతో, ప్రేమపూల పరిమళాలతో వ్యాపించాలనుకుంటూ. ఒక్కోపొద్దు మొహం చిట్లిస్తా — చీకటి కళ్లల్లో వెలుగులు నింపుతూ, చెడుబుద్ధికి — చెడ్డ పనికి నిరసన ప్రకటిస్తూ. ఎప్పుడైనా — మొహం మనసుకు సంకేతం, మొహం హావభావాల ప్రకటనాస్థలం, అందచందాల ఆదిస్థానం. మొహం పరిచయం, ప్రమాణం, మానవత్వం, ప్రతిరూపం. — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం